జాతీయ రహదారి విస్తరణకు ప్రాథమిక పనులు చేసిన ముదినేపల్లి – కైకలూరు మార్గం
రోడ్డు వెడల్పునకు రూ.280 కోట్లు..భూ సేకరణకు రూ.150 కోట్లు చెల్లింపు
ముదినేపల్లి, మే 21: పామర్రు – దిగమర్రు (165వ నంబర్) జాతీయ రహదారి విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న ఈ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా తొలి దశలో రూ.280 కోట్లతో పామర్రు, ముదినేపల్లి, మండవల్లి, కైకలూరు మీదుగా ఆకివీడు వరకు రోడ్డును పది మీటర్ల వెడల్పున అభివృద్ధి చేయ నున్నారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక పనులు ప్రారంభ మయ్యాయి. ముదినేపల్లి – కైకలూరు మధ్య రోడ్డు పక్కన జంగిల్ క్లియరెన్స్ పనులను రెండు రోజులుగా చేస్తున్నారు. ముదినేపల్లి నుంచి పెరికిగూడెం వరకు కైకలూరు వెళ్లే రహదారిలో కుడి వైపున పోల్‌రాజ్ ప్రధాన పంట కాల్వ ఉండటంతో ఎడమ వైపున రోడ్డును విస్తరిస్తున్నారు. ఈ జాతీయ రహదారి విస్తరణకు కృష్ణాజిల్లా పామర్రు నుంచి ఆకివీడు వరకు భూసేకరణకు కేంద్ర ప్రభుత్వం రూ.150 కోట్లు నిధులు కేటాయిం చగా, భూ యజమానులకు చెల్లించటం పూర్తయినట్లు జాతీయ రహదార్ల అభివృద్ధి సంస్థ డీఈఈ సత్యనారాయణరావు తెలిపారు. ఈ రహదారిలో బిళ్లపాడు నుంచి పెదపాలపర్రు వరకు బైపాస్ రోడ్డు నిర్మాణంతోపాటు పలు చోట్ల కల్వర్టులు నిర్మిస్తారు. డబుల్ రోడ్డుగా ఉన్న ఈ జాతీయ రహదారి పది మీటర్ల వెడల్పుతో త్రీవేగా మారనుంది. సుమారు 64 కిలో మీటర్లు తొలిదశలో విస్తరించనుండగా, పెదపాలపర్రు, ముదినేపల్లి, మండవల్లి గ్రామాల వద్ద నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరిస్తారు. సర్వీస్ రోడ్లనూ నిర్మిస్తామని డీఈఈ తెలిపారు.
ఎంపీ కోటగిరి కృషితో ఓవర్ బ్రిడ్జి
పామర్రు – దిగమర్రు జాతీయ రహదారిలో భైరవపట్నం రైల్వే గేటు వద్ద ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కృషితో ఓవర్ బ్రిడ్జి నిర్మా ణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి, నిధులు మంజూరు చేసిం దని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తెలిపారు.