Advertisement

ని‘వార్‌’

Nov 27 2020 @ 00:39AM

అన్నదాతను నట్టేట ముంచిన తుఫాను

పంట చేతికొచ్చే దశలో  రైతుల ఆశలపై నీళ్లు

27,500 హెక్టార్లలో  వరి నీటమునక 

జిల్లావ్యాప్తంగా  వర్షాలు

రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం

పంటలు చేతికొచ్చే తరుణం. కొద్దిరోజుల్లో అప్పులు తీర్చగా, కుటుంబ పోషణకు ఎంతో కొంత నగదు మిగులు తుందనుకున్న అన్నదాతల ఆశలపై నివర్‌ తుఫాను నీళ్లు చల్లింది. నోటిదాకా అందిన కూడును నేలపాలు చేసింది. తుఫాను ప్రభావానికి జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షాలకు వరిపంట నాశనమైంది. కళ్లెదుటే నీటమునిగిన పంటను చూసి రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. జిల్లావ్యాప్తంగా 27,500 హెక్టార్లలో పంట మునిగిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇక విజయవాడ నగరంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లు నీట మునిగాయి. ఇప్పటికే గోతులతో నిండిన రోడ్లపై వర్షం నీరు చేరడంతో ప్రమాదాలు జరిగాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది నిండుకుండను తలపిస్తోంది. వర్షానికి చలిగాలులు తోడవడంతో జిల్లావాసులు వణికిపోయారు.

మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి : జిల్లావ్యాప్తంగా గురువారం భారీవర్షం కురిసింది. అయితే, వరి పంటను కాపాడుకునే అవకాశం లేకపోయింది. చేతికందే దశలో ఉన్న పంట కళ్లెదుటే నీటమునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గురువారం ఒక్కరోజే 27,500 హెక్టార్లలో పంట నీటమునిగిందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇందులో రెండు హెక్టార్లలో మినుము ఉన్నట్టు డీఆర్వో  వెంకటేశ్వర్లు తెలిపారు. పంటనష్టం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

ఫ స్తంభించిన జనజీవనం

భారీ  వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. గురువారం ఉదయం 8 గంటలకు జిల్లాలో 9.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముదినేపల్లిలో అత్యధికంగా 25.6, నందిగామలో అత్యల్పంగా 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తుఫాను తీరం దాటినా.. కోస్తాతీరం వెంబడి మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  భారీవర్షం, బలమైన గాలుల కారణంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 

ఫ కన్నీటి సంద్రంలో అన్నదాత

ఈ ఖరీఫ్‌లో 2.45 లక్షల హెక్టార్లలో వరిసాగు జరిగింది. ప్రస్తుతం కోతకు సిద్ధమైంది. సుమారు 50 వేల హెక్టార్లలో వరికోతలు పూర్తయ్యాయి. దాదాపు 25వేల హెక్టార్లలో పంట పనలపై ఉంది. 25వేల హెక్టార్లలో కుప్పలు వేశారు. మిగిలిన పొలంలో కోతకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా వరిపైరు నేలకొరిగింది. ఈ పంటపై వర్షపునీరు చేరడంతో సన్నరకాల వరి వంగడాలు ఒక్కరోజు వ్యవధిలోనే రంగుమారడంతో పాటు మొలకలు వస్తాయని రైతులు చెబుతున్నారు.

ఫ భారీ పెట్టుబడి నీటిపాలు

వరిసాగు కోసం రైతులు భారీగా పెట్టుబడి పెట్టారు. దుక్కి, దమ్ముకు రూ.3వేలు, నారుమడి, విత్తనాల ఖర్చు రూ.1,500, నాట్లు వేసేందుకు రూ.6వేలు, నాలుగు విడతల్లో ఎరువులకు రూ.5వేలు, కలుపు తీసేందుకు రూ.1,000, నాలుగు విడతల్లో పురుగుమందుల పిచికారీకి రూ.4వేలు, రెండుసార్లు గుళికలు వేసినందుకు రూ.1,500, దోమపోటు నివారణ పురుగుమందు పిచికారీకి రూ.1,000 ఖర్చు చేశామని రైతులు చెబుతున్నారు. మినుము సాగుచేసే పొలాల్లో వరికోతకు ఎకరాకు రూ.7వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చు చేశామని రైతులు చెబుతున్నారు. కోతకు వచ్చే  సమయానికి ఎకరాకు రూ.24వేలకు పైగా పెట్టుబడిగా పెట్టామని, వర్షాలకు పంట మొత్తం నీటమునిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేలవాలిన వరిపంటపై వర్షపు నీరు చేరిందని, పంట నీటిలో తేలియాడుతోందని చెబుతున్నారు.   

ఫ జేడీ జాడేది?

తుఫాను కారణంగా  జిల్లాలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే జిల్లా వ్యవసాయశాఖ జేడీ  టి.మోహనరావు మాత్రం అందుబాటులో లేరు. రెండు రోజులుగా పంటనష్టం వివరాల కోసం ఆయనను సంప్రదించేందుకు ప్రయత్నిస్తే ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. ఏడీలు పంటనష్టం వివరాలు ఇవ్వట్లేదు.

ఐదు విడతల్లో నష్టం

ఈ ఏడాది ఖరీఫ్‌ ప్రారంభం నుంచే  రైతులను  భారీ వర్షాలు, వరదలు వెంటాడుతున్నాయి.    జూలైలో  భారీ వర్షాల కారణంగా 160 హెక్టార్లలో, ఆగస్టులో భారీ వర్షాలు, వరదల కారణంగా 3,373 హెక్టార్లలో వరి నీట మునిగింది. సెప్టెంబరులో భారీ వర్షాలు, వరదల కారణంగా 1,672 హెక్టార్లలో,  అక్టోబరులో  వరదల కారణంగా 7,311 హెక్టార్లలో పంటనష్టం జరిగింది. ఖరీఫ్‌ ప్రారంభం నుంచి అక్టోబరు నెలాఖరు నాటికి జిల్లాలో 12,516 హెక్టార్లలో పంటనష్టం జరిగింది. ఈనెల ప్రారంభంలో కురిసిన వర్షాలకు పంటనష్టం జరగ్గా, నివర్‌ తుఫాను కారణంగా కురుస్తున్న తాజా వర్షాలకు పంట మొత్తం దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.

 
కోడూరులో నేలకొరిగిన వరిపైరు


గుడిపాడులో ధాన్యంపై కప్పిన పట్టాపై నీటిని తొలగిస్తున్న రైతు


చల్లపల్లిలో కోతకోసి ఉన్న వరిపంటలో వర్షపు నీరు


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.