నింగిలో జగన్‌-నేలమీద బాబు

ABN , First Publish Date - 2021-11-27T07:15:09+05:30 IST

తిరుపతి కేంద్రంగా భారీ వర్షాలు వరదను సృష్టించాయి. నగరం కనీవినీ ఎరుగని నష్టాన్ని చవిచూసింది.

నింగిలో జగన్‌-నేలమీద బాబు
పాపానాయుడు పేటలో బుధవారం బాధితులకు చంద్రబాబు ఓదార్పు

వయసును లెక్కచేయకుండా వరద ప్రాంతాల పర్యటనపై ప్రజల జేజేలు


తిరుపతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): తిరుపతి కేంద్రంగా భారీ వర్షాలు వరదను సృష్టించాయి. నగరం కనీవినీ ఎరుగని నష్టాన్ని చవిచూసింది. చుట్టుపక్కల మండలాల్లో భారీగా ఆస్తి, పంట నష్టాలు సంభవించాయి. అవకాశం, అధికారం వున్న స్థానిక ప్రజాప్రతినిధులెవరూ బాధ్యతగా పట్టించుకోలేదు. ఆపద సమయంలో ఆపన్న హస్తం కాదు కదా కనీసం పలకరింపునకు కూడా బాధిత జనం నోచుకోలేదు. అదిగో అలాంటి సమయంలోనే రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు కూలిన వంతెనలు పరిశీలించారు. పంట నష్టాలను పరికించారు. బురదలోనే తిరుగుతూ బాధిత జనాన్ని పరామర్శించారు. వారి గోడు విన్నారు. ప్రభుత్వంపై పోరాడైనా పరిహారం ఇప్పిస్తానంటూ భరోసా ఇచ్చారు. ఎన్టీయార్‌ ట్రస్టు ద్వారా ఎంతోకొంత సాయం అందించారు. పరిహారం పెంచాలని, ఆ సాయం తక్షణమే అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధ, గురువారాల్లో చంద్రబాబు జిల్లా పర్యటనపై ప్రజల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతాయుతమైన నేతగా చంద్రబాబు వ్యవహరించారంటున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన ఆకాశానికే పరిమితం కావడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నెల 18న కురిసిన భారీ వర్షాల వల్ల తిరుపతి నగరంలో జరిగిన విధ్వంస తీవ్రత రాష్ట్రంలో అందరినీ కలచివేసింది. ఈ సమయంలో ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి కొంతమేరకు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. అలాగే రాయలచెరువు విషయంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆలస్యంగానైనా సరే స్పందించి శక్తిమేరకు దిద్దుబాటు చర్యలకు యత్నించారు. అయితే  రాయలచెరువు విషయంలో మినహా తిరుపతి రూరల్‌, రామచంద్రాపురం మండలాల్లో మిగిలిన వరద బాధిత ప్రాంతాల గురించి పట్టించుకున్న నాఽథుడు లేకపోయారన్న ఆరోపణలూ వున్నాయి. నగరంలోని పలు రోడ్లలో, వీధుల్లో ఆరు రోజులైనా వరద నీటిని తొలగించే ప్రయత్నాలు సమర్థంగా జరగలేదు. ఈ పరిస్థితుల్లో  జనాన్ని పరామర్శించేందుకు చంద్రబాబు పర్యటన  ఖరారవడంతో అప్పటి వరకూ బాధితుల్ని పట్టించుకోని మంత్రులు హడావిడిగా రంగంలోకి దిగారు. ఉరుకులు పరుగులపై వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తిరుపతి నగరంలో సైతం యంత్రాంగం మోటర్లు పెట్టి పైపుల ద్వారా ముంపు ప్రాంతాల నుంచీ వరద నీటిని తొలగించే ప్రయత్నం చేశారు. మొత్తానికి చంద్రబాబు రాకతో ముంపు ప్రాంతాల జనం వర్షాల తర్వాత తొలిసారిగా వీధుల్లో రాకపోకలు సాగించే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు వాహనంలో తిరగడమే కాకుండా బురదతో నిండిన ప్రాంతాల్లో కూడా పర్యటించి బాధితుల్ని పలకరించారు. అలాగే స్వర్ణముఖిపై కూలిపోయిన బ్రిడ్జిలను, దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పాపానాయుడుపేట మొదలుకుని తిరుచానూరు, రాయలచెరువు, తిరుపతి వరకూ పలుచోట్ల జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ యంత్రాంగంలో ముందస్తు సన్నద్ధత లేకపోవడం, విపత్తు వచ్చాకైనా సకాలంలో సహాయక చర్యలు చేపట్టకపోవడాన్ని తప్పుబట్టారు. నగరంలో ఓ వ్యక్తి మ్యాన్‌ హోల్‌లో పడి గల్లంతైతే ఆరు రోజులైనా ఆచూకీ కనుక్కోలేకపోవడాన్ని ప్రశ్నించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారు పడుతున్న క్షోభను ఆయన ప్రస్తావించడం జనాన్ని కదిలించింది. అదే సమయంలో ఎన్టీయార్‌ ట్రస్టు ద్వారా ఎంతోకొంత సాయం అందుతుండడాన్ని కూడా జనం గుర్తిస్తున్నారు.


వైసీపీ నేతలపై పదునైన విమర్శలు

మరోవైపు పాపానాయుడుపేట పర్యటనలో అక్కడి ఎమ్మెల్యేపై పదునైన విమర్శలు చేశారు. తాను కష్టపడి ప్రపంచ దేశాలన్నీ తిరిగి రేణిగుంట, ఏర్పేడు మండలాలకు పరిశ్రమలు తీసుకొస్తే అక్కడి ఎమ్మెల్యే మాత్రం వాటాల కోసం యాజమాన్యాలను వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. అతడి కుటుంబ నేపథ్యం ఏమిటి? చరిత్ర ఏమిటి? అతని రాజకీయ అనుభవం ఎంత? అంటూ ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో అతనికి గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పరిశ్రమల వల్ల వికృతమాలలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయని, ఇపుడు నాయకులు భూములను ఆక్రమించుకుని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇక్కడి ఎమ్మెల్యే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని, తాము అధికారంలోకి వచ్చాక ఈ దొంగలకు శిక్ష పడేలా చూస్తామని హెచ్చరించారు. అలాగే తిరుపతిలో తుమ్మలగుంట చెరువు క్రికెట్‌ స్టేడియంగా మారడానికి కారకులను గుర్తించి శిక్షించాలని డిమాండ్‌ చేశారు. శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల పరిధిలోని అధికార పార్టీ ముఖ్యనేతలపై చంద్రబాబు చేసిన ఈ పదునైన విమర్శలు, ఆరోపణలు  సామాన్య జనాన్ని  కదిలించినట్టుగా కనిపించింది. వయసు, వాతావరణం వంటివి పట్టించుకోకుండా అర్థరాత్రి వరకూ కూడా ఓపికగా వరద బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించడం జనాన్ని ఆకట్టుకుంది. మొత్తంమీద  చంద్రబాబు జిల్లా పర్యటన బాధిత జనానికిఓదార్పునిచ్చింది. 

Updated Date - 2021-11-27T07:15:09+05:30 IST