కేంద్రం.. దారి చూపుతోంది!

ABN , First Publish Date - 2022-05-20T06:36:25+05:30 IST

అంతా మర్చిపోయారు.. ఆ రైల్వేగేటు వద్దకు వెళ్లి ఆగితేనే ఏదో ఆర్‌వోబీ కడతానన్నారు ఏమైందనే ఆలోచన వస్తోంది.. లేదంటే అంతే.

కేంద్రం.. దారి చూపుతోంది!
నిడదవోలు రైల్వే గేటు

నిడదవోలు ఆర్‌వోబీ వైపు కేంద్రం చూపు 

తీరనున్న ఉభయగోదావరి జిల్లా వాసుల కల

కేంద్రం నిధులతో నిర్మించే యోచన

మరో ఐదారు నెలల్లో నిర్మాణానికి శ్రీకారం


నిడదవోలు, మే 19 : అంతా మర్చిపోయారు.. ఆ రైల్వేగేటు వద్దకు వెళ్లి ఆగితేనే ఏదో ఆర్‌వోబీ కడతానన్నారు ఏమైందనే ఆలోచన వస్తోంది.. లేదంటే అంతే. ఎందుకంటే ఒకటా రెండా ఏకంగా మూడేళ్లయింది..అయినా కదలిక లేదు.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులను ప్రారంభిస్తే.. ప్రభుత్వం మారడంతో వైసీపీ ప్రభుత్వ హయాం లో పనులు నిలిచిపోయాయి..దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయితే ఆ పనులపై కదలిక వచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదు.. ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.. ఇటీవల కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటించిన సెంట్రల్‌ రోడ్డు ఫండ్‌ నిధులతో బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించే దిశగా అడుగులు పడుతున్నాయి. 


మూడేళ్లగా కదలిక లేని ఆర్‌వోబీ..


ఉభయ గోదావరి జిల్లాల వాహనదారుల ప్రధాన సమస్య నిడద వోలులోని రైల్వేగేటు.ఈ సమస్యను పరిష్కరించేందుకు 2019 జనవరి 7వ తేదీన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు ఆర్వోబీ నిర్మాణానికి పైలాన్‌ ఆవిష్కరించారు.18 నెలల్లో ఆర్వోబీ నిర్మాణం పూర్తికావాలని అధికారులను ఆదేశించారు.ఈ మేరకు మొత్తం రూ.201 కోట్లు అవసరమని ప్రతిపాదించి జీవో విడుదల చేశారు.దీనిలో రూ. 21 కోట్లు భూసేకరణ తదితర అంశాలకు కేటాయించగా మిగి లిన రూ. 180 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.90 కోట్లు, కేంద్ర రైల్వే శాఖ రూ.90 కోట్లు కేటాయించాల్సి ఉంది.అయుతే కేంద్ర రైల్వే శాఖ రూ.56 కోట్లు మాత్రమే కేటాయించేందుకు ముం దుకు రావడంతో మిగిలిన నిధులను రాష్ట్ర  ప్రభుత్వమే భరించి గోదావరి జిల్లాల వాహనదారుల సమస్యను పరిష్కరించేందుకు నడుం బిగించింది.దీంతో కేంద్ర రైల్వే శాఖ తాము కేటాయించిన నిధులతో రైల్వే విభాగానికి సంబంధించి పనులు వేగవంతం చేశారు. ఈ లోగా సార్వత్రిక ఎన్నికలు రావడం ఎన్నికల అనం తరం ప్రభుత్వం మారింది.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తపనులపైనా కాంట్రాక్ట్‌ పనులపై రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.దీంతో నిడదవోలు ఆర్వోబీ పనులు ఆగిపోయాయి.నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వ బ్రిడ్జి నిర్మాణ పనులకు ఒక్క అడుగు ముందుకు పడలేదు.మరో పక్క కేంద్ర ప్రభుత్వ రైల్వేశాఖకుచెందిన బ్రిడ్జి పనులు తుదిదశకు చేరాయి.


భూసేకరణకు సొమ్ములు  


మూడేళ్ల అనంతరం ఈ ఏడాది మార్చి 23వ  తేదీ నుంచి ఆర్వోబీ నిర్మాణానికి సంబంధించి 51 మందికి ప్రభుత్వం నేరుగా స్థల సేకరణ చెందిన సొమ్మును వారి ఖాతాల్లో జమచేసింది. బ్రిడ్జి  నిర్మా ణంలో తొలగించనున్న మునిసిపాలిటీ సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌, వాటర్‌ సప్లయ్‌ సిస్టమ్‌ లకు సంబంధించి సుమారు రూ.60 లక్షలు  మునిసిపల్‌ ఖాతాల్లో జమయ్యాయి.


తీరనున్న కల..


కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌ రోడ్‌ ఫండ్‌ (ఎస్‌ ఆర్‌ఎఫ్‌) నిధుల ద్వారా రైల్వేగేటు స్థానంలో ఆర్వోబీ నిర్మాణం పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ఎస్‌ఆర్‌ఎఫ్‌ అధికారులు నిడదవోలు ఆర్‌అండ్‌బీ అధికారుల నుంచి ప్రతిపాదనలు బ్రిడ్జి నిర్మించాల్సిన ప్రదేశా నికి సంబంధించిన ఫొటోలు, డిజైన్‌ను తీసుకుని పరిశీలిస్తున్నట్టు సమాచారం. మరో ఐదారు నెలల్లో ఆర్వోబీ పనులు ప్రారంభించే దిశగా కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం అడుగులు వేస్తున్నట్లు సమాచారం.ఇదే జరిగితే ఎంతో కాలంగా గోదావరి జిల్లాల ప్రజల కల నిజమవుతుంది. 


Updated Date - 2022-05-20T06:36:25+05:30 IST