నిండుకున్న మద్యం నిల్వలు

ABN , First Publish Date - 2022-06-21T05:36:48+05:30 IST

జిల్లాలో మద్యం కొరత ఏర్పడింది. డబ్బులిచ్చినా నచ్చిన మద్యం కొనుక్కోలేని పరిస్థితి నెలకొంది.

నిండుకున్న మద్యం నిల్వలు

డిస్టిలరీల నుంచి నిలిచిన సరఫరా

డిపోలో ఖాళీ అయిన సరుకు

అమ్ముడుపోని బ్రాండ్లే దిక్కు

బిల్లులు చెల్లించకపోవడమే కారణమా..?


నెల్లూరు, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మద్యం కొరత ఏర్పడింది. డబ్బులిచ్చినా నచ్చిన మద్యం కొనుక్కోలేని పరిస్థితి నెలకొంది. గడిచిన కొన్ని రోజులుగా డిస్టిలరీలు(మద్యం తయారీ కంపెనీలు) నుంచి మద్యం సరఫరా నిలిచిపోయింది. ఒక్కసారిగా సరఫరా నిలిచిపోవడంతో డిపోలో నిల్వ ఉన్న సరుకునే దుకాణాలు, బార్లకు పంపుతూ వస్తున్నారు. అయితే అక్కడ కూడా సరుకు నిండుకుంటోంది. రెండు,మూడు రోజుల్లోనే డిపోలో ఉన్న సరుకు కూడా ఖాళీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లోపు మద్యం సరఫరా కాకపోతే అన్ని దుకాణాలు ఖాళీ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం మందుబాబులు ఆసక్తి చూపని బ్రాండ్లన్నీ అటు డిపోల్లో, ఇటు దుకాణాల్లో ఆగిపోయాయి. ఇప్పుడు ఆ సరుకే దిక్కయ్యింది. 


అనామక బ్రాండ్లే దిక్కు

జిల్లాల విభజన తర్వాత నెల్లూరు జిల్లా పరిధిలో 166 మద్యం దుకాణాలు, 46 బార్లు మిగిలాయి. వీటన్నింటి ద్వారా రోజుకు సరాసరి రూ.3 కోట్లు వరకు విక్రయాలు జరుగుతుంటాయి. ఇటీవల వరకు అన్నీ బ్రాండ్లు దుకాణాలు, బార్లలో అందుబాటులో ఉండేవి. కానీ కొన్ని రోజుల నుంచి డిస్టిలరీ ద్వారా సరఫరా జరగకపోవడంతో ఉన్న సరుకునే సర్దుకుంటూ వస్తున్నారు. సాధారణంగా నెల్లూరు రూరల్‌ మండలం దేవరపాలెం వద్దనున్న మద్యం డిపోలో 1.50 లక్షల కేసుల వరకు మద్యం నిల్వ ఉంటుంది. అయితే ఆ నిల్వలు ఇప్పుడు మూడు, నాలుగు వేల కేసులకు చేరుకున్నాయి. అవి కూడా అనామక బ్రాండ్లు కావడం గమనార్హం. కొన్నిరకాల బ్రాండ్లను మద్యం ప్రియులు దూరం పెడుతుండగా, ఇప్పుడు ఆ బ్రాండ్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. డిపోలో అరకొరగా ఉన్న పెద్ద బ్రాండ్లను బార్లకే ఎక్కువగా పంపుతున్నారు. దీంతో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 


బిల్లులు చెల్లించనందునే..

 కాగా ప్రభుత్వం నుంచి డిస్టిలరీలకు బకాయిలు పెరిగిపోవడంతోనే సరుకు సరఫరాకు బ్రేక్‌ పడినట్లు ఎక్సైజ్‌ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా బిల్లులు చెల్లించకపోవడంతో మద్యం ఇచ్చేందుకు కంపెనీలు నిరాకరిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. 


మద్యం సరఫరా ఆగిన మాట నిజమే..

ఈ విషయమై ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ వెంకట్రామిరెడ్డిని వివరణ కోరగా కంపెనీల నుంచి డిపోకు మద్యం సరఫరా నిలిచిన మాట వాస్తవమేనని చెప్పారు. సాఫ్ట్‌వేర్‌ సమస్యతో నిలిచినట్లు చెబుతున్నారన్నారు. ఉన్న సరుకునే సర్దుకుంటూ సేల్స్‌కు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని ఆయన వివరించారు. ఇప్పటికైతే ఇబ్బంది లేదని, మరో వారంరోజులు సరఫరా జరగకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశముంటుందని చెప్పారు. అయితే రెండురోజుల్లోనే సరుకు పంపుతారని సమాచారం వచ్చిందని ఆయన తెలిపారు. 

Updated Date - 2022-06-21T05:36:48+05:30 IST