నిధులు ఎప్పుడో.. నిర్మాణం ఎన్నడో?

ABN , First Publish Date - 2022-01-10T03:10:04+05:30 IST

నిధుల కొరతతో ప్రభుత్వ భవనాల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి.

నిధులు ఎప్పుడో.. నిర్మాణం ఎన్నడో?
అసంపూర్తిగా ఉన్న స్త్రీశక్తి భవనం

అసంపూర్తిగా స్త్రీ శక్తి భవనం 


ముత్తుకూరు, జనవరి 9:  నిధుల కొరతతో ప్రభుత్వ భవనాల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. చేసిన పనులకు నిధులు రాకపోవడంతో నిర్మాణాలు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. స్వయం సహాయక సంఘాల కార్యకలాపాల కోసం నిర్మించిన స్త్రీశక్తి భవనం ఏళ్ల తరబడి అసంపూర్తిగానే ఉంది. ముత్తుకూరులో మండల కార్యాలయాల సమీపంలో పొదుపు సంఘాల కార్యకలాపాల కోసం కార్యాలయ భవన నిర్మాణానికి గత టీడీపీ పాలనలో శ్రీకారం చుట్టారు. ఏడేళ్ల కిందట స్త్రీశక్తి భవనం పేరుతో రెండతస్తుల భవన నిర్మాణానికి రూ.32లక్షల నిధుల వ్యయంతో పనులు ప్రారంభించారు. కింద అంతస్తు నిర్మాణానికి రూ.25లక్షలు, మొదటి అంతస్తు నిర్మాణం కోసం రూ.7లక్షలు కేటాయించారు. అప్పట్లో కాంట్రాక్టరు కింద అంతస్తు పూర్తిచేసి, రెండో అంతస్తు పనులను ప్రారంభించారు. అయితే బిల్లులు రాకపోవడంతో పనులు నిలిపివేశారు. అప్పటి నుంచి ఏడేళ్లుగా ఈ భవనం అసంపూర్తిగానే ఉంది. కాగా పూర్తయిన కింద అంతస్తునే పొదుపు కార్యాలయంగా వాడుకుంటున్నారు. బిల్లులు వస్తే మొదటి అంతస్తు పూర్తి చేస్తే, పొదుపు సంఘాలకు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ స్త్రీ శక్తి భవన నిర్మాణంపై శ్రద్ధ చూపడం లేదు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని నిధులు మంజూరు చేస్తే స్త్రీ శక్తి భవనం పొదుపు సంఘాలకు అందుబాటులోకి వస్తుంది. 

 

Updated Date - 2022-01-10T03:10:04+05:30 IST