ప్రపంచం తెలంగాణ వైపు చూస్తోంది..

ABN , First Publish Date - 2022-05-18T05:18:45+05:30 IST

ప్రపంచం తెలంగాణ వైపు చూస్తోంది..

ప్రపంచం తెలంగాణ వైపు చూస్తోంది..
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నిరంజన్‌రెడ్డి

ఇజ్రాయిల్‌ను తలదన్నేలా తెలంగాణ వ్యవసాయ రంగం అభివృద్ధి

కేంద్రప్రభుత్వం తెలంగాణలో అడ్డంకులు సృష్టిస్తోంది..

లాభదాయక పంటల సాగుకు రైతులు సన్నద్ధం కావాలి

వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

వరంగల్‌, భూపాలపల్లి, మహబూబాబాద్‌ సాగు సన్నాహక సమావేశం


హనుమకొండ అగ్రికల్చర్‌, మే 17: ఇజ్రాయిల్‌ దేశాన్ని తలదన్నేలా తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధిస్తోందని, ప్రపంచమే తెలంగాణ వైపు చూస్తోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ హంటర్‌రోడ్డులోని కొడెం కన్వెన్షన్‌ హాలులో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వరంగల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల రైతు సమన్వయయ సమితి సభ్యులకు, ప్రజాప్రతినిఽధులు, గ్రామ, మండల వ్యవసాయశాఖ అధికారులకు ‘వానాకాలం - 2022 సాగుకు సన్నాహక సమావేశం’ కార్యక్రమానికి మంత్రి నిరంజన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడారు. 


తెలంగాణ నేలలు, వాతావరణం వ్యవసాయానికి ఎంతో అనుకూలంగా ఉన్నాయని, ఏ పంట వేసినా పుష్కలంగా పంటల దిగుబడి వస్తుందని అన్నారు. ఏయే లాభదాయకమైన పంటలు వేసుకోవాలనే విషయంలో, మార్కెట్లో ఏఏ పంటలకు డిమాండ్‌ ఉందన్న విషయంపై సరైన అవగాహన లేకపోవడంతో అన్నదాతలు నష్టపోతున్నారన్నారు. ఇలాంటి సమస్యలు అఽధిగమించడాని కోసం సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ‘వానాకాలం 2022 - సాగుకు సన్నాహక సమావేశం’ నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. 


ప్రపంచానికి సైతం కావాల్సిన పంటలు పండించగల సత్తా తెలంగాణ రైతులకు ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయరంగ అభివృద్ధికోసం రైతు బంధు, రైతు బీమా పథకాలను ఎలాంటి అడ్డంకులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని తెలంగాణ ఎంపీలు పార్లమెంటులో కోరినా పట్టించుకోకుండా రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేస్తోందని ఆరోపించారు.  


ప్రపంచ వ్యవసాయానికి నీటి పరిజ్ఞానాన్ని చాటి చెప్పిన ఘనత వరంగల్‌ జిల్లాకు ఉందని మంత్రి నిరంజన్‌రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. నీటిని ఒడిసిపట్టి వ్యవసాయానికి వాడుకోవచ్చనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేసిన ఘనత కూడా ఈ ప్రాంతానికి ఉందన్నారు. తెలంగాణ వ్యవసాయం బాగుండాలంటే అన్నదాతలను గౌరవించుకోవాలని మంత్రి చెప్పారు.  అన్ని విధాలా సౌకర్యాలున్న తెలంగాణ వ్యవసాయ భూముల్లో బంగారం పండించవచ్చని అన్నారు. ఇప్పటికే పంటల మార్పిడి విధానంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి అమలుకు అడుగులు వేస్తోందన్నారు. కిందటేడు 25వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు ప్రారంభించగా, ఈ యేడు ఒక లక్షా 75వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ పంటల సాగుకు సిద్ధమైనట్లు చెప్పారు. 


క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులు లాభదాయక పంటల సాగుపై ప్రత్యేక ప్రణాళికలు(క్యాలెండర్‌) సిద్ధం చేసుకొని గ్రామాలలో పర్యటిస్తూ రైతులకు తగు సూచనలందించాలని మంత్రి సూచించారు. విచక్షణారహితంగా రసాయన ఎరువుల వాడకం తగ్గించుకోవాలన్నారు. రాబోయే వానాకాలం పంటల ఎంపిక, విత్తనాల ఎంపిక విషయంలో అధికారులను సంప్రదించాలని సూచించారు.


