క్షణ క్షణం.. అనుక్షణం.. ప్రాణాలు తీస్తున్న పడకల కొరత

ABN , First Publish Date - 2021-05-15T14:02:51+05:30 IST

క్షణక్షణం గుండె కొట్టుకోవడం తగ్గుతూ వస్తున్నా... అనుక్షణం పల్స్‌ ఆక్సిమీటర్‌తో పరిశీలిస్తూనే

క్షణ క్షణం.. అనుక్షణం.. ప్రాణాలు తీస్తున్న పడకల కొరత

  • నిలువు దోపిడీ చేస్తున్న ఆస్పత్రులు
  • ఆస్తులు తాకట్టు పెట్టినా కుదుట పడని ఆరోగ్యం
  • చివరి క్షణంలో ప్రభుత్వ ఆసుపత్రికే పంపుతున్న వైనం
  • ఆక్సిజన్‌ బెడ్స్‌కోసం దవాఖానాల చుట్టూ తిరుగుతున్న రోగులు

హైదరాబాద్/మంగళ్‌హాట్‌ : క్షణక్షణం గుండె కొట్టుకోవడం తగ్గుతూ వస్తున్నా... అనుక్షణం పల్స్‌ ఆక్సిమీటర్‌తో పరిశీలిస్తూనే పడకల కోసం పరుగులు పెడుతున్నారు రోగి సహాయకులు. ఇదే అదునుగా భావిస్తోన్న కొన్ని ఆస్పత్రులు వారి వద్దకు వచ్చే వారిని నిలువు దోపిడీ చేసి చివరి క్షణంలో తిరిగి ప్రభుత్వాస్పత్రికే పంపుతున్నాయి. బతుకుజీవుడా అంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కింగ్‌కోఠి, సరోజినీ దేవి, టిమ్స్‌, గాంధీ, ఉస్మానియా ఇలా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల చుట్టూ బాధితులు చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి నెలకొంది.


వరంగల్‌ కున్సికల్స గ్రామానికి చెందిన సుజాత(37)కు ఈ నెల 10న కరోనా పాజిటివ్‌గా వచ్చింది. దీంతో మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రతిరోజూ రూ.లక్షా 50వేలు కట్టాల్సి రావడంతో ఊళ్లో ఉన్న ఎకరంన్నర పొలం పత్రాలను తనఖా(కుదువ) పెట్టి రూ. 4లక్షలు అప్పుగా తెచ్చి మరీ ఆస్పత్రికి కట్టారు. మూడు రోజులకు ఐదు లక్షలకు పైనే ఖర్చు చేసినా ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ప్రైవేట్‌ వైద్యులు మరిన్ని డబ్బులు కడితే తప్ప చికిత్సలు చేయమని చెప్పడంతో చేసేది లేక ఈ నెల 13వ తేదీన ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు మరుసటి రోజు శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో కింగ్‌కోఠి ఆస్పత్రికి పంపించారు. సుజాత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, తమవద్ద ఆక్సిజన్‌ పడకలు ఖాళీ లేవని చెప్పి గాంధీకి తీసుకువెళ్లమని కింగ్‌కోఠి వైద్యులు చెప్పారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సుజాతను అదే అంబులెన్స్‌లో గాంధీకి తీసుకువెళ్లారు.


హైదర్‌షాకోట్‌ ప్రాంతానికి చెందిన వెంకటమ్మ(60) నాలుగు రోజుల క్రితం ఇంటి వద్దప్రమాదవశత్తు జారి పడడంతో సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అప్పటినుంచి జ్వరంతో, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో శుక్రవారం ఉదయం 9 గంటల సమయం లో సరోజినీ దేవి ఆస్పత్రికి తీసుకువచ్చారు. కరోనా పరీక్షలు నిర్వహించిన వైద్యులు పడకలు లేవనే కారణంగా అలాగే వదిలేశారు. అక్కడున్న సిబ్బంది వేరే ఆస్పత్రికి తీసుకువెళ్లమని సలహా ఇవ్వడంతో వెంటనే అక్కడి నుంచి కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రికి 10.30 గంటల సమయంలో తీసుకొచ్చారు. ఆస్పత్రి వైద్య సిబ్బంది పరిశీలించి వెంకటమ్మ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆక్సిజన్‌ బెడ్స్‌ ఖాళీగా లేవని చెప్పి వారిని గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా సూచించారు. ఇలా పడకలు ఖాళీ లేక ప్రభుత్వ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఆక్సిజన్‌ సదుపాయం లేని కార్లో తీసుకువెళ్లడడంతో సదరు వృద్ధురాలు  అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.


