- సినీ గేయ రచయిత భువనచంద్ర
- ఆస్కాలో ‘గాన - సాహితీ దిగ్గజాలకు శ్రద్ధాంజలి’
చెన్నై/అడయార్ : సాధారణంగా ఒక మర్రి చెట్టుకింద ఒక గడ్డిపోచకూడా మొలకెత్తదని, కానీ, గానగంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం అనే మహావృక్షం కింద ఎందరో గాయనీ గాయకులు పుట్టుకొచ్చారని ప్రముఖ సినీ గేయరచయిత భువనచంద్ర గుర్తుచేశారు. ఎస్పీబీ ఒక ప్రాంతానికో రాష్ట్రానికో చెందినవాడు కాదని, ఆయన ఓ విశ్వమానవుడని ఆయన శ్వాసే పాట అని, పాటే శ్వాస అని పేర్కొన్నారు. స్థానిక టి.నగర్లోని ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ (ఆస్కా) ఇటీవల కన్నుమూసిన సినీ నేపథ్యగాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సినీపాటల రచయిత వెన్నెలకంటిలకు ‘గాన - సాహితీ దిగ్గజాల ఆత్మీయ శ్రద్ధాంజలి’ కార్యక్రమాన్ని నిర్వహించింది.. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆడిటర్ జేకే రెడ్డి అధ్యక్షత వహించగా, ఆస్కా అధ్యక్షుడు డాక్టర్ కె.సుబ్బారెడ్డి, ప్రముఖ వైద్య నిపుణుడు సీఎంకే రెడ్డి, నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్, సినీ పాటల రచయిత భువన చంద్ర, సంగీత దర్శకుడు సాలూరి వాసూరావు తదితరులు అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు వెన్నెలకంటి కుటుంబ సభ్యులు, ఎస్పీబీ సోదరి, సోదరుడి కుమారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భువనచంద్ర మాట్లాడుతూ, ఎస్పీబీ, వెన్నెలకంటిలతో తనకు ఎంతో సాన్నిహిత్యం వుండేదన్నారు. ముఖ్యంగా వెన్నెలకంటి ఏనాడు కూడా తనను పేరుపెట్టిన పిలిచి సందర్భాలు లేవన్నారు. ఎప్పుడూ ఆప్యాయంగా అన్నయ్య అని పిలిచేవారన్నారు. అలాగే, తాను కూడా వెన్నెలకంటిని ఎప్పుడు కూడా పేరుతో పిలవలేదని, బుల్లబ్బాయ్ అని ముద్దుగా పిలిచేవాడినని చెప్పారు. తామిద్దరం కలిసి ట్రావెల్ చేసినపుడు ఖచ్చితంగా బాలు ప్రస్తావన వస్తుందన్నారు. బాలు లేనిదే తాను లేనని పదేపదే వెన్నెలకంటి చెబుతుండేవారన్నారు. వెన్నెలకంటికి భాషపై మంచి పట్టుఉండేదన్నారు. అందుకే పది నిమిషాల్లో ఎలాంటి పాటనైనా అవలీలగా రాసి ఇచ్చేవారన్నారు. అలాంటి రచయిత ఇక పుట్టబోరన్నారు.
అలాగే, ఎస్పీబీ ఏ ఒక్క ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదన్నారు. అంటార్కిటికాలో మినహా విశ్వమంతా బాలు పాట విన్నవారేనన్నారు. అందుకే ఎస్పీబీ ఓ యూనివర్శల్ పర్సన్ అని చెప్పారు. అలాగే, ఈ ప్రపంచంలో తెలుగు వారు ఉన్న చోటల్లా బాలు పాట రూపంలో జీవించే ఉన్నారన్నారు. ఎస్పీబీ 74 యేళ్ళు జీవించారనీ, 29 వేల రోజులు, ఆయన పాడింది 47 వేల సినీ పాటలన్నారు. ఇవికాకుండా, పాడుతా తీయగాతో ఇతర కార్యక్రమాల్లో ఆయన పాటలు లెక్కించుకుంటే కొన్ని వేల పాటలు పాడారనీ, ఇన్ని పాటలు ఎవరైనా పాడగలరా అని ప్రశ్నించారు. ఎస్పీబీ ఎంతో ఎత్తుకు ఎదిగినా మనిషిగా ఉన్నారన్నారు. ఎంతో వినయంతో ప్రతి ఒక్కరికీ భుజాలు వంచి నమస్కారం చేశారని, అందుకే ఆయన ప్రతి ఒక్కరి గుండెల్లో మహానుభావుడయ్యారని చెప్పారు.
