గురివింద నేతలకు ‘నీతిచంద్రిక’

ABN , First Publish Date - 2022-08-03T06:32:11+05:30 IST

‘‘చాలారోజుల తర్వాత వీణాకర్ణుడు తన మిత్రుడు చూడాకర్ణుడిని చూసేందుకు అతడి ఇంటికి వెళ్లాడు. తన మిత్రుడిని సాదరంగా ఆహ్వానించిన చూడాకర్ణుడు అతడితో మాట్లాడుతూనే...

గురివింద నేతలకు ‘నీతిచంద్రిక’

‘‘చాలారోజుల తర్వాత వీణాకర్ణుడు తన మిత్రుడు చూడాకర్ణుడిని చూసేందుకు అతడి ఇంటికి వెళ్లాడు. తన మిత్రుడిని సాదరంగా ఆహ్వానించిన చూడాకర్ణుడు అతడితో మాట్లాడుతూనే పైకి చూస్తూ కర్రతో నేలపై కొట్టడం ప్రారంభించాడు. ‘ఏమిటి మిత్రమా అలా పైకి చూస్తూ నేలపై కొడుతున్నారెందుకు?’ అని వీణాకర్ణుడు విస్మయంతో చూడాకర్ణుడిని అడిగాడు. ‘ఒక ఎలుక ప్రతి రోజూ చిలుకకొయ్యపై నేను సంచీలో దాచుకున్న అన్నం తినేస్తోంది. దాని బాధ పడలేకపోతున్నాను’ అని చూడాకర్ణుడు చెప్పాడు. వీణాకర్ణుడు ఆశ్చర్యపోయి ‘ఒక ఎలుక అంతపైకి ఎగురుతోందా? దానికి బలమైన కారణం ఉండి ఉంటుంది’ అని అన్నాడు. ‘ముందుగా మనం ఎలుక కన్నం ఎక్కడో చూద్దాం. ఆ కలుగులోనే దాని సంపద ఉండి ఉంటుంది. త్రవ్వి చూద్దాం’ అని మిత్రుడికి సలహా ఇస్తాడు. ఇద్దరూ కలిసి కన్నం త్రవ్వేసరికి ఆహార పదార్థాలతో పాటు బంగారం, వెండి మొదలైన సంపద బయటపడుతుంది. సంపద పోయే సరికి ఆ ఎలుక బలహీనపడి అడవిలోకి పారిపోయింది.’


పరవస్తు చిన్నయ సూరి తన ‘నీతి చంద్రిక’లో చెప్పిన ఈ కథ మన రాజకీయ నాయకులతో పాటు అనేకమంది వ్యాపారవేత్తలకు కూడా వర్తిస్తుంది. నీతిచంద్రికలోని ఎలుకల్లా వారు తమ జీవితంలో కొన్ని దశల్లో ఎగిరెగిరిపడతారు. తమకు తిరుగులేదని, తమను ఎవరూ ఏమీ చేయలేరని భావిస్తారు. కాని వారు అలా ఎందుకు ఎగిరిపడుతున్నారో తెలుసుకునే వీణాకర్ణుడు, చూడాకర్ణుడు మొదలైన వారు కూడా ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాలు ప్రస్తుతం ఇదే పాత్రల్లో ఉన్నారని భారతీయ జనతా పార్టీలో చాలా మంది భావిస్తున్నారు. దేశంలో ప్రతిపక్షాల నాయకులు తమకు వ్యతిరేకంగా ఎగిరెగిరి పడినప్పుడల్లా ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్’(ఈడీ)ని ప్రయోగించి వారి బొక్కసాలను త్రవ్వే ప్రయత్నం చేస్తున్నారు ఈ నాయకద్వయం. ప్రతిపక్షాల ఆర్థిక మూలాలపై దెబ్బకొడితే అవి బలహీనపడతాయని, ఆ తర్వాత తమ విస్తరణకు తిరుగులేదని మోదీ, షాలు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. కొంత కాలం క్రితం వరకూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతి నెలరోజులకోసారి ఢిల్లీకి వచ్చి మోదీకి వ్యతిరేకంగా ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తానని వీరాలాపాలు చేసేవారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఇతర పార్టీలతో కలిసి యశ్వంత్ సిన్హాను కూడా నిలబెట్టారు. అయితే తన కేబినెట్ మంత్రి గృహంపై ఈడీ దాడులు చేసి కోట్లాది రూపాయలు వెలికి తీసిన తర్వాత ఆమె వైఖరిలో మార్పు వచ్చింది! శివసేన చీలికలో ఈడీ కీలక పాత్ర పోషించిందని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్‌తో సహా పలు ప్రాంతీయ పార్టీలు ఈడీ మూలంగా ఆత్మరక్షణలో పడ్డాయి. సోనియా, రాహుల్‌తో పాటు అనేకమంది విపక్ష నేతలు ఈడీ కార్యాలయాలు దర్శిస్తున్నారు.


