సాయుధ పోరులో నీలగిరి మందారాలు

Sep 17 2021 @ 00:52AM

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ)/ చిట్యాల రూరల్‌, మిర్యాలగూడ : నిజాం నిరంకుశత్వం, రజాకార్ల దమనకాండకు ఎదురొడ్డిన నీలగిరి సాయుధ పోరులో ఓ ప్రత్యేక స్థానంలో నిలిచింది. జిల్లాకు చెందిన ఎందరో యోధులు నిజాం సైన్యానికి ఎదురొడ్డి నిలిచి అమరులయ్యారు. తెలంగాణ విముక్తి కోసం నాడు చేసిన పోరాటానికి 73 వసంతాలు నిండగా, నాటి యోధులను స్మరించుకోవడమే వారికి అసలైన నివాళి.

భూమి కోసం.. భుక్తి కోసం.. పేదల విముక్తి కోసం.. నియంత పాలకుడు నిజాంను పారదోలి 73 వసంతాలు గడిచాయి. వేలాది ఎకరాల భూములను గుప్పిట్లో పెట్టుకొని నిజాం రాజు, ఆయన అనుచరులైన దేశ్‌ముఖ్‌లు, ఖాసీం రిజ్వీ తదితరులు ప్రజలను బానిసలుగా మార్చారు. బ్రిటీష్‌ పాలకులను తరిమి దేశమంతటా స్వేచ్ఛా గీతాలు ఆలపిస్తున్నా వేల తెలంగాణ మాత్రం నిరంకుశ నిజాం చేతుల్లోనే ఉంది. దీనికి వ్యతిరేకంగా పల్లెపల్లెన ప్రజాసంఘాలు ఏర్పడి సాయుధపోరును ప్రారంభించాయి. ఈ పోరాటానికి ఉమ్మడి జిల్లాకు చెందిన దిగ్గజ నేతలు నాయకత్వం వహించారు. రావి నారాయణరెడ్డి, బీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, ధర్మభిక్షం, నంద్యాల శ్రీనివా్‌సరెడ్డి, చల్లా సీతారాంరెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి, కమలాదేవి, హరిబండి లక్ష్మినారాయణ, మేదరమెట్ల సీతారామయ్య, సుద్దాల హన్మంతు, గుర్రం యాదగిరిరెడ్డి తదితరులు నాయకత్వం వహించి సాయుధ పోరును ఉధృతం చేశారు. నిజాం ప్రభువు, సాయుధ పోరాట యోధుల మధ్య కొనసాగిన యుద్ధంలో నాలుగు వేల మంది అమరులు కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారే 600 మంది వరకు ఉన్నారు. మొత్తం 6వేల మంది క్షతగాత్రులు కాగా, ఉమ్మడి జిల్లాకు చెందినవారు 2వేల మంది వరకు ఉన్నారు. వేలాది మంది చిత్రహింసలకు గురయ్యారు.

ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం

భువనగిరి డివిజన్‌ బోల్నెపల్లి గ్రామానికి చెందిన కమ్యూనిస్టు నేత రావి నారాయణరెడ్డి 1941, 44లో ఆంధ్రమహాసభ అధ్యక్షుడిగా ఎన్నికైన కాలంలో ఆరుట్ల రాంచంద్రారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూమ్‌ మొహియుద్దీన్‌, రాజ్‌ బహుదూర్‌ గౌర్‌ నేతృత్వంలో ఉద్యమాలు ప్రారంభమయ్యాయి.  1941లో నాటి నల్లగొండ జిల్లా పరిధిలోని దేవరుప్పలలో బందగీ అనే వ్యక్తి ఎదిరించాడన్న కక్షతో అతడిని హత్య చేయించిన విసునూరు దేశ్‌ముఖ్‌పై తిరుగుబాటుకు బీజం పడి తెలంగాణ అంతటా వ్యాపించింది. 1946 అక్టోబరు 18న సూర్యాపేట సమీపంలోని బాలెంలలో నిజాం సైన్యం దాడిని ఒడిసెలు, కర్రలు, రాళ్లతో గ్రామస్థులు ముకుమ్మడిగా తిప్పికొట్టారు. ఈ ఘటనలో 12 మంది గ్రామస్థులు మృతిచెందారు. దీంతో రెచ్చిపోయిన నిజాం సేనలు జనగామా తాలూకా మాచిరెడ్డిపల్లి, దేవరుప్పల, పాత సూర్యాపేట తాలూకా, భువనగిరి తాలూకాల్లో పదుల సంఖ్యలో తిరుబాటుదారులను హత్య చేశారు. 1948 జనవరి 10న రజాకారులు బీబీనగర్‌ రైల్వే స్టేషన్‌ను దహనం చేసి గ్రామంపై దాడి చేసి ఆరుగురిని హతమార్చారు. గుండ్రాంపల్లిలో 26 మందిని హత్యచేశారు.

నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వార్షికోత్సవం 

తెలంగాణ సాయుధ పోరాట 73వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాజకీయ పక్షాలు సిద్ధమయ్యాయి. ఈనెల 11 నుంచే సీపీఎం ఉమ్మడి జిల్లాలో 100 గ్రామాల్లో తెలంగాణ పోరాట యోధులను, వారు మృతిచెందితే వారి శ్రీమతిని సన్మానిస్తూ వచ్చింది. ఈ నెల 17న పార్టీ కార్యాలయాల్లో జెండాను ఎగరవేసి సభలు నిర్వహించాలని నిర్ణయించింది. సీపీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా హాజరుకానుండటంతో పార్టీ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ అనంతరం ఈ సభకు వెళ్లాలని పార్టీ నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిర్మల్‌ జిల్లా కేంద్రానికి రానుండటంతో ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 3వేల మంది నాయకులు, కార్యకర్తలు అక్కడికి వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. పోలింగ్‌ బూత్‌ల వారీగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం నిర్మల్‌ సభకు వెళ్లేందుకు ఆ పార్టీ నాయకులు నిర్ణయించారు.

ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడాం : కన్నెగంటి రంగయ్య, సాయుధదళ కమాండర్‌ 

నా 22వ ఏట ఆంధ్రమహాసభ పిలుపుతో సాయుధ పోరులోకి వెళ్లా. కర్రసాము వచ్చిన వారందరికీ రామాపురం తాలుకా కాట్రాపురం,  గుంటూరు జిల్లా మాచర్ల ఒడ్డున ఆయధశిక్షణ ఇచ్చారు. 150 మంది గెరిల్లాలతో తొలుత ఈ ప్రాంతంలో పోరాటం సాగించాం. దండుగా వెళ్తే చేళ్లల్లో బాటలు ఏర్పడి శత్రువులు పసిగట్టే అవకాశం ఉండటంతో 15-20 మందితో ఒక దళంగా కొనసాగాలని పుచ్చలపల్లి సుందరయ్య సూచించారు. దీంతో మిర్యాలగూడ డివిజన్‌లో 8 దళాలు ఏర్పడ్డాయి. రావులపెంట, మిర్యాలగూడ, పాములపాడు ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటైన దళానికి నేను కమాండర్‌ను. క్యాంపులపై దాడుల సమయంలో శత్రు సంఖ్యను బట్టి అన్ని దళాలు కలిసి ప్రతిదాడి చేసేవి. ఆగామోత్కూర్‌ యాక్షన్‌ అనంతరం రజాకార్ల క్యాంపును ఎత్తివేశారు. తెట్టెకుంట కాల్పుల్లో పోలీసు తూటా రాయికి తగిలివచ్చి నాచేతికి గాయం చేసింది. ఆశబ్దానికి చెవుడు వచ్చింది. 50 తూటాలు పేల్చే సబ్‌మిషన్‌గన్‌ నా ఒక్కడి చేతిలోనే  ఉండేది. పోలీసు ఇన్మాఫార్మర్‌ను హత్య చేసిన కేసులో నాకు 20 ఏళ్లు జైలు శిక్షపడింది. హైకోర్టు అప్పీలుతో ఆ శిక్షను 10 ఏళ్లకు తగ్గించారు. 1953-59 వరకు జైలు జీవితం గడిపా. సుందరయ్య చొరవతో నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి రాష్ట్ర అవతరణ సందర్భంగా ఖైదీలను విడుదల చేయగా, ఆరేళ్లకే జైలు నుంచి విడుదలయ్యాను. 1959లో యాద్గార్‌పల్లి సర్పంచ్‌గా ఎన్నికయ్యా. 1967లో సింగిల్‌విండో చైర్మన్‌గా, 1987లో మిర్యాలగూడ మండల పరిషత్‌ అధ్యక్షుడిగా రాష్ట్రంలోనే అత్యధిక రెండో మెజారిటీతో గెలుపొందా. జైలు రికార్డుల ప్రకారం నా వయసు ఇప్పుడు 102 ఏళ్లు. సాయుధపోరాటం, ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ ప్రజల కోసమే పనిచేశా. నాకు వ్యవసాయ భూమి లేదు. నా ముగ్గురు కుమారులు వడ్రంగి వృత్తితో పొట్టపోసుకుంటున్నారు. ప్రభుత్వం 10 ఎకరాల భూమి ఇస్తానని చెప్పినా నేటికీ ఇవ్వలేదు. ఆరోగ్యం క్షీణిస్తే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకునే స్థోమత లేదు. ప్రభుత్వం స్పందించి 10 ఎకరాల భూమి, ఇంటి స్థలం ఇవ్వాలి.

భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం : గుమ్మి చినబక్కారెడ్డి, ఏపూర్‌

నా 16ఏళ్ల వయసులో మల్కాపురం గుట్టల వద్ద మిలటరీ అధికారులు నన్ను కమ్యూనిస్టు అనుకొని అరెస్టు చేశారు. వారు ఆరా తీసి నేను మైనర్‌నని గుర్తించారు. కమ్యూనిస్టుకు చెందిన వ్యక్తిగా రజాకార్లు హతమారుస్తురేమోనని భావించి వారు నన్ను దేవరకొండ జైలుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి నల్లగొండ జైలుకు తరలించగా ఆహారం సక్రమంగా పెట్టడంలేని ఆందోళనచేయగా ఖమ్మం జైలుకు పంపించారు. ఖమ్మంలో కూడా సమ్మె చేస్తే సికింద్రాబాద్‌ జైలుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఔరంగాబాద్‌ జైలుకు తరలించి కొన్ని రోజులకు విడుదల చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక రజాకార్లను ఎదురించి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి మా తడాఖా చూపించాం. రజాకార్లు మా కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేసినా లొంగకుండా అదేపంథాను కొనసాగించాం. రజాకార్లు గ్రామాల్లో దోపిడీలకు పాల్పడుతుండటంతో ఎదురు తిరిగి పోరాడి గెలిచాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో మూడుమార్లు నల్లగొండ నుంచి, ఒకమారు భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయా.

Follow Us on:

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.