ముఖ్యంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పత్తి, వరి, మొక్కజొన్న, మిరప పంటలు అధికంగా సాగవుతుంటాయని, వరి సాగును తగ్గించి కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేసుకోవడం ఉత్తమమని అన్నారు. గత వానాకాలంలో వరి సాగుచేయొద్దని చెప్పినా కొందరు రైతులు వరిసాగు చేసి విపరీతంగా నష్టపోయారన్నారు. కానీ పత్తి, మిరప పంటలకు రికార్డుస్థాయి ధరలు పలకండా రైతులకు ఉత్సాహన్నిచ్చిందన్నారు.  పత్తి, కంది, పండ్ల తోటల సాగు లాభదాయకంగా ఉంటుందని, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని ప్రజాప్రతినిధులు రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు, వ్యవసాయ అధికారులకు సూచించారు.  రైతులతో వ్యవసాయ అధికారులు సన్నిహితంగా ఉంటూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటుండాలని మంత్రి అన్నారు. అధికారులు ఇంటినుంచి భోజనం తీసుకెళ్లకుండా రైతుల వద్దే భోజనం చేయాలని సూచించారు. 


గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. గతంలో తెలంగాణ వ్యవసాయరంగం పరిస్థితి చాలా దయనీయంగా ఉండేదని తెలిపారు. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు దుకాణాల వద్ద బారులు తీరి కష్టాలు పడేవారన్నారు. అసెంబ్లీ ఎదుట కూడా ధర్నాలు చేసిన సం ఘటనలు ఉన్నాయన్నారు. ప్రస్తు తం రైతుల కష్టాలను తీర్చే విధివిధానాలతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందన్నారు. రైతుబంధు, రైతు బీమా పథకాలతోపాటు, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణంతో వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. 


రాష్ట్ర రైతు బంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఉజ్వలమైన దశ దిశను కల్పించిన ఘన సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. గ్రామాలల్లో క్షేత్రస్థాయిలో శిక్షణ శిబిరాలు నిర్వహించేలా రైతు సమన్వయ సమితి కోఆర్డినేట్లు, వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న ఘనం రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కనీసం 6 గంటల కరెంటు నిరంతరాయంగా ఇవ్వలుకపోతున్నారన్నారు. సాగులో ఖర్చు తగ్గించుకునేలా పంటల ఎంపిక, విత్తనాల ఎంపిక, సస్యరక్షణ యాజమాన్య పద్ధతులపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. 


ఈ సందర్భంగా మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌ జిల్లాల పరిధిలోని మండలాల వ్యవసాయ అధికారులతో  మంత్రి నిరంజన్‌రెడ్డి సభావేదికపై మాట్లాడారు. రైతులతో అధికారులకున్న సన్నిహిత సంబంధాలపై పశ్నించారు. తెలంగాణ ఏర్పడ్డాక కొత్తగా వ్యవసాయ అధికారులుగా ఉద్యోగాలు పొందిన యువ అధికారులతో మాట్లాడారు.  మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రసంగానికి ముందు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, రాష్ట్ర రైతు బంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు ప్రసంగించారు. 


ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఎమ్మెల్యేలు అరూరి రమేష్‌, సుదర్శన్‌రెడ్డి, శంకర్‌నాయక్‌, గండ్ర వెంకటరమణారెడ్డి, కవిత, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎంపీ బండా ప్రకాశ్‌, పసునూరి దయాకర్‌, వ్యవసాయశాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్‌రావు, ఉద్యానశాఖ రాష్ట్ర డైరెక్టర్‌ వెంకటరామిరెడ్డి, వరంగల్‌, భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల కలెక్టర్లు, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు, జిల్లా, మండల, గ్రామస్థాయి రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, డీసీసీబీ బ్యాంకు చైర్మన్‌ రవీందర్‌రావు, జడ్పీటీసీలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-18T05:18:45+05:30 IST