కపిల్ సిబల్ వ్యాఖ్యలపై నిర్మల సీతారామన్ మండిపాటు

ABN , First Publish Date - 2022-02-11T18:46:25+05:30 IST

భారత దేశం అమృత కాలంలో లేదని, 2014 నుంచి రాహు కాలంలో

కపిల్ సిబల్ వ్యాఖ్యలపై నిర్మల సీతారామన్ మండిపాటు

న్యూఢిల్లీ : భారత దేశం అమృత కాలంలో లేదని, 2014 నుంచి రాహు కాలంలో ఉందని సీనియర్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఘాటుగా స్పందించారు. గతంలో సోనియా గాంధీకి లేఖ రాసిన నేతలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, రాహు కాలం అంటే జీ-23ని సృష్టించే కాలమని చురకలంటించారు. అదేవిధంగా 2013లో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ చింపేయడం గురించి కూడా ప్రస్తావించారు. 


కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలంటూ 23 మంది కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై సంతకాలు చేసినవారిలో కపిల్ సిబల్ కూడా ఉన్నారు. 


నిర్మల సీతారామన్ రాజ్యసభలో శుక్రవారం బడ్జెట్‌పై మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడానికి, సుస్థిరత సాధించడానికి ఈ బడ్జెట్ దోహదపడుతుందన్నారు. ఈ ఏడాది బడ్జెట్ లక్ష్యం ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా కోలుకోవడమేనని చెప్పారు. ఈ మహమ్మారి వల్ల భారత దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందన్నారు. 


తాను నేరుగా ప్రజల నుంచి ఎన్నిక కాలేదని, తనకు క్షేత్ర స్థాయి వాస్తవాలు తెలియవని ప్రతిపక్షాలు ఆరోపించడంపై నిర్మల సీతారామన్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు ఉన్న కాలంలోని రాజ్యసభ సభ్యులు కూడా వాస్తవానికి దూరంగానే ఉన్నారా? అని ప్రశ్నించారు. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కూడా వాస్తవాలకు సంబంధం లేకుండా వ్యవహరించారా? అని నిలదీశారు. 


Updated Date - 2022-02-11T18:46:25+05:30 IST