హైదరాబాద్‌ రియల్టీపై ఫార్మా కంపెనీల నజర్‌!

ABN , First Publish Date - 2022-01-14T09:33:14+05:30 IST

హైదరాబాద్‌ రియల్టీపై ఫార్మా కంపెనీల నజర్‌!

హైదరాబాద్‌ రియల్టీపై ఫార్మా కంపెనీల నజర్‌!

భారీగా భూముల కొనుగోలు.. రూ.5,000 కోట్ల వరకు పెట్టుబడులు?


హైదరాబాద్‌: ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు కూడా హైదరాబాద్‌ స్థిరాస్తి (రియల్టీ) మార్కెట్‌పై అమితాసక్తిని చూపిస్తున్నాయి. తమ వద్ద ఉన్న మిగు లు నిధులతో ఎకరాల కొద్దీ భూములను కొనేస్తున్నాయి. స్థానికంగా ఉన్న హెటిరో, అరబిందో ఫార్మా, దివీస్‌ లేబొరేటరీస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ వంటి కంపెనీలతో పాటు సిప్లా, మోర్పెన్‌ ల్యాబ్స్‌ వంటి కంపెనీలు.. హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల ఇటీవలి కాలంలో రూ.4,000 కోట్ల నుంచి రూ.5,000 కోట్లతో భూములు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఫార్మా కంపెనీల చేతిలో నగరంతో పాటు సమీప ప్రాంతా ల్లో  భూములున్నాయి. తాజాగా పెట్టుబడుల వివిధీకరణలో భాగంగా భారీగా భూములు కొనుగోలు చేస్తూ వస్తున్నాయని రియల్టీ పరిశ్రమ వర్గాలంటున్నాయి. 


ఊరిస్తున్న లాభాలు

మిగతా పెట్టుబడులతో పోలిస్తే హైదరాబాద్‌ రియల్టీలో పెట్టుబడులు ప్రస్తుతం అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. గత రెండేళ్లలో హైదరాబాద్‌ చుట్టుపక్కల వ్యవసాయ భూముల ధర 40 నుంచి 80 శాతం,  నగరంలోని కీలక ప్రాంతాల్లో నివాస స్థలాల ధర 50 శాతం పెరిగింది. దీంతో దండిగా మిగులు నిధులున్న ఫార్మా కంపెనీలు తమ పెట్టుబడుల వివిధీకరణలో భాగంగా చెప్పుకోదగ్గ మొత్తం హైదరాబాద్‌ రియల్టీలో పెట్టుబడి పెడుతున్న ట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కొవిడ్‌ కారణంగా అనూహ్యంగా  కలిసొచ్చిన వ్యాపార వృద్ధితో  ఫార్మా కంపెనీలు ఈ విషయంలో మరింత ముందున్నాయి.


దీర్ఘకాలిక లాభాలు

హైదరాబాద్‌ ప్రస్తుతం దేశంలో ఫార్మా, లైఫ్‌ సైన్సె్‌సకు ప్రధాన కేంద్రంగా మారింది. అనేక కంపెనీలు ఇక్కడ తమ పరిశోఽధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కేందాలతో పాటు ఉత్పత్తి యూనిట్లూ పెడుతున్నాయి. ఒక్క జీనోమ్‌ వ్యాలీ ప్రాంతంలోనే ప్రస్తుతం 25 లక్షల చదరపు అడుగుల (ఎస్‌ఎ్‌ఫటీ) ఆర్‌ అండ్‌ డీ కేంద్రాల నిర్మాణం జరుగుతోంది. దీనికి తోడు ప్రభుత్వ విధానాలు, ప్రతిపాదిత ఫార్మా సిటీ, మెడికల్‌ డివైజెస్‌ పార్కుతో హైదరాబాద్‌ భూములకు మరింత డిమాండ్‌ ఏర్పడింది. దీంతో వచ్చే 10-20 ఏళ్ల పాటు హైదరాబాద్‌ రియల్టీకి ఢోకా ఉండదని మార్కెట్‌ వర్గాల అంచనా. అంతకాలం వేచి ఉంటే పెట్టుబడులపై కనీసం ఆరేడు రెట్ల లాభం ఉంటుందని కంపెనీల అంచనా.ఈ అంచనాలతోనే ఫార్మా కంపెనీలు హైదరాబాద్‌ రియల్టీపై ఆసక్తి చూపిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలంటున్నాయి. 

Updated Date - 2022-01-14T09:33:14+05:30 IST