ఒకరిద్దరు కాదు.. ఏకంగా 300 మంది మహిళలను నమ్మించి మోసం చేసిన నకిలీ NRI.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-05-28T23:01:45+05:30 IST

ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 300 మంది మహిళలను పెళ్లి పేరుతో మోసం చేసిన ఓ నైజీరియా వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

ఒకరిద్దరు కాదు.. ఏకంగా 300 మంది మహిళలను నమ్మించి మోసం చేసిన నకిలీ NRI.. అసలేం జరిగిందంటే..

ఎన్నారై డెస్క్: ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 300 మంది మహిళలను పెళ్లి పేరుతో మోసం చేసిన ఓ నైజీరియా వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పెళ్లిళ్ల వెబ్‌సైట్ల ద్వారా నిందితుడు మహిళలను పరిచయం చేసుకుని, వారి నుంచి కోట్ల రూపాయలు దండుకున్నట్టు తెలిపారు. మీరట్‌ జిల్లాకు చెందిన ఓ మహిళ ఫిర్యాదుతో అతడి బండారం మొత్తం బయటపడింది. గరూబా గాలుంజే(38).. దక్షిణ ఢిల్లీలోని కిషన్‌గఢ్ ప్రాంతంలో నివసిస్తుంటాడు. పెళ్లిళ్ల వెబ్‌సైట్‌లే వేదికగా అతడు మహిళలను టార్గెట్ చేస్తుంటాడు. బాధితురాలి కథనం ప్రకారం.. ఆమెకు నిందితుడు జీవన్‌సాథీ వెబ్‌సైట్‌లో పరిచయమయ్యాడు. తన పేరు సంజయ్ సింగ్ అని, కెనడాలో నివసిస్తుంటానని అతడు చెప్పుకొచ్చాడు. ఆమెను వివాహం చేసుకునేందుకు తాను సిద్ధమేనని చెప్పాడు. ఇలా.. ఆమె నమ్మకం చూరగొన్నాక డబ్బు సహాయం చేయాలంటూ కోరాడు. ఈ క్రమంలో ఆమె విడతల వారీగా దాదాపు 60 లక్షల రూపాయలను గరూబా కోరిన అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసింది. చివరకు తాను మోసపోయానని గ్రహించి ఇటీవలే పోలీసులను ఆశ్రయించింది. 


కాగా.. విచారణ సందర్భంగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 300 మంది మహిళలను గరూబా మోసం చేసినట్టు బయటపడింది. వారి నుంచి అతడు కోట్ల రూపాయలు దండుకున్నట్టు గుర్తించారు. హ్యాండ్సమ్ పురుషుల ఫొటోలతో అతడు పలు ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించి, మోసాలకు పాల్పడేవాడని పోలీసులు చెప్పారు. అరెస్టు సందర్భంగా వారు నిందితుడి వద్ద ఉన్న పాస్‌పోర్టు, ఏడు మొబైల్ ఫోన్లు, అమెరికా విదేశాంగ శాఖతో పాటూ వివిధ బ్యాంకుల పేర అతడు సృష్టించిన నకిలీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.


గరూబా తొలిసారిగా 2019లో ఆరు నెలల కాలపరిమితి గల వీసాపై భారత్‌కు వచ్చాడు. ఆ తరువాత.. మళ్లీ భారత్‌కు వచ్చిన అతడు ఈమారు వీసా గడువు ముగిసినా కూడా దేశం విడిచి వెళ్లలేదు. వివిధ ప్రాంతాల్లో ఉంటూ మోసాలకు పాల్పడేవాడు. ఇలా సంపాదించిన మొత్తాన్ని నైజీరియాలో ఉన్న తన కుటుంబానికి పంపేవాడు. కాగా.. పోలీసులు గరూబాపై చీటింగ్, ఐటీ చట్టం ఉల్లంఘనకు సంబంధించి పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు, సోషల్ మీడియా విషయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సూచించారు.



Updated Date - 2022-05-28T23:01:45+05:30 IST