షాపుర్‌నగర్‌ నుంచి ఉదయం 11 గంటల సమయంలో వెంటిలేటర్‌పై ఆంబులెన్స్‌లో కింగ్‌కోఠి ఆస్పత్రికి వచ్చిన 50ఏళ్ల వ్యక్తిని లోపలికి తీసుకువెళ్లేందుకు స్ట్రెచర్‌ లేకపోవడంతో రోగి సహాయకులు చేతులపై పట్టుకొని లోనికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా పట్టుతప్పి కిందపడిపోయాడు. అప్పటితో తీవ్ర అనారోగ్యంతో ఉన్న సదరు వ్యక్తికి కనీస సహాయం చేసేందుకు వార్డు బాయ్స్‌ కూడా అందుబాటులో లేకపోవడంతో బంధువులు ఆందోళనకు దిగారు. 


ఆస్పత్రి సిబ్బంది సదరు వ్యక్తిని పరిశీలించి ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని, తమ వద్ద ఆక్సిజన్‌ పడకల కొరత ఉందని వెంటనే గాంధీకి తీసుకువెళ్లాల్సిందిగా ఉచిత సలహా ఇచ్చారు. దీంతో కోపోద్రిక్తులైన రోగి బంధువులు ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. వైద్య సిబ్బంది ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది లేక 11.25 గంటల సమయంలో గాంధీ ఆస్పత్రికి పయనమయ్యారు.


అప్పు చేసి మరీ రూ.5లక్షలు ఖర్చుచేశా..

ఊర్లో ఉన్న భూమి కాగితాలు తాకట్టు పెట్టి మారి రూ. 4 లక్షల అప్పు తెచ్చాను. మొత్తం రూ.5లక్షల వరకు ప్రైవేట్‌ ఆస్పత్రికి కట్టిన. ఎలాంటి ఫలితం దక్కలేదు. 13న ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లమన్నారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసి చివరకు శుక్రవారం ఉదయం కింగ్‌కోఠికి పంపారు. ఇక వీళ్లు కూడా పడకలు లేవని గాంధీకి వెళ్లమని చెప్పారు. గత రెండు రోజులుగా ఆస్పత్రుల చుట్టూ తిప్పుతున్నారు. - శ్రీనివా‌స్(సుజాత బంధువు)


ఆక్సిజన్‌ పడకలు లేవంటున్నారు

మా అమ్మకు బాలేదని మెహిదీపట్నం సరోజినీ దేవి ఆస్పత్రికి తీసుకువెళ్లగా పరీక్షలు చేసి పడకలు లేక కింగ్‌కోఠికి వెళ్లమన్నారు. అక్కడికి వెళ్లిన గంట తర్వాత పడకలు ఖాళీ లేవని, గచ్చిబౌలి టిమ్స్‌కు వెళ్లమన్నారు. టిమ్స్‌లో పడకలు ఖాళీగా ఉన్నాయో లేదో తెలుసుకునేంత వరకు ఆక్సిజన్‌ పెట్టాలని కోరినా స్పందించ లేదు. ఉదయం నుంచి కార్లో ఆక్సిజన్‌ లేకుండానే ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాం. టిమ్స్‌లో పడకలు దొరుకుతాయో లేదో.. అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. - శ్రీను(హైదరాషాకోట్‌)

Updated Date - 2021-05-15T14:02:51+05:30 IST