నైట్‌ టైమ్‌ బ్యూటీ ట్రీట్‌మెంట్స్‌

ABN , First Publish Date - 2022-08-21T06:49:40+05:30 IST

ఉదయాన్నే ముఖం వెలిగిపోతోందంటే రాత్రి కంటి నిండా నిద్ర పట్టిందని అర్థం. కాబట్టే నిద్రను బ్యూటీ స్లీప్‌ అని కూడా అంటారు. నిద్ర సమయం నుంచి రెట్టింపు

నైట్‌ టైమ్‌ బ్యూటీ ట్రీట్‌మెంట్స్‌

ఉదయాన్నే ముఖం వెలిగిపోతోందంటే రాత్రి కంటి నిండా నిద్ర పట్టిందని అర్థం. కాబట్టే నిద్రను బ్యూటీ స్లీప్‌ అని కూడా అంటారు. నిద్ర సమయం నుంచి రెట్టింపు ఫలితం పొందాలంటే ఈ నైట్‌టైమ్‌ బ్యూటీ ట్రీట్మెంట్స్‌ కూడా ట్రై చేస్తూ ఉండాలి. 


యాంటిఆక్సిడెంట్‌ ఫేస్‌ క్రీమ్‌: పగలంతా ఎండతో పోరాడి అలసిపోయిన చర్మం రాత్రివేళ విశ్రాంతి తీసుకుంటుంది. స్కిన్‌ ట్రీట్మెంట్‌కు ఇదే సరైన సమయం. పగటివేళ చర్మ సంరక్షణ కోసం మనం విటమిన్‌ సి, రెటినాల్‌ వంటి బ్రైటెనింగ్‌ ఏజెంట్స్‌ ఉండే ఎలాంటి క్రీమ్‌ వాడినా చూపించని ఫలితం రాత్రివేళ పొందవచ్చు. ఇందుకోసం యాంటిఆక్సిడెంట్స్‌ ఉన్న నైట్‌ క్రీమ్‌ అప్లై చేయాలి. ఇవి చర్మపు వయసుని పెంచే ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి. ఫలితంగా పగటివేళ ఇలాంటి పార్టికల్స్‌ ఎక్స్‌పోజర్‌ వల్ల పాడైన చర్మం రాత్రివేళ జీవం పుంజుకుంటుంది.


కళ్ల కింద వాపు: రాత్రి బాగానే ఉన్న కళ్లు ఉదయం లేవగానే ఉబ్బిపోతున్నాయా? కళ్ల కింద ఇలాంటి ఉబ్బు రాకుండా ఉండాలంటే రాత్రి తలకింద రెండు దిండ్లు పెట్టుకుని పడుకోవాలి. ఇలా చేయటం వల్ల కళ్ల కింద పేరుకున్న ద్రవాలు డ్రెయిన్‌ అయిపోతాయి. ఈ చిట్కాతోపాటు కెఫీన్‌ కలిగిన ఐక్రీమ్స్‌ అప్లై చేయాలి.


హెయిర్‌ మాయిశ్చరైజర్‌: జుట్టు పట్టుకుచ్చులా తయారవ్వాలంటే రాత్రివేళ వెంట్రుకలకు లీవిన్‌ కండిషనర్‌ అప్లై చేసి, పడుకోవాలి. దానివల్ల కండిషనర్‌ వెంట్రుకల కుదుళ్లలోకి చొరబడే సమయం ఉంటుంది కాబట్టి ఉదయానికల్లా వెంట్రుకలు సిల్కీగా తయారవుతాయి. రాత్రి కొబ్బరినూనెతో మసాజ్‌ చేసుకుని ఉదయాన్నే తలస్నానం చేసినా ఇదే ఫలితం దక్కుతుంది.


తడి జుట్టును టవల్‌తో చుట్టేయాలి: రాత్రి తలస్నానం చేస్తే జుట్టును అలాగే వదిలేసి పడుకోకూడదు. దిండుకు ఒరుసుకుని వెంట్రుకలు చిట్లిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి రాత్రి తలస్నానం చేస్తే టవల్‌తో చుట్టి పడుకోవాలి. ఇలా చేస్తే తడిని టవల్‌ పీల్చేసుకుంటుంది. చేతులు, పాదాలు మృదువుగా: పగిలిన పాదాలు, బిరుసెక్కిన చేతులను సరిచేయటానికి రాత్రివేళే అనువైన సమయం. వాజెలీన్‌ లేదా కొబ్బరి నూనెను చేతులకు, పాదాలకు అప్లై చేసి గ్లౌవ్స్‌, సాక్స్‌ వేసుకుని పడుకుంటే ఉదయానికల్లా మృదువుగా తయారవుతాయి. గ్లౌవ్స్‌, సాక్స్‌ వేసుకుని పడుకోవటం మొదట్లో కాస్త అసౌకర్యంగా అనిపించినా కొద్ది రోజులకు అలవాటైపోతుంది. 

Updated Date - 2022-08-21T06:49:40+05:30 IST