
ముంబై : దేశ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తామని, రష్యా చౌక చమురును కొనడాన్ని కొనసాగిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు. దేశంలో ఇంధన భద్రతకే తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. రాయితీ ధరకు చమురు దొరికినపుడు ఎందుకు కొనకూడదని ప్రశ్నించారు. CNBC-TV18 ఇండియా బిజినెస్ లీడర్ పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడాన్ని ప్రారంభించామని చెప్పారు. కొన్ని బ్యారెల్స్ చమురు వచ్చిందని, ఇది మూడు, నాలుగు రోజులకు సరిపోతుందని చెప్పారు. ఈ విధంగా కొనడాన్ని కొనసాగిస్తామని చెప్పారు. భారత దేశ సర్వతోముఖ ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకుంటామని చెప్పారు.
ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాపై ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో రష్యా నుంచి చమురును భారత దేశం కొనడం అమెరికా, బ్రిటన్లకు ఇష్టపడటం లేదన్న సంగతి తెలిసిందే. అయితే భారత్-రష్యా మధ్య దీర్ఘకాలిక సత్సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలను మరింత పటిష్టపరచుకోవడం కోసం రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగించాలని భారత్ నిర్ణయించింది.
విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ కూడా మన దేశ వైఖరిని సమర్థించుకున్నారు. రష్యా నుంచి భారత దేశం కొంటున్నది కేవలం 1 శాతం చమురు మాత్రమేనని, రష్యా నుంచి యూరోపు దేశాలే ఎక్కువ చమురును కొంటున్నాయని తెలిపారు. చమురు ధరలు పెరిగినపుడు, మార్కెట్లోకి వెళ్ళి, ప్రజలకు మేలు కలిగించే లావాదేవీల కోసం అన్వేషించడం సహజమేనని తెలిపారు. భారత్కు భారీ డిస్కౌంట్ ఇచ్చి చమురును అమ్మేందుకు రష్యా సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి