రాష్ట్రంలో మళ్లీ రాత్రి కర్ఫ్యూ

ABN , First Publish Date - 2022-01-11T07:58:28+05:30 IST

కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయాలని, 50 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో సినిమా హాళ్లు నడపాలని,

రాష్ట్రంలో మళ్లీ రాత్రి కర్ఫ్యూ

  • రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకూ అమలు
  • నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ ఆంక్షలు
  • సినిమా హాళ్లలో 50 శాతం సీట్లకే అనుమతి
  • బహిరంగ ప్రదేశాల్లో 200 మందికి..
  • ఇండోర్‌ కార్యక్రమాల్లో 100 మందికి అనుమతి
  • కొవిడ్‌ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలు
  • రాష్ట్రంలో కొత్తగా 984 కేసులు


అమరావతి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయాలని, 50 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో సినిమా హాళ్లు నడపాలని, మాస్క్‌, భౌతిక దూరం తప్పనిసరి చేయాలని సూచించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను వైద్యఆరోగ్య శాఖ విడుదల చేయనుంది. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కొవిడ్‌పై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో మార్పు చేయాల్సిన మందుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఆ మేరకు హోం క్వారంటైన్‌ కిట్లలో మార్పులు చేయాలన్నారు. వైద్య నిపుణులతో సంప్రదించి  కరోనా చికిత్సకు మందులు సిద్ధం చేయాలన్నారు.


104 కాల్‌ సెంటర్‌ను బలోపేతం చేయాలని, నియోజకవర్గానికి ఒక కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో అందరూ భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌ ధరించేలా చూడాలన్నారు. దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కొవిడ్‌ ఆంక్షలు అమలయ్యేలా చూడాలన్నారు. బస్సుల్లో ప్రయాణికులు కూడా మాస్క్‌ ధరించేలా చూడాలని, లేదంటే జరిమానాలు కొనసాగించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇండోర్‌ కార్యక్రమాల్లో 100 మంది మించకుండా చూడాలని ఆదేశించారు. థియేటర్లలో సీటు మార్చి సీటుకు అనుమతించాలన్నారు.


పీఎస్‌ఏ యూనిట్లు జాతికి అంకితం

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వాస్పత్రుల్లో రూ.426 కోట్లతో ఏర్పాటు చేసిన  144 పీఎ్‌సఏ ఆక్సిజన్‌ ప్లాంట్లను సీఎం జగన్‌ జాతికి అంకితం చేశారు. 30 శాతం సబ్సిడీతో ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో థర్డ్‌వేవ్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,  వైద్యఆరోగ్యశాఖ ఆళ్ల నానీ, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పాల్గొన్నారు. 


రాష్ట్రంలో కొత్తగా 984 కేసులు..

గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 24,280 శాంపిల్స్‌ను పరీక్షించగా 984 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 20,82,843కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,606 యాక్టివ్‌ కేసులున్నాయి. 


ఆర్టీసీ బస్సుల్లో మాస్క్‌ఫైన్‌ లేదు : ఆర్టీసీ ఈడీ

అమరావతి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సులో  మాస్క్‌ పెట్టుకోకుండా ప్రయాణించినందుకు ఎవరికీ, ఎలాంటి జరిమానా విధించలేదని ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో ఒక ప్రయాణికుడికి మాస్క్‌ పెట్టుకోనందున ఆర్టీసీ రూ.50 జరిమానా విధించినట్టు ఉన్న టికెట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వగా ఆపరేషన్స్‌ విభాగం ఈడీ బ్రహ్మానందరెడ్డి సోమవారం వివరణ ఇచ్చారు. బస్టాండులో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారికి మాత్రమే సెక్యూరిటీ సిబ్బంది ఫైన్‌ వేస్తున్నారని వివరించారు. 

Updated Date - 2022-01-11T07:58:28+05:30 IST