నిజానికి ఈ అస్త్రం నరేంద్ర మోదీ కనిపెట్టింది కాదు. వీణాకర్ణులు, చూడాకర్ణులు అన్ని పార్టీల్లో ఉన్నారు. అవసరమైతే ఎలుకలు, కలుగులను సృష్టించే మహానుభావులు కూడా వారిలో ఉన్నారు. బోఫోర్స్ కుంభకోణం బహిర్గతమైన తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి నిష్క్రమించిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, ఆయన కుమారుడు అజేయ సింగ్‌కు సెయింట్ కిట్స్‌లోని బ్యాంకు ఖాతాల్లో రూ. 35 కోట్ల మేరకు నిధులు ఉన్నాయని 1989లో ఈడీ ఆరోపించింది. అదే సంవత్సరంలో ఆ దర్యాప్తు సంస్థ జాయింట్ డైరెక్టర్ ఏపి నందే, ఒక పత్రికా విలేఖరితో కలిసి పలు దేశాల్లో సుడిగాలి పర్యటనలు చేసి వచ్చి బోగస్ డాక్యుమెంట్లను మీడియాకు లీక్ చేశారు. కాంగ్రెస్ అనుకూల పత్రికగా ముద్రపడ్డ హిందూస్థాన్ టైమ్స్, నాడు రాజీవ్ గాంధీకి సన్నిహితంగా ఉన్న ఎంజె అక్బర్ (ఇప్పుడు బిజెపిలో ఉన్నారు) ఎడిటర్‌గా ఉన్న కలకత్తా దినపత్రిక ‘ది టెలిగ్రాఫ్’ ఆ డాక్యుమెంట్లను ప్రచురించింది. అనంతరం జరిగిన సార్వత్రక ఎన్నికల్లో నేషనల్ ఫ్రంట్ గెలిచి వీపీ సింగ్ ప్రధానమంత్రి కాకపోతే బహుశా ఆయన నేరస్థుడుగా ముద్రపడేవారేమో! వీపీ సింగ్, రాజీవ్ గాంధీల రాజకీయ శత్రుత్వం మూలంగానే ఇదంతా జరిగిందని, అందులో తన ప్రమేయం ఏమీ లేదని పీవీ నరసింహారావు ఆ తర్వాత కోర్టుకు చెప్పారు. దీంతో వీపీ సింగ్‌ను నిర్దోషిగా కోర్టు ప్రకటించింది.


ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు అధికారంలో ఉన్న పార్టీల ఎజెండాకు అనుగుణంగా ఎలా పనిచేస్తాయో చెప్పేందుకు ఉదాహరణలు అనేకమున్నాయి. రాజీవ్ హయాంలో భోపాల్ గ్యాస్ లీక్ విషాదానికి కారణమైన యూనియన్ కార్బైడ్ చైర్మన్ ఆండర్సన్‌ను అమెరికా నుంచి భారత్‌కు పిలిపించే విషయమై ఒత్తిడి చేయరాదని తనకు చెప్పారని సిబిఐ జాయింట్ డైరెక్టర్ బిఆర్ లాల్ వెల్లడించారు. 2013లో శ్రీలంకలో తమిళుల అణచివేతకు నిరసనగా డిఎంకే మద్దతు ఉపసంహరించుకున్న కొద్ది గంటల్లోనే ఆ పార్టీ నేత స్టాలిన్ నివాసంపై సిబిఐ దాడులు నిర్వహించింది. కనిమొళిపై ఛార్జిషీటును ఈడీ సిద్ధం చేసింది. పలు కేసుల విషయంలో రాజకీయ పెద్దలు తమపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని సిబిఐ మాజీ డైరెక్టర్లు యుఎస్ మిశ్రా, జోగిందర్ సింగ్ టెలివిజన్ ఛానళ్లలోనే ప్రకటించారు. తనను నిదానంగా వ్యవహరించమని మాజీ ప్రధాని ఇందర్ కుమార్ గుజ్రాల్ చెప్పారని లాలూప్రసాద్ యాదవ్ పశుగ్రాసం కుంభకోణాన్ని దర్యాప్తు చేసిన జోగిందర్ సింగ్ వెల్లడించారు. ప్రైవేట్ కంపెనీలకు బొగ్గు లైసెన్స్‌ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగిన కేసుల్లో సిబిఐ రాజకీయ జోక్యానికి గురవుతున్నదంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం.లోధా సైతం వ్యాఖ్యానించారు. సిబిఐని ‘పంజరంలో చిలుక’గా ఆయన అభివర్ణించారు. ‘ప్రభుత్వంతో యుద్ధం చేయడం సులభం కాదు. ప్రభుత్వానికి వేయి చేతులు ఉంటాయి. సిబిఐని ఉపయోగించి ఎప్పుడైనా మిమ్మల్ని జైలులో పెట్టవచ్చు’ అని సమాజ్ వాది పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ స్వయంగా ప్రకటించారు. ములాయంసింగ్ యాదవ్, అఖిలేశ్ యాదవ్, ఆయన సతీమణి డింపుల్ యాదవ్‌లపై సిబిఐ 2007లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసును పెట్టింది. భారత– అమెరికా అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాలు 2008 జూలై 22న యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాయి. ఆ సంక్షోభంలో యూపీఏ ప్రభుత్వానికి సమాజ్‌వాది పార్టీ కీలక మద్దతునిచ్చింది. ఆ తర్వాత ములాయం, ఆయన కుటుంబీకులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పసలేదని సోలిసిటర్ జనరల్ వాహనావతి ద్వారా అభిప్రాయం తెప్పించుకుని సిబిఐ కేసును యూపీఏ సర్కార్ నీరు కార్చింది. 2012లో రిటైల్ రంగంలో ఎఫ్‌డిఏని అనుమతించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన బిఎస్‌పి అధినేత్రి మాయావతికి సిబిఐ బూచి చూపించడంతో పార్లమెంట్‌లో నాటి ప్రభుత్వానికి ఆమె మద్దతు ప్రకటించాల్సి వచ్చింది. ‘ఇదేమిటి? మాయావతి కేసులో ప్రతిసారి మీరు వాయిదా కోరుతారు? ఒకసారి జవాబు దాఖలు చేసేందుకు సమయం అడుగుతారు. మరోసారి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తామంటారు, ఇంకోసారి అఫిడవిట్ దాఖలు చేస్తామని చెబుతారు’ అని 2010 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుదర్శన్ రెడ్డి, జస్టిస్ ఎస్ఎస్ నిజ్జార్ సిబిఐని మందలించారు.


