Haryana: కాంగ్రెస్ సహా అన్ని విపక్ష పార్టీల ఐక్యతకు నితీష్ పిలుపు

ABN , First Publish Date - 2022-09-26T00:34:20+05:30 IST

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో సహా బీజేపీయేతర పార్టీలన్నీ ''ప్రధాన ఫ్రంట్''గా ఏర్పడాలని..

Haryana: కాంగ్రెస్ సహా అన్ని విపక్ష పార్టీల ఐక్యతకు నితీష్ పిలుపు

ఫతేబాద్: జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో సహా బీజేపీయేతర పార్టీలన్నీ ''ప్రధాన ఫ్రంట్'' (Main Front)గా ఏర్పడాలని, 2024లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish kumar) పిలుపునిచ్చారు. మాజీ ఉపప్రధాని దేవీలాల్ 109వ జయంతి సందర్భంగా హర్యానాలోని ఫతేబాద్‌ (Fatebad)లో ఐఎన్ఎల్‌డీ ఆదివారంనాడు బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ప్రతిపక్షాల ఐక్యతా వేదకగా వివిధ విపక్ష పార్టీల నేతలు ఈ సభలో పాల్గొన్నారు. ఎన్‌సీపీ సుప్రీం శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ బాదల్, ఆర్జేడీ నేత, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, శివసేన నేత అర్వింద్ సావంత్ తదితరులు హాజరయ్యారు.


నితీష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాను ప్రధాని అభ్యర్థిని కానని, ప్రస్తుతం తృతీయ కూటమి ప్రసక్తే లేదని, బీజేపీని గట్టి దెబ్బ తీసేందుకు విపక్షాలతో ప్రధాన ఫ్రంట్ ఏర్పడాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు కలిసికట్టుగా ముందుకు వచ్చి 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీయాలని కోరారు. జాతీయ స్థాయిలో మనమంతా ఏకం కావాలన్నదే తన ఏకైక కోరికని, మరిన్ని పార్టీలను కూడా కలుపుకొని ఏకతాటిపైకి అందర్నీ తీసుకురావాలని అన్నారు.


ప్రజాస్వామ పరిరక్షణకే ఎన్డీయేకు భాగస్వాముల ఉద్వాసన: తేజస్వి

ఎన్‌డీఏ ఉనికి కోల్పోయే పరిస్థితి ఉందని, ఆ కూటమి భాగస్వాములుగా ఉన్న శివసేన, అకాలీదళ్, జేడీయూలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎన్డీయేతో తెగతెంపులు చేసుకున్నాయని అన్నారు. తప్పుడు వాగ్దనాలు చేయడం, అబద్ధాలు చెప్పడంలో బీజేపీకి ఎవరూ సాటి లేరని విమర్శించారు. భావసారూప్యం కలిగిన పార్టీలన్నీ కొత్త కూటమిగా ఏర్పడాల్సిన సమయం వచ్చిందని సుఖ్‌బీర్ బాదల్ అన్నారు. శివసేన, జేడీయూ, తమ పార్టీ కలిసి ఏర్పాటు చేసిన కూటమే నిజమైన ఎన్డీయే అని ఆయన తెలిపారు. బీజేపీ బలహీన శక్తిగా, చిన్న పార్టీగా ఉన్నప్పుడు తాము ఈ కూటమి ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. రైతులు, శ్రామికులతో  పొత్తు పెట్టుకునే సమయం ఇప్పుడు ఆసన్నమైందని అన్నారు.


నితీష్‌ను సమర్ధించిన పవార్

నితీష్ తరహాలోనే శరద్ పవార్ సైతం విపక్ష పార్టీలన్నీ ఐక్యత సాధించాలని కోరారు. 2024లో బీజేపీ ప్రభుత్వాన్ని మార్చాలంటే విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలన్నారు. ఇటీవల రద్దు చేసిన మూడు సాగు చట్టాలతో సహా కేంంద్ర ప్రభుత్వం పలు రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుందని, రైతులకు వాగ్దానం చేసిన కనీస మద్దతు దారును అమలు చేయలేదని, రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించలేదని అన్నారు.

Updated Date - 2022-09-26T00:34:20+05:30 IST