ఉస్మానియా.. నిధులేవయా.. ఒక్కటీ అమలు చేయలేని పరిస్థితి.. ఎందుకిలా..!?

ABN , First Publish Date - 2022-05-21T17:42:59+05:30 IST

ఓయూకు (Osmania University) పూర్తి స్థాయి వీసీగా ప్రొఫెసర్‌ రవీందర్‌ బాధ్యతలు చేపట్టి...

ఉస్మానియా.. నిధులేవయా.. ఒక్కటీ అమలు చేయలేని పరిస్థితి.. ఎందుకిలా..!?

  • 21 అంశాలతో వీసీ రోడ్‌ మ్యాప్‌
  • భర్తీ కాని ఖాళీ పోస్టులు

ఓయూకు (Osmania University) పూర్తి స్థాయి వీసీగా ప్రొఫెసర్‌ రవీందర్‌ బాధ్యతలు చేపట్టి ఏడాది. 21 అంశాల రోడ్‌ మ్యాప్‌తో (Road Map) ముందుకొచ్చిన ఆయన వర్సిటీలో తన మార్కు పాలన చూపించాలని ఉత్సాహం ప్రదర్శించారు. కానీ, నిధుల లేమి అడ్డంకిగా మారుతోంది. రాష్ట్ర బడ్జెట్‌లో కొత్త హాస్టళ్ల నిర్మాణం, మెరుగైన మౌలిక సదుపాయాలకు నిధులు అందుతాయని ఆశించినా నయా పైసా దక్కలేదు. ఏడాదిలో ప్రగతి పరుగులు అటుంచితే హాస్టళ్లలో కడుపు నిండా రుచికరమైన భోజనం కూడా పెట్టడం లేదని విద్యార్థులు రోడ్డెక్కిన ఘటనలు చోటుచేసుకున్నాయి. టీచింగ్‌, (Teaching) నాన్‌ టీచింగ్‌ ఖాళీ పోస్టులు (Posts) భర్తీకి నోచుకోలేదు. 


హైదరాబాద్‌ సిటీ : ఓయూ వీసీగా ప్రొఫెసర్‌ రవీందర్‌ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత 21 అంశాలతో రోడ్‌ మ్యాప్‌ ప్రకటించారు. గతంలో వీసీలుగా, ఇన్‌చార్జి వీసీలుగా పనిచేసినా ఏ ఒక్కరూ ఇలాంటి ప్రకటన చేయలేదు. వర్సిటీలో 500 మంది విద్యార్థులకు సరిపడే విధంగా ప్రత్యేకంగా రీడింగ్‌ రూమ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తామని వెల్లడించారు. వర్సిటీకి వందేళ్లు పూర్తయిన సందర్భంగా సెంచురీ మెమోరియల్‌ భవన నిర్మాణం కోసం ప్లాన్‌ (Plan) చేశారు. ఇలా ఆయన ప్రకటించిన రోడ్‌ మ్యాప్‌లోని అంశాలు నిధుల లేమితో కార్యరూపం దాల్చలేదు. వర్సిటీలోని భవనాలను మరమ్మతులతో పాటు హ్యూమన్‌ క్యాపిటల్‌ డెవలప్మెంట్‌ సెంటర్‌ ఏర్పాటుకూ నిధులే అడ్డంకిగా మారాయి. అన్ని విభాగాల డేటా సెంట్రలైజ్డ్‌ చేసే ప్రక్రియ కూడా పూర్తవ్వలేదు. విద్యా సంవత్సరం నుంచైనా ఈ-ఆఫీసు (E-office) అందుబాటులోకి వస్తుందా..? లేదా..? అనే సందేహాలు నెలకొన్నాయి. విద్యార్థులు, అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన గ్రీవెన్స్‌ సెల్‌ (Greven Cell) అందుబాటులోకి రాలేదు. వర్సిటీలోకి విద్యార్థుల నుంచి ప్రొఫెసర్ల వరకు ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన పాస్‌ల జారీ ప్రకటన కూడా అమలుకు నోచుకోలేదు.


పూర్తికాని భూముల డిజిటలైజేషన్‌..

యూనివర్సిటీ భూములు, స్థలాలను పూర్తిగా డిజిటలైజ్‌ చేస్తామని, ఆక్రమణకు గురవ్వకుండా తగిన చర్యలు తీసుకుంటామని వీసీ ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు ఈ ప్రక్రియ చేపట్టలేదు. పైగా సుమారు వెయ్యి చ.గజాలకు పైగా వర్సిటీ స్థలాన్ని పెట్రోల్‌ బంక్‌కు (Petrol Bunk) లీజుకు ఇచ్చారు. ఇప్పటికే వర్సిటీ స్థలాలు లీజుకు తీసుకున్న సంస్థలు పూర్తిస్థాయి హక్కులు పొందేందుకు తెరచాటు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో వర్సిటీ భూములు లీజుకివ్వడంపై విమర్శలు వస్తున్నాయి.


పోస్టుల భర్తీ ఎప్పుడో..?

ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంలో ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ (Green Signal) ఇచ్చింది. వర్సిటీలో 964 పోస్టులు ఖాళీగా ఉంటే 415 పోస్టులను భర్తీ చేయాలని ఐదేళ్ల క్రితమే ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో అవసరమున్న డిపార్ట్‌మెంట్లకు పోస్టులను పెంచుకుని, అవసరం లేని వాటికి తగ్గించుకునే ప్రక్రియ, రోస్టర్‌ పాయింట్లు వంటి అంశాలపై అప్పట్లోనే వర్సిటీ అధికారులు దృష్టి సారించారు. 219 అసోసియేట్‌ ప్రొఫెసర్లను, 121 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఇతర పోస్టులతో కలిపి 415 ఖాళీలను భర్తీ చేయడానికి కసరత్తు చేశారు. కానీ, పోస్టులు మాత్రం భర్తీ చేయలేదు. ప్రస్తుతం వర్సిటీలో టీచింగ్‌ పోస్టులు వెయ్యి వరకు, నాన్‌ టీచింగ్‌ పోస్టులు (Non Teaching) 2500 వరకు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా కాంట్రాక్ట్‌, పార్ట్‌టైమ్‌ ప్రాతిపదికన అధ్యాపకులను నియమించి తరగతులు నిర్వహిస్తున్నారు. కానీ, పోస్టుల భర్తీ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. 

Updated Date - 2022-05-21T17:42:59+05:30 IST