పట్టేయ్‌.. పసిడి

ABN , First Publish Date - 2022-05-19T10:18:54+05:30 IST

డజనుమంది భారత బాక్సర్లు మహిళల ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనగా..తెలుగు అమ్మాయి నిఖత్‌ జరీన్‌ ఒక్కతే ఫైనల్‌కు చేరింది.

పట్టేయ్‌.. పసిడి

ఫైనల్లో నిఖత్‌ జరీన్‌ 

సెమీస్‌లో బ్రెజిల్‌ ప్రత్యర్థి చిత్తు

మనీషా, పర్వీన్‌ కాంస్యాలతో సరి 

వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌


డజనుమంది భారత బాక్సర్లు మహిళల ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనగా..తెలుగు అమ్మాయి నిఖత్‌ జరీన్‌ ఒక్కతే ఫైనల్‌కు చేరింది. మెగా టోర్నీ ఆరంభంనుంచే దూకుడైన ప్రదర్శనతో ప్రత్యర్థులకు దడపుట్టిస్తున్న జరీన్‌ పసిడి పతకానికి కేవలం ఒక్క బౌట్‌ దూరంలో నిలిచింది. సెమీఫైనల్‌లో అలవోకగా విజయం సాఽధించిన తెలుగు బాక్సర్‌ ఫైనల్లోనూ అదే జోరు కొనసాగిస్తే ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ టైటిల్‌ లభించడం ఖాయం. అదే జరిగితే దిగ్గజం మేరీకోమ్‌, సరితాదేవి తదితరుల తర్వాత విశ్వవిజేతగా నిలిచిన ఐదో భారత బాక్సర్‌గా చరిత్ర సృష్టిస్తుంది.


న్యూఢిల్లీ: వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో తొలిసారి బరిలో దిగిన తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ అదరగొడుతోంది. సెమీఫైనల్లో అడుగుపెట్టిన ఇద్దరు సహచరులు అక్కడికే పరిమితంకాగా.. టైటిల్‌ ఫైట్‌కు దూసుకుపోయిన నిఖత్‌ స్వర్ణ పతకంపై ఆశలు రేపింది. ఇస్తాంబుల్‌లో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో.. బుధవారం నాటి 52 కిలోల సెమీస్‌ నిఖత్‌కు నల్లేరుపై బండి నడకే అయింది. బ్రెజిల్‌కు చెందిన కరోలిన్‌ డి అల్మేడియాను జరీన్‌ను 5-0తో చిత్తు చేసింది. గురువారం జరిగే పసిడి పతక పోరులో జుటామస్‌ జిట్‌పోంగ్‌ (థాయ్‌లాండ్‌)ను ఢీకొంటుంది. 24 ఏళ్ల జిటిపోంగ్‌ సెమీస్‌లో 4-0తో షెకెర్‌బెకోవా (ఖజకిస్థాన్‌)పై నెగ్గింది. అంతిమ సమరానికి చేరిన నిఖత్‌ కనీసం రజత పతకం ఖరారు చేసుకుంది. కాగా..మనీషా మౌన్‌ (57 కి.), మరో అరంగేట్ర బాక్సర్‌ పర్వీన్‌ హుడా (63 కి.) సెమీస్‌లో పరాజయంతో కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత ఇమా టెస్టా (ఇటలీ) చేతిలో మనీషా 0-5 ఓడిపోయింది. ఇక యూరోపియన్‌ చాంపియన్‌షిప్స్‌ కాంస్య పతక విజేత అమీ బ్రోటర్స్‌స్ట్‌ (ఐర్లాండ్‌) 4-1తో పర్వీన్‌పై గెలుపొందింది. 


జరీన్‌..తొలిరౌండ్‌నుంచే జోరు..

ప్రపంచ జూనియర్‌ బాక్సింగ్‌ మాజీ చాంపియన్‌ నిఖత్‌..సెమీస్‌ బౌట్‌లో ప్రశాంతంగా ఆడి కరోలిన్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలుత ఒకింత నెమ్మదిగా కనిపించిన జరీన్‌ ఆపై తన పంచ్‌ల పవర్‌ చూపించింది. నిఖత్‌ ధాటి పంచ్‌లు..చురుకైన కదిలికలు..బ్రెజిల్‌ బాక్సర్‌ను అయోమయానికి గురి చేశాయి. మొదటి రౌండ్‌లో ముగ్గురు జడ్జిలూ జరీన్‌కు 10కి 10 పాయింట్లు వేశారంటే భారత బాక్సర్‌ ఎలా విజృంభించిందో అర్థమవుతుంది. నిఖత్‌ పంచ్‌ల పవర్‌తో కరోలిన్‌ తొలి రౌండ్‌లోనే తీవ్ర ఒత్తిడి లోనైంది.


రెండో రౌండ్‌లోనూ అదే జోరు కొనసాగించిన జరీన్‌..మరోసారి 30-27 స్కోరుతో ఈ రౌండ్‌లో నెగ్గింది. ఇక చివరిదైన మూడో రౌండ్‌లోనూ నిఖత్‌కు ఎదురులేక పోయింది. కాగా..వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌ 2016లో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఆ ఏడాది నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో మొత్తం ఏడు పతకాలు భారత బాక్సర్లు సాధించారు. ఇక గతసారి టోర్నీలో నలుగురు మన బాక్సర్లు పతకాలు సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన 11 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌ తొమ్మిది స్వర్ణ, ఎనిమిది రజత, 19 కాంస్యాలు సహా మొత్తం 36 పతకాలు సొంతం చేసుకుంది. 


అదీ నా వ్యూహం

ప్రత్యర్థి తన సహజ ఆటతీరు కనబర్చకుండా చూడడం. అంతేకాదు ఆమె నా ఆటకు అనుగుణంగా తన ఆటను మార్చుకొనేలా చూడడం. ఇదీ సెమీస్‌లో నా వ్యూహం. దాన్ని ఆచరించి విజయం సాధించా. ఇక స్వర్ణ పతకంతో స్వదేశం వెళ్లడమే నా లక్ష్యం.  ఫైనల్‌ ప్రత్యర్థి విషయానికొస్తే..సెమీఫైనల్లో ఆమె తొలి రౌండ్‌ను చూశా. ఆమెతో ఒకసారి తలపడ్డాకాబట్టి  జిటిపోంగ్‌ ఆటపై అవగాహన ఉంది. అయితే గురువారంనాటి బౌట్‌కు సంబంధించి హెడ్‌కోచ్‌తో చర్చించి వ్యూహం ఖరారు చేసుకుంటా.  


- నిఖత్‌ 

Updated Date - 2022-05-19T10:18:54+05:30 IST