బంగారు బాల్యానికై నిత్య పథికుడు

Published: Tue, 16 Aug 2022 00:51:45 ISTfb-iconwhatsapp-icontwitter-icon

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ పేరిట స్వేచ్ఛా సంబరాలు జరుపుకుంటున్న వేళ దేశంలోని లక్షలాది పిల్లలకు దుర్భర బానిసత్వం నుంచి విముక్తి కలిగించాలని, ఇందుకు అవకాశం కల్పించే బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని బాలల హక్కుల పోరాట యోధుడు, నోబెల్‌ శాంతి పురస్కార గ్రహీత కైలాస్‌ సత్యార్థి డిమాండ్‌ చేశారు. ఇటీవల ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కమిటీ సమావేశంలో సభ్యుని హోదాలో కైలాస్‌ సత్యార్థి పాల్గొన్నప్పుడు ఈ విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ‘మన స్వాతంత్ర్య పోరాటం సఫలం అయినందుకు ఉత్సవాలు చేసుకుంటున్నాం. కానీ, లక్షలాది పిల్లలు బానిసత్వపు చెరసాలలో ఇంకా మగ్గుతున్నారు. ఆ చిన్నారుల దీనస్థితిని చూసి భారతమాత హృదయం క్షోభిస్తోంది. వారికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కల్పించేందుకు ఇదే సరైన తరుణం’’ అని కైలాస్‌ సత్యార్థి అన్నారు. గీతం యూనివర్సిటీ వ్యవస్థాపక పురస్కారాన్ని అందుకునేందుకు ఇటీవల విశాఖపట్టణం వచ్చిన సందర్భంగా ఈయన ఈ వ్యాసకర్తతో ప్రత్యేకంగా మాట్లాడారు. పిల్లల అక్రమ రవాణా, నిర్బంధ వెట్టిచాకిరి, బాలకార్మికులు, లైంగిక దోపిడీ, బాలబాలికల హక్కులు తదితర విషయాలపై తన పోరాటాన్ని వివరించారు.


మధ్యప్రదేశ్‌లోని విదిషలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కైలాస్‌ సత్యార్థి బాల్యంలో చదువుతోపాటు అన్ని అవకాశాలకు దూరంగా ఉన్నారు. ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ ఎదిగిన సత్యార్థి గళం విప్పలేని పిల్లల తరపున పోరాడుతున్నారు. అలుపెరుగని ఆయన కృషి వల్లే అమలులోకి వచ్చిన నిర్బంధ ఉచిత విద్యాచట్టం వల్ల పరిస్థితి మెరుగుపడిందనడంలో సందేహం లేదు. అయితే రావాల్సిన మార్పు ఇంకా పూర్తిగా రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. పిల్లల్ని పనికి బదులు పాఠశాలకు పంపాలన్న ఆలోచన తల్లిదండ్రుల్లో ఇప్పుడిప్పుడే నాటుకుంటోంది. అందువల్లనే పాఠశాలల్లో హాజరుశాతం పెరిగింది. అలాగే స్కూల్‌లో చేరి వెంటనే మానివేయకుండా ఎక్కువ సంవత్సరాలు చదువును కొనసాగిస్తున్నారు. చదువు కేవలం ఉద్యోగం కోసమే కాదు. జీవితంలో అన్నివిధాల నిలబడేందుకు ఉపకరిస్తుందని తల్లిదండ్రులు గుర్తించారని సత్యార్థి చెప్పారు. అయితే ఎక్కువ మంది పిల్లలు చదువును కోరుకుంటున్నందువల్ల ఇప్పుడే అసలైన సవాలు ఎదురవుతోంది. విద్యారంగంలో ప్రభుత్వ పెట్టుబడులు సరిపోవడంలేదు. ప్రభుత్వ కేటాయింపులు స్థూల జాతీయోత్పత్తిలో నాలుగుశాతానికి మించడంలేదు. జనాభాలో 40శాతం 18ఏళ్ల కంటే తక్కువ వయస్సుగల పిల్లలు, యువత ఉన్న దేశంలో ఇదేం అన్యాయమంటూ కైలాస్‌ సత్యార్థి ప్రశ్నించారు. ఈ విషయమై ఆయన వివిధ వేదికలపై స్వరం విప్పుతున్నారు. వ్యక్తిగతంగా రాజకీయనేతలు విధాన నిర్ణేతలతో మాట్లాడుతున్నారు. ఫలితం ఏమైనా ఉందా అన్నప్పుడు ఆయన మాటల్లోనే చెప్పాలంటే ప్రస్తుతానికి కాస్త చలనం వస్తోంది. అయినా ఇప్పటికీ విద్యకు ఇవ్వాల్సిన రాజకీయ ప్రాధాన్యాన్ని రాజకీయవేత్తలు, ప్రభుత్వాలు ఇవ్వడం లేదని కైలాస్‌ సత్యార్థి అన్నారు. విద్యా బాధ్యతలను పూర్తిగా రాజకీయ వ్యవస్థపైనే తోసివేయకుండా సమాజమే తన భుజస్కంధాలపై వేసుకోవాలి. పుట్టిన ప్రతి బాలుడు, బాలికకు హక్కులు ఉంటాయని... అందులో చదువుకునే అవకాశం కల్పించడం ఒక హక్కుగా సమాజంలోని అన్ని వర్గాలు గుర్తించినప్పుడే సహజంగానే ప్రభుత్వ వ్యవస్థపై వత్తిడి ఏర్పడుతుందని కైలాస్‌ సత్యార్థి అభిప్రాయపడ్డారు.


రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధ బాధిత చిన్నారులపై కూడా కైలాస్‌ సత్యార్థి దృష్టిపెట్టారు. ఈ యుద్ధం కారణంగా 52లక్షల మందికి మానవతా సాయం అవసరమని గుర్తించారు. పాఠశాలలను సైనిక క్యాంపులుగా వినియోగించడాన్ని సత్యార్థి గట్టిగా వ్యతిరేకించారు. పాఠశాలల్లో సైనిక కార్యకలపాలను నిషేధించాలని ఆయన డిమాండ్‌ చేశారు. భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో కూడా పాఠశాలలను సైనిక కార్యకలాపాలకు వినియోగిస్తుంటారు. పాఠశాలలు సురక్షితమైన ప్రదేశాలుగా ఉంటేనే తల్లిదండ్రులు పిల్లలను నిర్భీతిగా పంపగలుగుతారని సత్యార్థి వ్యాఖ్యానించారు. ప్రపంచంలో సుమారు ఏ మూల యుద్ధం జరిగినా, ఏ విధమైన హింసాత్మక ఘటన సంభవించినా అది మన అనాగరికతకు గుర్తుగా నిలుస్తుందని సత్యార్థి అన్నారు. దీన్ని నివారించడం మనచేతుల్లోనే ఉన్నదని ఆయన విశ్వాసం.


కొవిడ్‌ ఉత్పాతం అనంతరం బాలకార్మిక సమస్య మళ్లీ విజృంభించిందని కైలాస్‌ సత్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. ‘తల్లిదండ్రులు ఉపాధి కోల్పోవడంతో పిల్లల పరిస్థితి దయనీయంగా మారింది. వెట్టిచాకిరి, బాలకార్మిక సమస్య, శ్రామిక దోపిడీ, లైంగిక లొంగుబాటు, చట్టవ్యతిరేకంగా మానవ అవయవాల మార్పిడి ఇత్యాది అక్రమాలు విజృంభించాయి. కొవిడ్‌ సమయంలోను, ఆ తర్వాత పిల్లలపై లైంగిక దాడులు ఎక్కువయ్యాయని’ ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ధోరణి ప్రపంచ దేశాల్లోనే కాదు భారత్‌లోనూ అధికమయిందని ఆయన చెప్పారు. ఆన్‌లైన్‌లో విశృంఖలంగా అశ్లీల మెటీరియల్‌ అందుబాటులో ఉండటమే ఇందుకు కారణం. ఈ సమస్యపై అందరూ దృష్టి పెట్టి పరిష్కారాలు అన్వేషించాలని నోబెల్‌ పురస్కార గ్రహీత అన్నారు.


