నిల్వ నిఽధలపైనే కన్ను!

ABN , First Publish Date - 2021-03-09T05:23:45+05:30 IST

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా మారింది అధికార పార్టీ నాయకుల తీరు. తాము చెప్పిందే వేదం అన్నట్లుగా తమకు సహకరించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.

నిల్వ నిఽధలపైనే కన్ను!
అధికారులకు ఫిర్యాదు చేస్తున్న పాలకవర్గ సభ్యులు (ఫైల్‌)

స్వాహాకు అధికారపార్టీ నేతల ప్రయత్నం

పంచాయతీ అధికారులపై ఒత్తిడి


వరికుంటపాడు, మార్చి 8 : దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా మారింది అధికార పార్టీ నాయకుల తీరు. తాము చెప్పిందే వేదం అన్నట్లుగా తమకు సహకరించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో  చేసేదిలేక అధికారులు లోలోన మదనపడుతున్నారు. ఇతరత్రా ఆదాయ వనరుల సంగతి అటుంచితే... ప్రస్తుతం అందరి చూపు పంచాయతీ నిధులపైనే పడింది. 


నిల్వ ఉన్న నిధులకు..


ముందస్తుగా పెట్టుబడులు పెట్టి పనులు చేసి నిధుల మంజూరుకు ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తుందన్న భావనతో పంచాయతీ ఖాతాల్లో నిల్వ ఉన్న నిధులను స్వాహా చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇంచుమించు ప్రతి పంచాయతీలో రూ.5 నుంచి రూ.10 లక్షల పైబడి 14వ ఆర్థిక సంఘం, సాధారణ నిధులు ఉండడంతో అధికార పార్టీ నాయకుల కన్ను వాటిపై పడింది. పనులు చేసినా, చేయకపోయినా రికార్డులు సృష్టించి గుట్టుచప్పుడు కాకుండా ఆ నిధులు డ్రా చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆ విషయంలో పంచాయతీ పాలకవర్గాలు అడ్డుతగులుతారని భావించిన కొంతమంది నాయకులు రెండు, మూడేళ్ల క్రితమే పనులు చేపట్టినట్లు తీర్మానాలు సృష్టించి, బినామీ ఎంబుక్‌లు తయారు చేయాలని బదిలీ అయిన అధికారులతోపాటు ప్రస్తుత అధికారులపై కూడా ఒత్తిడి తెస్తున్నారు. కొంతమంది అధికారులు అందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఇదే అదునుగా భావించిన నాయకులు పనులు చేయకుండానే నిధులు మింగేసేందుకు సిద్ధమయ్యారు. ఉన్న గ్రావెల్‌ రోడ్లకే పైపై మెరుగులు దిద్దడం, కంపచెట్లు తొలగించడం, శ్మశానవాటికలను శుభ్రం చేయడం వంటి పనులు నామమాత్రంగా చేసి రూ.లక్షలతో జేబులు నింపుకునేందుకు పరుగులు తీస్తున్నారు. విషయం తెలుసుకున్న పలు పంచాయతీ సర్పంచ్‌లు నిధులు ఇలా దుర్వినియోగం చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని వాపోతున్నారు. 


వివాదాలకు ఆజ్యం


ఈ పరిస్థితులు గ్రామాల్లో వివాదాలకు అజ్యం పోసినట్లవుతోంది. కొంతమంది సర్పంచులు భయాందోళనకు గురై వెనుకడుగు వేసినప్పటికి మరికొంతమంది నిధులను కాపాడుకునేందుకు ముందడుగు వేస్తున్నారు. తాజాగా తమ పంచాయతీలో ఉన్న రూ.5.80 లక్షల నిధులను కాజేసేందుకు ఓ నాయకుడు ప్రయత్నాలు చేస్తున్నట్లు గమనించిన గణేశ్వరాపురం సర్పంచ్‌ ఎంపీడీవోకు ఫిర్యాదు చేయడంతోనే అధికార పార్టీ నాయకుల వ్యవహారశైలి సర్వత్రా చర్చానీయాంశంగా మారింది.

Updated Date - 2021-03-09T05:23:45+05:30 IST