యాదగిరీశుడికి వైభవంగా నిత్యకైంకర్యాలు

ABN , First Publish Date - 2022-09-26T05:38:13+05:30 IST

యాదాద్రీశుడికి ఆదివారం నిత్యపూజా కైంకర్యాలు వైభవంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం, బిందెతీర్థంతో అర్చకస్వాములు నిత్యారాధనలు నిర్వహించారు.

యాదగిరీశుడికి వైభవంగా నిత్యకైంకర్యాలు
నిత్య కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

యాదగిరిక్షేత్రంలో భక్తుల సందడి  

యాదగిరిగుట్ట, సెస్టెంబరు25: యాదాద్రీశుడికి ఆదివారం నిత్యపూజా కైంకర్యాలు వైభవంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం, బిందెతీర్థంతో అర్చకస్వాములు నిత్యారాధనలు నిర్వహించారు. గర్భాలయంలోని స్వయంభువులకు.. సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులకు వేదమంత్ర పఠనాలతో నిజాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో తులసీదళాలతో అర్చించారు. అష్టభుజిప్రాకార మండపంలో హోమం, నిత్యతిరుకల్యాణపర్వాలు ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో సువర్ణ పుష్పార్చనలు, అష్టోత్తరాలు కొనసాగాయి. అనుబంధ శివాలయంలో రామలింగేశ్వరస్వామికి, ముఖమండపంలో స్పటిక మూర్తులకు నిత్య పూజలు, కొండకింద గండి చెరువు సమీపంలోని దీక్షాపరుల మండపంలో సత్యనారాయణస్వామి వ్రతపూజలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి.


క్షేత్ర సందర్శనకు తరలి వచ్చిన భక్తులు 

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. గర్భాలయంలో కొలువైన స్వయంభువుల దర్శనాలు.. ఆర్జిత సేవల నిర్వహణ కోసం.. భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. క్షేత్ర సందర్శనకు విచ్చేసిన భక్తజనులు ఇష్టదైవాల దర్శనాలు, మొక్కుపూజల కోసం క్యూలైన్లలో బారులుతీరారు. దేవదేవుడి దర్శనాల కోసం విచ్చేసిన యాత్రాజనుతో కొండకింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, బస్టాండ్‌లు..కొండపైన ఆలయ తిరువీధులు, దర్శన క్యూలైన్లు, ప్రధానాలయం, ప్రసాదాల విక్రయశాల తదితర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు అధిక సంఖ్యలో వాహనాల్లో తరలిరావడంతో పట్టణంలో పలుమార్లు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దర్శనానంతరం ఆలయ తిరువీధుల్లో, ఘాట్‌రోడ్‌, పెద్దగుట్టపైన, రాయగిరి చెరువు ప్రాంతంలోని గార్డెన్‌లలో భక్తులు సేదతీరారు. అదేవిధంగా అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ భక్తుల రద్దీ కొనసాగింది. పాతగుట్ట ఆలయంలో స్వయంభువులను దర్శించుకున్న యాత్రీకులు ఆలయ ఆవరణలో పిల్లాపాపలతో సేదతీరారు. స్వామికి వివిధ విభాగాల ద్వారా రూ.15,49,005 ఆదాయం ఆలయ ఖజానాకు సమకూరినట్టు, సుమారు 12,701 మంది భక్తులు దర్శించుకున్నట్లు దేవస్థాన ఈవో గీతారెడ్డి వెల్లడించారు.


ఘనంగా బతుకమ్మ సంబురాలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో ఆదివారం ఎంగిలి పూల బతుకమ్మ సంబురాలు ఘనంగా కొనసాగాయి. ప్రతీ సంవత్సరం యాదగిరిక్షేత్రంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఆలయ సంప్రదాయం. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలకు అర్చకులు ప్రత్యేక పూజలు జరపగా శివాలయ ఆవరణలో దేవస్థాన మహిళా సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో ఆటపాటలతో బతుకమ్మ సంబురాలలో పాల్గొన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు పెంపొందించే విధంగా ప్రతీ సంవత్సరం బతుకమ్మ సంబురాలను నిర్వహిస్తోంది.


నేటి నుంచి శరన్నవరాత్రి మహోత్సవాలు

యాదాద్రిక్షేత్రంలో నేటి నుంచి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా శైవాగమ పద్ధతిలో కొనసాగనున్నాయి. ఈ నెల 26వ తేదీ ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి సోమవారం నుంచి అక్టోబరు 5వ తేదీ ఆశ్వీయుజ శుద్ధ దశమి బుధవారం వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ యేడు  శివాలయంలోనే శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నట్టు, ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు దేవస్థాన అధికారులు పేర్కొన్నారు. కాగా నవరాత్రి మహోత్సవాలలో తొమ్మిది రోజుల పూజా కైంకర్యాల్లో పాల్గొనే భక్తజనులు రూ.1,116, ఒక్క రోజు సప్త శతి పారాయణం, కుంకుమార్చనల్లో పాల్గొనే భక్తులు రూ.116 చెల్లించాలని శరన్నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొనాలని దేవస్థాన అధికారులు తెలిపారు.


శరన్నవరాత్రి వేడుకల్లో నేటి పర్వాలు

26వ తేదీ సోమవారం ఉదయం 11.45గంటలకు విశ్వక్సేన పూజ, స్వస్తివాచనం, రుత్విగరణం, అఖంఢదీపారాధన, అంకురారోపణం, మూలమంత్ర జప సప్తశతీ, లలితా పారాయణం నిర్వహిస్తారు. 

Updated Date - 2022-09-26T05:38:13+05:30 IST