నిండా నీళ్లున్నా.. నిరుపయోగమే..!

ABN , First Publish Date - 2022-01-23T06:14:08+05:30 IST

పాలేటపల్లి జలాశయం నిర్మాణం పూర్తయ్యి తొమ్మిదేళ్లయినా నేటికీ, కాలువలు ఏర్పాటు చేయలేదు.

నిండా నీళ్లున్నా.. నిరుపయోగమే..!
రిజర్వాయర్‌లో నిల్వ ఉన్న నీరు

పూర్తికాని పాలేటిపల్లి కాలువలు 

తొమ్మిదేళ్లక్రితం జలాశయం పూర్తి

పీసీపల్లి, జనవరి 22 : పాలేటపల్లి జలాశయం నిర్మాణం పూర్తయ్యి తొమ్మిదేళ్లయినా నేటికీ, కాలువలు ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రస్తుతం జలాశయంలో నిండా నీళ్లున్నా.. నిరుపయోగంగా ఆ రిజర్వాయర్‌ ఆయకట్టు పరిస్థితి నెలకొంది. 

పాలేరు నదిపై రిజర్వాయర్‌ నిర్మిస్తే రైతులకు సాగునీరు అందుతుందని బ్రిటీషుకాలం నాడే రిజర్వాయర్‌ నిర్మాణానికి భూమిపూజ చేశారు. నాటి నుంచి ఆచరణకు నోచుకులేదు.  2009 వరకు రాజకీయ నాయకులకు ఎన్నికల హామీలుగా రిజర్వాయర్‌ మిగిలింది. 2009లో శాసనసభ్యులుగా డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఎన్నికయ్యాక నిధులు సమీకరించి 2013లో రిజర్వాయర్‌ నిర్మాణాన్ని పూర్తి చేయించారు. అయితే ఆ తర్వాత కాలువల పూర్తి చేయించలేకపోయారు. పాలేటిపల్లి రిజర్వాయర్‌ జలాశయం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా, కాలువల నిర్మాణం నేటికీ పూర్తి కాలేదు. అప్పటినుంచి ఇప్పటికి రెండు ప్రభుత్వాల కాలం ముగిసింది. కాలువల నిర్మాణం చేపట్టేందుకు భూసేకరణ కోసం గత ప్రభుత్వ కాలంలోనే 5.48 కోట్లు నిధులు కేటాయింపులు జరిగాయి. కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వంలోనైనా మోక్షం కలిగి రిజర్వాయర్‌ కాలువల నిర్మాణం పనులు ప్రారంభం అవుతాయని రైతులు ఎంతో ఆశగా ఎదురు చూఽశారు. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటినా కాలువల నిర్మాణానికి కనీసం భూ సేకరణ కూడా జరగలేదు. దీంతో నిధులు ఉన్నప్పటికీ కాలువలు తీసేందుకు టెండర్లు కూడా పిలవలేని పరిస్థితి ఎదురవుతోంది.

ఈ రిజర్వాయర్‌ ద్వారా పీసీపల్లి మండలంలో ముద్దపాడు, పాలేటిపల్లి, భట్టుపల్లి, కనిగిరి మండలంలో రాసుగుండ్ల పాడు గ్రామాల పరిధిలో 1500 ఎకరాల ఆయకట్టు భూములకు నీరు అందించవచ్చు. కాలువల నిర్మాణం చేపడితే ఖరీ్‌ఫలో 1500 ఎకరాలు, రబీలో 750 ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. సాగునీటితో పాటు పాలేరు నదీ ప్రవాహ ప్రాంతంలో భూగర్భ జలాల నీటిమట్టం పెరగనుంది.  తద్వారా వ్యవసాయ బోర్లలో వేసవిలోనూ పుష్కలంగా నీరు అందుతుంది. కాలువల ద్వారా నీరు పారడంతో ఆ పరిధిలోని గ్రామాల్లో తాగునీటిబోర్లలో నీటిమట్టం పెరిగి తాగునీటి సమస్య పరిష్కారం కానుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన పాలేటిపల్లి రిజర్వాయర్‌ కాలువల నిర్మాణం పనులు చేపట్టకపోవడం ఆప్రాంత ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది. 2013వ సంవత్సరంలో రూ.17.88 కోట్లతో పనులు ప్రారంభించి రిజర్వియర్‌ కట్ట, అలుగు నిర్మాణం పూర్తి చేశారు .ఆ తరువాత కాలువల నిర్మాణానికి రూ.5.48కోట్లు ప్రభుత్వం కేటాయించింది. రూ.5.48కోట్లలో భూసేకరణ, కాలువల పనులకు రూ.3.25కోట్లు, కల్వర్టులు, లైనింగ్‌కు 2.23కోట్లు కేటాయింపులు జరిపారు. ఈ రిజర్వాయర్‌కు కుడి కాలువ 10కిమీ ఎడమ కాలువ 4.25కిమీ తవ్వాల్సి ఉంది. వీటికోసం 86.48 ఎకరాల భుసేకరణ చేయాల్సి ఉంది.

భూసేకరణే తీవ్ర జాప్యం

రిజర్వాయర్‌ కాలువల నిర్మాణంలో భూసేకరణ జాప్యం కనిపిస్తోంది. కుడి కాలువ కింద 10.కి.మీకు 62.9ఎకరాలు, ఎడమ కాలువ కింద 4.25 కి.మీకు 24.39 ఎకరాలు భూమి అవసరం. రెవెన్యూ అధికారులు సర్వే చేసి భూములను ఇరిగేషన్‌ అధికారులకు అప్పజెప్పాల్సి ఉంది.ఇటీవల కందుకూరు సబ్‌కలెక్టర్‌ అపరాజితాసింగ్‌ పీసీ.పల్లిలో ప్రభుత్వ పథకాలపై మండలస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఆ సమయంలో పలువురు ప్రజా ప్రతినిధులు పాలేటిపల్లి రిజర్వాయర్‌ కాలువల నిర్మాణానికి కావల్సిన భూసేకరణ జాప్యంపై ఆమె దృష్టికి తీసుకుని వచ్చారు.స్పందించిన ఆమె 20 రోజులలోగా సర్వే పూర్తిచేసి తనకు నివేదిక పంపించాలని తహశీల్దార్‌ సింగారావును ఆదేశించారు. సబ్‌ కలెక్టర్‌ ఆదేశించి రెండు నెలలు గడిచినా ఇప్పటికీ రెవిన్యూ అధికారులు అంగుళంభూమిని కూడా సర్వే చేయలేదు.


Updated Date - 2022-01-23T06:14:08+05:30 IST