Bihar Nitish floor test: ఈ నెల 24న నితీశ్ బలనిరూపణ, కేబినెట్ విస్తరణపై ఫోకస్

ABN , First Publish Date - 2022-08-11T22:21:26+05:30 IST

పాట్నా: జేడియూ అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ నెల 24న అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోనున్నారు.

Bihar Nitish floor test: ఈ నెల 24న నితీశ్ బలనిరూపణ, కేబినెట్ విస్తరణపై ఫోకస్

పాట్నా: జేడియూ అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ నెల 24న అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోనున్నారు. మొత్తం ఏడు పార్టీలకు చెందిన 164 మంది ఎమ్మెల్యేలు  మద్దతిస్తున్నట్లు గవర్నర్ ఫాగు చౌహాన్‌కు ఇచ్చిన లేఖలో నితీశ్ తెలిపారు. జేడియా-ఆర్జేడీ-కాంగ్రెస్- సీపీఐ ఎంఎల్ ఇతర పార్టీల మద్దతుతో నితీశ్ ప్రభుత్వం ఈ నెల 10న కొలువు తీరింది. నితీశ్ ముఖ్యమంత్రిగా, తేజస్వీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం కూడా చేశారు.




మరోవైపు కేబినెట్ విస్తరణపై భాగస్వామ్య పార్టీల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. మొత్తం 35 మంది ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశమివ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. జేడియూ నుంచి 13 మందికి, ఆర్జేడీ నుంచి 16 మందికి అవకాశం ఇవ్వాలని నిర్ణయమైంది. కాంగ్రెస్ పార్టీకి 4, జితన్ రామ్ మాంజీకి చెందిన హెచ్ ఏ ఎం పార్టీకి ఒక మంత్రి పదవి దక్కనుంది. ఈ నెల 24, 25 తేదీల్లో బీహార్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కొత్త స్పీకర్ ఎన్నిక కూడా అప్పుడే జరుగుతుంది. అయితే ప్రస్తుత స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా రాజీనామాకు ససేమిరా అనడంతో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించారు. దీనిపై తానేమీ వ్యాఖ్యానించబోనని సిన్హా చెప్పారు. 



గత అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి అధికారం చేపట్టిన రెండేళ్ల తర్వాత బీజేపీ-జేడియూ మధ్య పొత్తు వికటించింది. ఈ నెల 9న ఈ పొత్తుకు గుడ్‌బై చెప్పి ఆర్జేడీ-కాంగ్రెస్- సీపీఐ ఎంఎల్‌తో నితీశ్ జత కట్టారు. తక్కువ సీట్లు వచ్చినా సీఎంని చేస్తే తమకు వెన్నుపోటు పొడిచి ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్నారని బీజేపీ విమర్శిస్తుండగా, తన పార్టీని బలహీనపరిచేందుకు చేస్తున్న కుట్రల నుంచి తప్పించుకోవడానికి బయటకు వచ్చినట్లు నితీశ్ చెబుతున్నారు. 



Updated Date - 2022-08-11T22:21:26+05:30 IST