Nobel గ్రహీత ప్రారంభించిన News Website మూసేయాలంటూ ఆదేశాలు

ABN , First Publish Date - 2022-06-29T22:31:51+05:30 IST

ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ తమ వెబ్‌సైట్‌ను కొనసాగిస్తామని, వారి బెదిరింపులకు భయపడబోమని రెస్సా ప్రకటించారు. తమ వ్యాపారం ఇప్పటి వరకు ఎలా కొనసాగిందో ఇకపై కూడా అలాగే కొనసాగుతుందని ఆమె తెలిపారు...

Nobel గ్రహీత ప్రారంభించిన News Website మూసేయాలంటూ ఆదేశాలు

మనీలా: ప్రఖ్యాత జర్నలిస్ట్, నోబెల్ బహుమతి గ్రహీత మరియా రెస్సా ప్రారంభించిన రాప్లర్ అనే న్యూస్‌ వెబ్‌సైట్‌ను మూసివేయాలంటూ ఫిలిప్పీన్స్ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయట. ఈ విషయాన్ని బుధవారం రెస్సా స్వయంగా ప్రకటించారు. రాప్లర్‌కు రెస్సా కో-ఫౌండర్. ఫిలిప్పీన్స్ ప్రభుత్వంపై ముఖ్యంగా అధినేత రోడ్రిగోపై రెస్సా తీవ్ర విమర్శలు చేస్తుంటారు. నిషేధిత డ్రగ్స్ సరఫరా విషయంలో వీరి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. రాప్లర్‌లో అనేకమైన వార్తా కథనాలు వచ్చాయి. కాగా, రోడ్రిగో గురువారం తన కార్యాలయాన్ని వీడ్కోలు చెప్పనున్నారు. దీనికి సరిగ్గా ఒక రోజు ముందు రాప్లర్ న్యూస్ వెబ్‌సైట్‌ను మూసివేయాలంటూ ఆదేశాలు రావడం గమనార్హం.


ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ తమ వెబ్‌సైట్‌ను కొనసాగిస్తామని, వారి బెదిరింపులకు భయపడబోమని రెస్సా ప్రకటించారు. తమ వ్యాపారం ఇప్పటి వరకు ఎలా కొనసాగిందో ఇకపై కూడా అలాగే కొనసాగుతుందని ఆమె తెలిపారు. ముగ్గురు మహిళా జర్నలిస్టులతో కలిసి రాప్లర్ అనే డిజిటల్‌ మీడియా కంపెనీని 2012లో రెస్సా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సంస్థలో వంద మంది జర్నలిస్టులు పనిచేస్తున్నారు. అధికార దుర్వినియోగం, హింస, ప్రభుత్వపు లోటు పాట్లను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ముఖ్యోద్దేశంగా ఈ వెబ్‌సైట్ నడుస్తున్నట్లు గుర్తింపు ఉంది. తప్పుడు వార్తల్ని బహిర్గతం చేయడంతో పాటు.. అనేక మంది రిపోర్టర్లు, లాయర్ల సహకారంతో వాస్తవాలను వెల్లడిస్తుంటుంది.


కాగా, మాస్ మీడియాలో విదేశీ యాజమాన్యంపై రాజ్యాంగపరమైన, చట్టబద్ధమైన పరిమితులను రాప్లర్ ఉల్లంఘించిందని ఫిలిప్పీన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్(ఎస్ఈసీ) పేర్కొంది. ఈ విషయమై ఎస్ఈసీ నాలుగేళ్ల(2018) క్రితమే ఆరోపణలు చేసింది. తాజాగా అదే సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది. అయితే రాప్లర్‌ను మూసివేయడానికి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తోందనే విమర్శ బలంగా ఉంది. రోడ్రిగో సహాయకుడికి వ్యతిరేకంగా వార్త కథనం రాసినందుకు అప్పట్లో రాప్లర్‌ను ‘ఫెక్ వెబ్‌సైట్’ అనే ప్రచారం జరిగింది. ఇంతే కాకుండా రాప్లర్‌పై రెస్సాపై అనేక కేసులు వేశారు. ప్రభుత్వ మద్దతుదారుల నుంచి ఆన్‌లైన్ ద్వారా అనేక బెదిరింపులు వచ్చినట్లు రెస్సా తెలిపారు. సోషల్ మీడియా వినియోగంపై అనేక పరిమితులు విధించిన ప్రభుత్వం, వార్త సంస్థలపై వాటిని కొనసాగిస్తున్నాయని రాప్లర్ బృందం విమర్శిస్తోంది.

Updated Date - 2022-06-29T22:31:51+05:30 IST