గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి కేసు ఎన్ఐఏకు..

ABN , First Publish Date - 2022-04-04T21:25:03+05:30 IST

గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి కేసు విచారణను ఎన్ఐఏ చేపట్టనుంది. ఆలయం వద్ద పదునైన ఆయుధంతో దాడికి దిగిన....

గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి కేసు ఎన్ఐఏకు..

లక్నో: గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి కేసు విచారణను ఎన్ఐఏ చేపట్టనుంది. ఆలయం వద్ద  పదునైన ఆయుధంతో దాడికి దిగిన వ్యక్తిని అహ్మద్ అబ్బాసిగా గుర్తించారు. అతన్ని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆదివారంనాడు ఒక వ్యక్తి గోరఖ్‌నాథ్ ఆలయం ఆవరణలోకి బలవంతంగా ప్రవేశించి ''అల్లా హో అక్బర్" అంటూ కేకలు వేయడంతో పాటు, అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు కానిస్టేబుళ్లపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఆయుధం చూపిస్తూ వీరంగం చేశాడు. దీంతో పది నిమిషాల్లో భద్రతా సిబ్బంది అతన్ని చుట్టుపట్టి అదుపులోనికి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ గోరఖ్‌నాథ్ ఆలయం ప్రధాన పూజరిగా ఉన్నారు. ఈ ఆలయ ఆవరణలో ఆయన వ్యక్తిగత బసకు ఏర్పాట్లు కూడా ఉన్నాయి. దాడి జరిగిన సమయంలో ఆలయంలో ముఖ్యమంత్రి లేరు.


ఉగ్రవాద కోణం...

మతపరమైన నినాదాలు చేస్తూ గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్టు శాంతిభద్రతల అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు గాయపడినట్టు ఆయన చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ఏటీఎస్ టీమ్‌ను కూడా పంపామని అన్నారు. ఉగ్రవాద కోణం నుంచి కూడా కేసును దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. కాగా, నిందితుడు అహ్మద్ ముర్తాజ్ ముంబై ఐఐటీకి చెందిన ఇంజనీర్‌ అని బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి ఒక ట్వీట్‌లో తెలిపారు.


సీసీటీవీ ఫుటేజ్‌లో..

అహ్మద్ ముర్తాజ్ అబ్బాసి చేతిలో డాగర్ పట్టుకుని గోరఖ్‌పూర్ ఆలయం వద్ద కేకలు వేస్తుండగా, పోలీసులు, దుకాణదారులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించినట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపిస్తోంది. ముర్తాజాను అదుపు చేసేందుకు అతన్ని చుట్టుముట్టి కొందరు రాళ్లు రువ్వారు. టెంపుల్ గేట్ వద్ద ఆదివారం రాత్రి 7 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.


ముర్తాజా వివరాలివే..

గోరఖ్‌పూర్ నివాసి అయిన ముర్తాజా ప్రతిష్ఠాత్మక ఐఐడీ-ముంబైలో 2015లో ఇంజనీరింగ్ చేశాడు. ఒక ల్యాప్‌టాప్, ఫోను, ఒక టిక్కెట్ అతని నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిని బట్టి ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉన్నట్టు కనిపిస్తోందని, ఇది ఉగ్రవాద కుట్ర కావచ్చనే విషయాన్ని కూడా కొట్టివేయలేమని ఏడీజీ ప్రశాంత్ కుమార్ చెప్పారు. నిందితుని వద్ద కొన్ని సంచలనమైన వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నామని, వాటిని తర్వాత తెలియజేస్తామని చెప్పారు. సాధారణ ప్రవేశమార్గం ద్వారా అతను లోపలకు అడుగుపెట్టి ఉంటే సాధారణ భక్తులకు కూడా హాని జరిగి ఉండేదని, ఆలయం వద్ద కాపలాగా ఉన్న సిబ్బంది ఎంతో సంయమనంతో వ్యవహరించి, అతన్ని అదుపులోనికి తీసుకున్నారని తెలిపారు. కాగా, ముర్తాజా దాడిలో గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన గోరఖ్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానిక యంత్రాగాన్ని ఓ కుదుపు కుదిపింది.

Updated Date - 2022-04-04T21:25:03+05:30 IST