ఎస్పీబీ గాయకుడు కాదు.. ఓ గురువు: కె.సుబ్బారెడ్డి
కరోనా వైరస్ సోకి ఎస్పీ బాలు చనిపోయారన్న వార్త ఏమాత్రం జీర్ణించుకోలేని విషయమని ఆస్కా అధ్యక్షుడు సుబ్బారెడ్డి అన్నారు. కరోనా లాక్డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత ఎస్పీబీకి సంతాపసభ నిర్వహించాలని భావిం చామన్నారు. ఇంతలోనే గేయ రచయిత వెన్నెలకంటి తిరిగిరాని లోకాలకు చేరు కోవడం మంరితగా శోక సంద్రంలో ముంచిందన్నారు. వీరిద్దరికీ ఆస్కా తో ఎంతో అనుబంధముందన్నారు. వీరిద్దరికి కలిపి ఈ సంతాపసభ నిర్వహించడం అనేది జీర్ణించుకోలేని విషయమన్నారు. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్కు తరలి వెళ్ళినప్పటికీ ఎస్పీబీ మాత్రం చెన్నైను వీడలేదన్నారు. చెన్నై అంటే ఆయనకు అంత ప్రేమ అని చెప్పారు. ముఖ్యంగా చెన్నైలోనే నివసిస్తూ తెలుగు ప్రతినిఽధిగా ఉంటానని చెప్పారని గుర్తు చేశారు. ఎస్పీబీ ఆస్కా సభ్యుడుగానే కాకుండా, ప్రతి ఒక్కరితోనూ సన్నిహితంగా ఉండేవారన్నారు. అలాగే, వెన్నెలకంటి గురించి ఇక చెప్పనక్కర్లేద న్నారు. ఆయన ఎక్కువ రోజులు ఇక్కడే గడిపేవారన్నారు. వీరిద్దరూ వారివారి రంగాల్లోనే కాకుండా, ప్రతి అంశంపై మంచి అవగాహన కలిగిన లబ్దప్రతిష్టులుగా కొనసాగారన్నారు.
ప్రతిభను గుర్తించడంలో ఎస్పీబీ దిట్ట: సీఎంకే రెడ్డి
యువతలోని ప్రతిభను గుర్తించడంలో ఎస్పీబీ మంచి దిట్ట అన్ని డాక్టర్ సీఎంకే రెడ్డి అన్నారు. గత 1983లో ముంబైలో ఒక టోర్నీలో పాల్గొనేందుకు స్పాన్సర్లు లేక ఓ వ్యక్తి ఎస్పీబీ వద్దకు వస్తే, ఆ వ్యక్తికి స్పాన్సర్ చేసి, ముంబైకు పంపించిన వ్యక్తి ఎస్పీబీ అని గుర్తుచేశారు. ఆనాడు బాలు పంపించిన వ్యక్తి ఎవరో కాదనీ మాజీ ప్రపంప చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ అని చెప్పారు. అలా ఎంతోమంది యువతీ యువకుల్లోని ప్రతిభను గుర్తించి గాయనీగాయకులుగా తీర్చిదిద్దిన గాయకుడు ఎస్పీబీ అని చెప్పారు. బాలు 17 భాషల్లో పాటలు పాడారనీ, కన్నడ భాషలో ఒకే రోజు 21 పాటలు పాడిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. వెన్నెలకంటితో కూడా తనకు ఎంతో సాన్ని హిత్యం ఉండేదన్నారు. భాషతో పాటు సాహిత్యంపై పట్టున్న రచయిత వెన్నెలకంటి అని చెప్పారు.
ఆ 21 పాటల్లో 5 పాటలు నావే: కాట్రగడ్డ ప్రసాద్
బాలు ఒకే రోజున కన్నడంలో 21 పాటలు పాడారని, అందు లో తన చిత్రాలకు చెందిన ఐదు పాటలు ఉన్నాయని ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ గుర్తుచేశారు. ఎస్పీబీ అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరినపుడు తాను కూడా ఆస్పత్రిలో ఉన్నానని, చనిపోయినపుడు కూడా ఆయన పార్థివదేహం వద్ద ఉన్నానని గుర్తుచేశారు. అలాగే, వెన్నెలకంటితో కూడా తనకు ప్రత్యేకమైన అనుబంధం, స్నేహం వుండేదన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో ప్రముఖ కళాకారుడు ఘంటసాల రత్నకుమార్, ఆస్కా మాజీ అధ్యక్షుడు ఎం ఆదిశేషయ్య తదితర ప్రముఖులెంతో మంది పాల్గొన్నారు. అలాగే, ఈ కార్యక్రమంలో ఎస్పీబీ సోదరుడి కుమారుడు ఎస్పీ అశోక్, ఎస్పి. వసంత, వెనెల కంటి కుమారుడు రాకేష్, గాయనీమణులు త్రిష, సుష్మ కొన్నిపాటలను ఆలపించారు.