పోలవరం ఎత్తు తగ్గింపునకు.. కేసీఆర్‌-జగన్‌ క్విడ్‌ ప్రోకో

ABN , First Publish Date - 2021-03-01T09:39:08+05:30 IST

ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తాకట్టుపెట్టారని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష

పోలవరం ఎత్తు తగ్గింపునకు.. కేసీఆర్‌-జగన్‌ క్విడ్‌ ప్రోకో

ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రశ్నార్థకం చేశారు

25  వేల కోట్లు కొట్టేసేందుకు జగన్‌ దురాలోచన

టీడీఎల్పీ ఉపనేత రామానాయుడు ధ్వజం


విశాఖపట్నం, అమరావతి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు  తాకట్టుపెట్టారని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనాయకుడు నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌తో జగన్‌ చేసుకున్న క్విడ్‌ ప్రోకో ఒప్పందంలో భాగంగానే పోలవరం ఎత్తు తగ్గించేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. బహుళార్ధ సాధక ప్రాజెక్ట్‌ అయిన పోలవరాన్ని చీకటి ఒప్పందం వల్ల జగన్‌ సర్కార్‌ చెక్‌ డ్యామ్‌లా, పిల్ల కాలువలా చూస్తోందని విమర్శించారు. ‘రేడియల్‌ క్రస్ట్‌ గేట్ల తయారీ, నాణ్యత, నిర్మాణం, అమరికలో జగన్‌ ప్రభుత్వ చర్యలతో ప్రాజెక్ట్‌ నిర్మాణంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పంపులు తయారు చేసుకునే కంపెనీకి, క్రస్ట్‌ గేట్ల నిర్మాణ బాధ్యతలు అప్పగించడం ద్వారా ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని జగన్‌ ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసింది. పోలవరం ఎత్తు తగ్గిస్తే, ప్రాజెక్ట్‌ అర్థం, పరమార్థమే మారిపోతుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టం వాటిల్లుతుంది. కేంద్రజలశక్తి మంత్రిత్వశాఖలో సలహాదారుగా ఉన్న వి.శ్రీరామ్‌రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఆయన భార్య శిల్పారెడ్డి పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు కేంద్రానికి ప్రతిపాదనలు ఇచ్చారు.


ఫిబ్రవరి 16న జరిగిన సమావేశంలో వారిచ్చిన సమాచారాన్ని జగన్‌ బహిర్గతం చేయాలి. ఎన్నికల సమయంలో జగన్‌కు కేసీఆర్‌ నిధులిస్తే, అందుకు మూల్యంగా ఈ ముఖ్యమంత్రి ఆయనకు నీళ్లు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ప్రాజెక్ట్‌ ఎత్తు తగ్గించడం ద్వారా నిర్మాణ వ్యయం రూ.55 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్లకే పరిమితమౌతుంది. దీనిలో మిగిలే రూ.25వేల కోట్లను కొట్టేయాలన్నదే జగన్‌ దురాలోచన. తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను జగన్‌ ఎందుకు ఖండించలేదు? క్విడ్‌ ప్రోకో విధానాలకు పోలవరాన్ని బలికానివ్వం. ప్రాజెక్టును కాపాడుకోవటానికి రాష్ట్ర రైతాంగంతో కలిసి టీడీపీ పోరాడుతుంది’ నిమ్మల హెచ్చరించారు. 

Updated Date - 2021-03-01T09:39:08+05:30 IST