కటిక దారిద్య్రంలో పుట్టిన పిల్లలు వికసించకముందే మొగ్గలోనే దాష్టీకాలకు, దురాచాలాకు బలికాకుండా వారి హక్కులకోసం 1998లో 103 దేశాలను కలుపుకుంటూ సత్యార్థి 80వేల కిలోమీటర్ల మేర ప్రపంచయాత్ర చేశారు. దోపిడీకి గురవుతున్న పిల్లల తరపున జరిగిన పెద్ద సామాజిక ఉద్యమంగా ఇది నిలిచిపోయింది. ఇదే తరహాలో పిల్లలపై అత్యాచారాలను నిరసిస్తూ 35 రోజులపాటు 19వేల కిలోమీటర్ల భారత్‌ యాత్ర చేశారు. చిన్నారులకు గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించేందుకు నాలుగు దశాబ్దాల నుంచి ప్రతికూల పరిస్థితులలో పోరాటం చేస్తున్న కైలాస్‌ సత్యార్థి 2014లో పాకిస్థాన్‌ బాలిక మలాల యూసుఫ్‌ జాయ్‌తో కలిసి నోబెల్‌ శాంతి పురస్కారాన్ని పంచుకున్నారు. నోబెల్‌ శాంతి బహుమానం పొందిన తొలి భారతీయుడిగా కైలాస్‌ సత్యార్థి ప్రస్తుతం ప్రపంచ దేశాలలోని బాలబాలికలకు మెరుగైన జీవితం కల్పించేందుకు అంతర్జాతీయ స్థాయిలో సామాజిక భద్రతా నిధి (సోషల్‌ సెక్యూరిటీ ఫండ్‌) ఏర్పరచాల్సిన అవసరంపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీన్ని సాధించడం కోసం 90మంది అత్యంత ప్రభావశీలురు అయిన ప్రముఖులతో వేదికను రూపొందించారు. ఇందులో 40మంది నోబెల్‌ బహుమతి గ్రహీతలు, మరో 50మంది వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు, మాజీ అధ్యక్షులు, మాజీ ప్రధానమంత్రులు ఉన్నారు. ఈ మేరకు కైలాస్‌ సత్యార్థి రూపకల్పన చేసిన డిక్లరేషన్‌పై 90మంది ప్రముఖులు సంతకాలు చేశారు. దీని ప్రభావంవల్ల ఇప్పటికే సబ్‌ సహారా, ఆఫ్రికా దేశాల్లో అణగారిన వర్గాల పిల్లల కోసం సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయి. ఆయా దేశాల బడ్జెట్‌లలో కేటాయింపులు పెరిగాయి. సామాజిక భద్రతానిధి గాని ఏర్పడితే పేదదేశాల్లో చిన్నారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఆయా దేశాలకు నిధులు లేకపోతే, ధనికదేశాలు ఇచ్చే విరాళాల నుంచి వినియోగించే అవకాశం ఉంటుంది. ఈ దిశగా కైలాస్‌ సత్యార్థి చేస్తున్న కృషి ఫలితంగా ఐరాస సంస్థలు కూడా అటువైపు అడుగులు వేస్తుండటం పట్ల ఆయన సంతృప్తిగా ఉన్నారు.


బచావో బచ్‌పన్‌ ఆందోళన్‌, గ్లోబల్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ సహా పలు సంస్థలు, వేదికల ద్వారా పిల్లల హక్కుల సాధనకోసం పనిచేస్తున్న సత్యార్థి రాబోయే ఐదేళ్లలో రెండు లక్ష్యాలు సాధించాలనుకుంటున్నారు. ఒకటి–అంతర్జాతీయంగా సామాజిక భద్రతా నిధిని ఏర్పరచేలా ప్రపంచదేశాలను ఒప్పించడం, రెండు– జాతీయంగా పిల్లల అక్రమ రవాణా, అమ్మకాలను నిరోధించగలిగే బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపచేసేందుకు కృషిచేయడం. నిజానికి యు.పి.ఎ. హయాంలో పిల్లల అక్రమరవాణా నిరోధం బిల్లు లోక్‌సభ ఆమోదం పొందినా రాజ్యసభలో ప్రవేశానికి నోచుకోలేదు. ఆపై కాలాతీతమై మురిగిపోవడంతో ఎన్‌.డి.ఎ. హయాంలో మరో బిల్లు ప్రవేశపెట్టేందుకు కైలాస్‌ సత్యార్థి తీవ్ర కృషిచేస్తున్నారు. ‘ఇది మరింత పదునైన బిల్లు. ఇది చట్టరూపంలోకి వస్తే అక్రమ రవాణాదారుల ఆటకట్టవుతుంది’ అని కైలాస్‌ సత్యార్థి అన్నారు. పిల్లలు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా చిన్నారులే. వారి బాల్యం చితికిపోకూడదు. బంగారులోకంలోకి అడుగుపెట్టే హక్కు వారికుంది. చిన్నారుల కన్నీటి చారికలు తుడిచేందుకు 68ఏళ్ల కైలాస్‌ సత్యార్థి దేశంలోను, వెలుపల నిత్య పథికునిలా తిరుగుతూనే ఉన్నారు.

ఎస్‌.వి. సురేష్‌

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.