ఇవాళ ప్రతిపక్షాలు ప్రదానమంత్రి నరేంద్రమోదీపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలనే నాడు బిజెపి కూడా చేసింది. 2013 సెప్టెంబర్‌లో రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు రాసిన ఒక సుదీర్ఘమైన లేఖలో మోదీ, అమిత్ షాతో సహా బిజెపి, ఆర్ఎస్ఎస్ నేతలపై రకరకాల తప్పుడు కేసులు మోపేందుకు పలు కుట్రలు జరిగాయని, పలువురు పోలీసు అధికారులను ఉపయోగించుకున్నారని, కాంగ్రెస్ నేతలతో ఒక ప్రత్యేక రాజకీయ సెల్ ఏర్పర్చి అందుకు ఒక గుజరాత్ అధికారిని సలహాదారుగా నియమించుకున్నారని ఆరోపించారు. సిబిఐని ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’గా ఆయన అభివర్ణించారు. ప్రస్తుతం ఈడీ డైరెక్టర్‌గా ఉన్న సంజయ్ కుమార్ మిశ్రా తమకు పూర్తిగా అనుకూలంగా వ్యవహరించడంతో ఆయన పదవీకాలాన్ని మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టు అభ్యంతరాలను సైతం కాదని ఆర్డినెన్స్ చేసి మరీ పొడిగించింది. కాంగ్రెస్ హయాంలో కూడా తమ వ్యూహాలకు అనుగుణంగా పనిచేసిన అధికారులను అందలమెక్కించిన సందర్భాలు లేకపోలేదు. 


దర్యాప్తు పద్ధతుల్లో గతానికీ, ఇప్పటికీ మౌలిక మార్పులు చోటు చేసుకున్నాయి. టెక్నాలజీ ద్వారా ప్రత్యర్థుల బలహీనతలు తెలుసుకునే సాధనాలు వచ్చాయి. గతంలో కంటే పచ్చిగా, బాహటంగా ఇప్పుడు ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వాలను పడగొట్టేందుకు, పార్టీని విస్తరించేందుకు కూడా వాడుకుంటున్నారు! ఈ వాస్తవాలు తెలిసినా చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే ఇవాళ నేతల పట్ల ఎవరికీ సానుభూతి లేదు. ఇదివరకు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో ప్రతిపక్ష నేతలందర్నీ జైళ్లలో కుక్కారు. గద్దె దిగిన తర్వాత షా కమిషన్ విచారణకు హాజరయినప్పుడు ఆమెకు పెద్ద ఎత్తున ప్రజా సానుభూతి లభించింది. ఇప్పుడు నేతలు వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడడం నిత్యకృత్యంగా మారడంతో జనానికి ఎవరిపైనా నమ్మకం లేని పరిస్థితి ఏర్పడింది. ప్రతిపక్షాల విశ్వసనీయత తగ్గడం ప్రభుత్వానికి ప్రయోజనకరమే. అయితే ప్రభుత్వ విశ్వసనీయత అదే సమయంలో తగ్గుతోందని, అధికారపక్షంలో కూడా అవినీతిపరులు చాలా మంది ఉన్నారని, వారు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని ప్రజలకు తెలుసు. భవిష్యత్‌లో తమ కలుగులను కూడా త్రవ్వే వీణాకర్ణులు, చూడాకర్ణులు వస్తారని అధికారంలో ఉన్న వారు తెలుసుకోవడం లేదు.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-08-03T06:32:11+05:30 IST