క‘న్నీరే’ మిగిలింది!

ABN , First Publish Date - 2020-11-30T03:42:45+05:30 IST

నివర్‌ తుపాను ప్రభావంతో జిల్లాలో నాలుగు రోజులపాటు ఊహించని రీతిలో వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల కుంభవృష్టి, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి.

క‘న్నీరే’ మిగిలింది!
కొండపి మండలం పెట్లూరులో ఉరకెత్తిన పొగ తోటలు

 వెలిసిన వర్షం

అంచనాలకు అందని పంట నష్టం

ఇంకా నీటిలోనే వేలాది ఎకరాల్లో పైర్లు

కాపాడుకొనేందుకు రైతుల పాట్లు

పలుచోట్ల నేతల పరిశీలన, 

రైతులకు ఓదార్పు

నివర్‌ తుఫాన్‌ జిల్లాలో వ్యవసాయ రంగాన్ని దారుణంగా దెబ్బతీసింది. నోటికాడికి వచ్చిన పంటలను నీట ముంచింది. కర్షకులకు కన్నీళ్లను మిగిల్చింది. నాలుగు రోజులు కురిసిన వర్షం తెరిపివ్వడంతో నష్టం వెలుగు చూస్తుండగా అది అంచనాలకు అందకుండా ఉంది. వేలాది హెక్టార్లలో మిర్చి, పొగాకు పంటలు ఉరకెత్తిపోగా, మినుము చేతికి రాకుండాపోయింది. చాలాప్రాంతాల్లో కోతకు వచ్చిన వరి, అలాగే ఇప్పటికే కోసి ఉన్న పంట పూర్తిగా దెబ్బతింది. పత్తి, కంది, ఇతరత్రా పంటల దిగుబడులు దారుణంగా పడిపోయే పరిస్థితి కనిపిస్తున్నది. ఇంకా వేలాది ఎకరాల్లో పైర్లు నీటిలోనే ఉండిపోయాయి. వాటిని కాపాడుకునేందుకు రైతులు పడరానిపాట్లు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులు పంట నష్టాలను పరిశీలించి రైతులను ఓదార్చుతున్నారు. 

ఒంగోలు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : నివర్‌ తుపాను ప్రభావంతో జిల్లాలో నాలుగు రోజులపాటు ఊహించని రీతిలో వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల కుంభవృష్టి, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. అత్యధిక ప్రాంతాల్లో ఈనాలుగు రోజుల వ్యవధిలోనే 20నుంచి 50సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దాదాపు లక్షన్నర హెక్టార్లలో పంటలు  నీటమునిగినట్లు అంచనా.  వర్షాలు రెండు రోజులుగా తెరిపివ్వడంతో అత్యధిక ప్రాంతాల్లో పంట భూముల్లోని నీటిని బయటకు పంపి ఉన్న పంటను రక్షించుకొనేందుకు రైతులు కష్టపడుతున్నారు. అయితే వర్షాల వల్ల పంటలకు జరిగిన నష్టం ప్రస్తుతం వెలుగు చూస్తోంది. తొలుత వర్షపునీరు బయటకు పంపగలిగితే పెద్దగా నష్టం ఉండకపోవచ్చని అటు యంత్రాంగం, ఇటు రైతులు భావించారు. అయితే వరుసగా నాలుగు రోజులపాటు కుండపోత వర్షం కురవడంతో ఆనీటిని బయటకు పంపడం ఆలస్యమైంది. ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చాలా ప్రాంతాల్లో మిర్చి, పొగాకు, మినుము పంటలు దెబ్బతిన్నాయి. పత్తి, కంది, ఇతరత్రా పంటల దిగుబడులు దారుణంగా పడిపోయే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ ఏడాది మిర్చి అధికంగా సాగు చేయగా సగటున హెక్టారుకు ఇప్పటికే దాదాపు లక్ష రూపాయాల వరకూ రైతులు ఖర్చు చేశారు. చాలాచోట్ల పంట దెబ్బతిని మళ్లీ వేసుకోవాల్పిన పరిస్థితి కనిపిస్తున్నది. శనగ సాగు చేసి కొద్దిరోజులు మాత్రమే కాగా ఇంచుమించు ఆ పంట మొత్తం మళ్లీ వేయక తప్పని పరిస్థితి కనిపిస్తున్నది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఒక్కో రైతుకు ఒక్కో విధంగా భారీ నష్టమే జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

పర్చూరు ప్రాంతంలో దేవినేని, ఏలూరి పర్యటన

పంట నష్టాలను పలు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులు పరిశీలించి రైతులను ఓదార్చుతున్నారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులు ఆదివారం పర్చూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. పంట నష్టాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలను తెలుసుకున్నారు. మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు కూడా వారివారి నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో పర్యటించి పంట నష్టాలను పరిశీలించారు. మరోవైపు వ్యవసాయ, ఉద్యానశాఖలతో పాటు పొగాకుబోర్డు అదికారులు గ్రామాల్లో తిరిగి ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న పంటలను రక్షించుకోవడంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. 





Updated Date - 2020-11-30T03:42:45+05:30 IST