నిర్వాణం

ABN , First Publish Date - 2020-12-23T09:24:14+05:30 IST

ఇంద్రియ సంపర్కంతో బ్రహ్మానందం అనుభవ రససిద్ధం కాదు. అనన్య చింతనే అసలు సాధన. ఇంద్రియానుభవాలన్నీ బంధనలే.

నిర్వాణం

ఇంద్రియ సంపర్కంతో బ్రహ్మానందం అనుభవ రససిద్ధం కాదు. అనన్య చింతనే అసలు సాధన. ఇంద్రియానుభవాలన్నీ బంధనలే. ప్రపంచానికి, ప్రపంచాతీత భావనకు శుద్ధభావనను సాధించుకోవాలి. అది వైవిధ్యమే తప్ప వైరుధ్యం కాదు. చలించే మనసుకు, బోధించే హృదయానికి మధ్య గల మహాశూన్యమే సంపూర్ణస్థితి. తెలుసుకుంటున్నవాడికి, తెలుసుకున్నదానికి మధ్య ఉన్నదే బంధన. ఇక తెలుసుకోవలసినదంటూ ఏమీ లేదన్న స్థితే విముక్తి. ఆలోచనకు, ఆలోచనకు మధ్య ఉన్న స్వల్ప విరామమే వెలుగు.


ఆ వెలుగే సర్వ ఫలప్రదాత. అదే అసలు మనం. అది నిజమైన మెలకువ. నిద్రకు ముందున్న ఆనందస్థితి. అదొక శిలాసదృశ సంస్థితి. మనసు మలగి, అవ్యయానందం మెరిసే నిశ్శబ్ద ఖేల! మట్టిపాత్రను ఆవరించిన మట్టివలె, శూన్య పూర్ణ స్థితులలో అచ్యుతానందం ఆవరించి ఉంటుంది. చెలియలికట్టకు మాత్రమే లోబడే మహాసముద్రం అలలను, కెరటాలను నిగ్రహించినట్లు.. హృదయం మాత్రమే మనసును అచలం చేయగలదు. సముద్రమంతా ఏ విధంగా జీవ జలమయమో అలా దృశ్యమాన ప్రపంచమంతా చైతన్యభరితమే.


చూస్తున్నది అనాత్మ! చూపిస్తున్నది ఆత్మ!!

అలలెరుగని ఆనందామృత సాగరం మనసును ముంచెత్తుతుంటుంది. దాన్ని గుర్తెరిగి, నిలబెట్టుకోవాలి. కట్టు తెగని మమకారం, మమత ఆచరణీయం. నిజానికి ‘నేను’ తప్ప అన్యం లేదు. ఆ ‘నేను’కే బ్రహ్మం అని పేరు. ఆ భావస్థితిని అందుకోగలిగితే ఈ జగమంతా ఆనంద సంద్రమే. ఈ అనుభవం భ్రమలను తొలగించి, బొమ్మలలోని బ్రహ్మాన్ని ఆవిష్కరిస్తుంది. అది అమృతానంద స్థితి. తెలుసుకోవడంతోనే ఆగక.. ఆచరించగలిగితే మనసు నిర్మలమవుతుంది. నీళ్లముందు నిలబడి ‘పటిక.. పటిక’ అంటే నీరు శుభ్రం కాదు. నీటిలో పటికను కలపాలి. అప్పుడే స్వచ్ఛత లభిస్తుంది. శుద్ధత్వం నుంచి బుద్ధత్వాన్ని సాధించాలి. అదే సిద్ధత్వం.


నేను ధ్యానిని అనుకోవడం కేవలం ఒక స్ఫురణే! దాన్నీ దాటగలిగితే అదే సమాధి. అంటే సర్వమూ అధీనమైన స్థితి. మనోలయం జరిగిన తరుణంలో ఎన్ని ప్రచండ వాయువులు వీచనీ, సర్వసముద్రాలు ఏకం కానీ, ద్వాదశాదిత్యులు ఏకకాలంలో జ్వలించనీ.. ఏమీ కాదు. అది అచ్యుత స్థితి. ద్వంద్వాతీత స్థితి. అదే అచల నిర్వాణ స్థితి. పాము కుబుసం విడుస్తున్నప్పుడు.. తన నుంచి ఏదో విడిపోతున్నట్లు తలపోస్తుంది. విడిచిన తక్షణం నిర్వికారంగా జరజర పాకి తన దారిన తాను వెళ్తుంది. ఇదే మనసును విదుల్చుకునే వైనం. మనసు విడివడిన నాడు మనిషిలోని పసితనం పల్లవిస్తుంది. అఖండ శిలలో దివ్యమూర్తి దాగి ఉన్నట్లు.. ఈ ప్రపంచం నిజానికి బ్రహ్మమయమే. కనుక ప్రపంచం అసత్‌గా కనిపించే సత్‌, జడంగా కనిపించే దివ్యచైతన్యం. ఈ విచారణే ఆత్మ విచార మార్గం. ఇదే సూటి దారి. ఇదే అసలు దారి!!

-వీఎ్‌సఆర్‌ మూర్తి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త

Updated Date - 2020-12-23T09:24:14+05:30 IST