కట్టడికి చర్యలు

ABN , First Publish Date - 2021-04-21T06:23:10+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం నైట్‌ కర్ఫ్యూ విధించింది. మంగళవారం రాత్రి నుంచి అమల్లోకి తెచ్చింది. నెలాఖరువరకు కొనసాగుతుందని పేర్కొంది.

కట్టడికి చర్యలు
నిర్మానుష్యంగా మారిన సిరిసిల్ల మెయిన్‌ రోడ్డు

-  నెలాఖరు వరకు రాత్రి కర్ఫ్యూ 

- పెరుగుతున్న కరోనా కేసులు  

- జిల్లాలో 20 రోజుల్లో  4003 మందికి పాజిటివ్‌ 

- 39 మంది మృతి 

- సీతారాముల కల్యాణానికి ఆంక్షలు 

- శివపార్వతుల రాకపై అయోమయం 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం నైట్‌ కర్ఫ్యూ విధించింది. మంగళవారం రాత్రి నుంచి అమల్లోకి తెచ్చింది. నెలాఖరువరకు కొనసాగుతుందని పేర్కొంది. 9 గంటల నుంచి తెల్లవారు జామున 5 వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.  8 గంటల వరకు బార్లు, రెస్టారెంట్‌లు, హోటళ్లు, దుకాణాలు, ఆఫీస్‌లు, మూసివేయాల్సి ఉంటుంది. దీంతో జిల్లాలో అధికారులు అత్యవసర సేవలు మినహా రాత్రి వేళల్లో   కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. జన సంచారంపై పూర్తిగా అంక్షలు విధించారు.    మరోవైపు జిల్లాలో నిత్యం 300కు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.  25.80 శాతం పాజిటివ్‌ రేటు కొనసాగుతోంది. గతంలో కరోనా కేసులు ఎక్కడో ఒక చోట కనిపించాయి.  ప్రస్తుతం   వీధి వీధినా బాధితులు కనపిస్తున్నారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 1531 మందికి పరీక్షలు చేయగా 395 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. జిల్లాలో 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక జిల్లా ఆస్పత్రి పరిధిలో అత్యధికంగా ఇల్లంతకుంటలో 24 మంది, గంభీరావుపేట  48 మంది, ఎల్లారెడ్డిపేట  73 మంది, వేములవాడ  68 మంది, జిల్లా ఆస్పత్రి 78, పీఆఎస్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ 12, ఎల్‌బీనగర్‌ 15, చందుర్తి 17, బోయినపల్లి 16, కొదురుపాక 8, పోత్గల్‌ 13, కోనరావుపేట ఐదుగురు, చీర్లవంచ నలుగురు, నేరేళ్ల ఆరుగురు, తంగళ్లపల్లి  ఎనిమిది మందికి పాజిటివ్‌గా తేలింది. జిల్లాలో 20 రోజుల్లో 4091 మంది కరోనా బారిన  పడ్డారు. 39 మంది మృతిచెందారు. మంగళవారం వేములవాడ దేవస్థానంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న బొందిల శివప్రసాద్‌ కరోనాతో కరీంనగర్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు.  వేములవాడకు చెందిన జర్నలిస్ట్‌ బూర రమేష్‌ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు. వీర్నపల్లి సీతరాంనాయక్‌ తండాకు చెందిన 50 ఏళ్ల మహిళ, సిరిసిల్ల చెందిన 45ఏళ్ల వ్యక్తి , కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన 21 ఏళ్ల యువతి  సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో చిక్సి పొందుతూ మృతిచెందారు. జిల్లాలో ఇప్పటివరకు 16,477 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. 12,301 మంది కోలుకున్నారు. 4001 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 175 మంది మృతిచెందారు. 

 

వీడని నిర్లక్ష్యం 

జిల్లాలో నిత్యం కరోనా కేసులు వస్తున్నా జనం మాత్రం నిర్లక్ష్యంతో కూడిన భయాన్నే చూపు తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు హోం ఐసోలేషన్‌లో ఉండకుండా రోడ్లపై తిరుగుతూ కరోనా వ్యాప్తిని పెంచుతున్నారు.  భౌతిక దూరం, మాస్క్‌లు ధరించడం విస్మరిస్తున్నారు.   జిల్లా ఆస్పత్రిలో మంచాలు దొరకని పరిస్థితి ఏర్పడగా ప్రభుత్వ క్వాంరన్‌టైన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో మరణాలు, పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతున్న కాలంలో జాగ్రత్తలు లేకుండా మరింత ఇబ్బంది పడక తప్పదని భావిస్తున్నారు. స్వీయనియంత్రణే మార్గంగా ప్రచారం చేస్తున్నారు. 


సీతారాముల కల్యాణానికి తప్పని ఆంక్షలు 

సీతారాముల కల్యాణ వేడుకలకు ఈ సారి కూడా కరోనా ఆంక్షలు తప్పలేదు. జిల్లాలోని  రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంతవైభవంగా వేడుకలు జరిగేవి. శివపార్వతులు లక్షల సంఖ్యలో తరలివచ్చే వారు. గతేడాది లాక్‌డౌన్‌లో రవాణా సౌకర్యంలేకపోవడంతో నియంత్రించ గలిగారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత వేములవాడకు భారీగా తరలివచ్చిన భక్తులతో కరోనా వ్యాప్తి పెరిడింది.  ఈ సారి భక్తులకు అనుమతులు లేకుండా కేవలం దేవాలయంలోనే  సీతారాముల కల్యాణం  నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే రవాణా సౌకర్యం ఉండడంతో శివపార్వతులు దేవాలయం వరకు వచ్చి వెళ్తారా..? నైట్‌ కర్ఫ్యూ ఆంక్షల దృష్ట్యా ఆగిపోతారా? అనే అయోమయం నెలకొంది. జిల్లాలోని సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్‌, ఇల్లంంతకుంట, బోయినపల్లి, చందుర్తి కోనరావుపేట, రుద్రంగి, తంగళపల్లి మండలాల్లో శ్రీరామనవమి వేడుకలను కొవిడ్‌ నిబంధనల మేరుకు నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేశారు. 


కరోనా కట్టడికే రాత్రిపూట కర్ఫ్యూ 

- రాహుల్‌ హెగ్డే, ఎస్పీ 

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏప్రిల్‌ 30 వరకు రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు  ఎస్పీ రాహుల్‌హెగ్డే తెలిపారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రజలు, పోలీసులకు సహకరించాలని, అత్యవసర సర్వీసులు, పెట్రోల్‌బంక్‌లు, మీడియాకు మినహాయింపు ఉంటుందని తెలిపారు. జిల్లా ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్‌  ధరించాలన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ కోసం ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూ విధించింద ని, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విఽధిస్తామని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపార దుకాణాలు రాత్రి 8గంటల లోగా మూసి వేయాలన్నారు. ప్రభుత్వ సిబ్బంది. మీడియా ప్రతినిధులు తప్పనిసరిగా ఐడీ కార్డులు కలిగి ఉండాలన్నారు. ఎయిర్‌పోర్ట్‌లు, రైల్వే స్టేషన్లు బస్టాండ్‌లకు వెళ్లే ప్రయాణికులు అందుకు సంబంధించిన టికెట్లు ఉంచుకోవాలన్నారు.  

Updated Date - 2021-04-21T06:23:10+05:30 IST