HYD : ప్రశాంతత కోసం వస్తే.. ఇందిరా పార్కులో ఏంటిది.. ఇలాగైతే ఎలా..!

ABN , First Publish Date - 2021-11-26T18:10:14+05:30 IST

HYD : ప్రశాంతత కోసం వస్తే.. ఇందిరా పార్కులో ఏంటిది.. ఇలాగైతే ఎలా..!

HYD : ప్రశాంతత కోసం వస్తే.. ఇందిరా పార్కులో ఏంటిది.. ఇలాగైతే  ఎలా..!

హైదరాబాద్ సిటీ/కవాడిగూడ : ప్రశాంతత కోసం ఇందిరా పార్కుకు వెళ్తే ముక్కు మూసుకోవాల్సి వస్తోంది. పార్కులో ఉన్న టాయిలెట్స్‌, బాత్‌రూంలను శుభ్రం చేయకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దాంతో పార్కుకు వచ్చే సందర్శకులు, వాకర్స్‌ ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై ప్రతి రోజూ పార్కుకు వచ్చే పలువురు ఇందిరాపార్కులో ఉన్న ఉద్యానవన శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు. మరికొంత మంది ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చిన పెడచెవిన పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


ఇక పార్కులో నిత్యం టాయిలెట్లు, బాత్రూంలను శుభ్రం చేయాల్సిన సిబ్బంది నామామాత్రంగా చేసి చేతులు దులుపుకోవడంతో అవి అపరిశుభ్రంగా మారి దుర్వాసన వెలువడుతోంది. దాంతో పాటు పార్కులో ఉన్న మరికొన్నింటికి తాళాలు వేయడంతో సందర్శకులు, వాకర్స్‌ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని నెలలుగా ఇందిరా పార్కులోని అన్ని టాయిలెట్లు, బాత్రూంలలో ఇదే పరిస్థితి నెలకొంది. ఉన్న కొన్నింటిలోనూ నల్లాలు విరిగి నీటీ సరఫరా కావడం లేదు. 


పార్కులో సందర్శకులు సదుపాయాలు కల్పించాల్సిన అధికారులు, కాంట్రాక్టర్‌కు వత్తాసు పలుకుతుండడంతో, నాణ్యత లేని నల్లాలు, వస్తువులను  ఏర్పాటు  చేశారని పలువురు వాకర్స్‌ ఆరోపిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి సమీపంలో ఉన్న ఇందిరాపార్కు పరిస్థితి ఇలా ఉంటే, నగరంలో ఉన్న మిగతా పార్కు ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా జీహెచ్‌ఎంపీ ఉన్నతాధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించి పార్కులోని టాయిలెట్స్‌, బాత్రూంల సమస్యను పరిష్కరించాలని సందర్శకులు, వాకర్స్‌ కోరుతున్నారు.

Updated Date - 2021-11-26T18:10:14+05:30 IST