NIA searches: కడపలో ఎన్ఐఏ సోదాల కలకలం.. ఉగ్రమూలాలపై తనిఖీలు..

ABN , First Publish Date - 2022-09-19T19:42:17+05:30 IST

కడప (Kadapa): నగరంలో ఎన్ఐఏ (NIA) సోదాలు (Searches) కలకలం రేపుతున్నాయి.

NIA searches: కడపలో ఎన్ఐఏ సోదాల కలకలం.. ఉగ్రమూలాలపై తనిఖీలు..

కడప (Kadapa): నగరంలో ఎన్ఐఏ (NIA) సోదాలు (Searches) కలకలం రేపుతున్నాయి. ఉగ్రవాదులతో సంబంధం ఉన్న వ్యక్తులు ఇద్దరు, ముగ్గురు ఉన్నట్లు సమాచారం ఉండడంతో ఆదివారం ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగుతారని తెలియవచ్చింది. అయితే నిన్న సోదాలు జరగలేదు. సోమవారం కడప నగరానికి ఎన్ఐఏ అధికారులు వచ్చారని, ఏ క్షణంలోనైనా కడప టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోదాలు జరుగుతాయని సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.


కాగా నిన్న నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం (Buchireddypalem)లో ఆదివారం ఎన్‌ఐఏ అధికారుల బృందం సోదాలు నిర్వహించింది. స్థానిక ఖాజానగర్‌లోని షేక్‌ ఇలియాజ్‌ నివాసంలో ఈ సోదాలు చేపట్టారు. తెలంగాణా రాష్ట్రంలోని బైంసా అల్లర్లలో ఇప్పటికే నిజామాబాద్‌కు చెందిన పాపులర్‌ ఫ్రంట్‌ ఆప్‌ ఇండియా (PFI) నాయకుడు షాదుల్లా అరెస్టు అయిన విషయం తెలిసిందే. షాదుల్లాతో ఇలియాజ్‌కు ఉన్న సంబంధాలు ఉండడంతో ఆదివారం వేకువజామున 4 నుంచి ఉదయం 9 గంటల వరకు ఎన్‌ఐఏ అధికారులు ఇలియాజ్‌ ఇంట్లో సోదాలు జరిపారు. దీంతో ఒక్కసారిగా  జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేస్తుండగా, పలువురు స్థానిక పీఎఫ్‌ఐ నాయకులు, ప్రజలు అడ్డుకున్నారు. అసలు ఇలియాజ్‌  ఇంట్లో ఏంజరుగుతుందో చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు.


అప్పటికే సోదాలు పూర్తిచేసుకున్న ఎన్‌ఐఏ అధికారులు అక్కడి నుంచి తిరిగి వెళుతుండగా, వారిని వెంబడించి బస్టాండ్‌ వద్ద అడ్డుకున్నారు. దీంతో బుచ్చి సీఐ సీహెచ్‌ కోటేశ్వరరావు, ఎస్‌ఐ వీరప్రతాప్‌ అందరిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. సీఐ సీహెచ్‌ కోటేశ్వరరావు మాట్లాడుతూ ఇలియాజ్‌కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉండడంతోపాటు ఓ ఉగ్రవాద సంస్థలో ఆయన శిక్షణ పొందినట్లు దొరికిన ఆధారాల మేరకు ఎన్‌ఐఏ అధికారులు  సోదాలు నిర్వహించినట్లు  వివరించారు. తనిఖీలకు అందరూ సహకరించాలని స్థానిక ఖాజానగర్‌వాసులు, పీఎఫ్‌ఐ నాయకులు, ఇలియాజ్‌ కుటుంబ సభ్యులను సీఐ కోరారు. ఈ సోదాల్లో ఎన్‌ఐఏ అధికారులు ఇలియాజ్‌ నివాసం నుంచి  సెల్‌ఫోన్‌, ఓ పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇలియాజ్‌ తల్లిదండ్రుల సంతకాలు సేకరించుకుని, వారికి సీఐ ద్వారా ఓ ప్రతిని అందచేశారు. ఎన్‌ఐఏ అధికారుల సోదాలకు సంబంధించి సీఐ ఎలాంటి వివరాలు బయటకు వెల్లడించలేదు.


Updated Date - 2022-09-19T19:42:17+05:30 IST