
పుణె: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నేత, మాజీ కేంద్ర మంత్రి శరదవ్ పవార్ (Sharad Pawar) శనివారంనాడిక్కడ జరిగిన ఓ కార్యక్రమలో బీజేపీ (BJP) సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari)పై ప్రశంసలు కురిపించారు. మహారాష్ట్ర చెరకు రైతుల వాణిగా నితిన్ గడ్కరిని అభివర్ణించారు. మహారాష్ట్ర చెరకు రైతుల వాణిని కేంద్రంలో ఆయన వినిపిస్తున్నారని కొనియాడారు. పుణెలోని వసంత్ దాదా సుదర్ ఇన్‌స్ట్రిట్యూట్ ఆధ్వరంలో జరిగిన షుగర్ కాంక్లేవ్ (Sugar conclave)లో పవార్ మాట్లాడుతూ, చక్కెర పరిశ్రమకు మేలు చేకూరే విధంగా, ముఖ్యంగా ఇథనాల్ ఉత్పత్తి విషయంలో ఆయన తీసుకుంటున్న చొరవ కారణంగా అనేక చక్కెర కర్మాగారాలకు మేలు జరుగుతోందన్నారు.
ఇవి కూడా చదవండి
విదర్భ ప్రాంతంలో చెరకు సాగు పెంచాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పవార్ అన్నారు. నీటి లభ్యత పెరిగేందుకు ఈ ప్రాంతంలో గోష్‌ఖుర్ద్ ప్రాజెక్టు ఎంతో ఉపయుక్తమవుతుందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా రైతులు ఇక్కడ చెరుకు పండిస్తూ వచ్చారని, అయితే కొన్నేళ్లుగా ఇతర పంటలకు మళ్లారని అన్నారు. ఈ ప్రాంతానికి అనువైన పంటలను వసంత్‌దాదా షుగర్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. నాగపూర్ ఎంపీగా ఉన్న నితిన్ గడ్కరి ఈ ప్రాంతంలో నాలుగు చక్కెర కర్మాగారాలు నడుపుతున్నారని చెప్పారు. అనేక కర్మాగారులు పనులు ప్రారంభించిన తర్వాత వివిధ కారణాలతో దివాళా తీశాయని అన్నారు. కాగా, షుగర్ కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ధాకరే, మంత్రి జైప్రకాష్ దండెగావోంకర్ తదితరులు పాల్గొన్నారు.