నివర్‌ పంజా

ABN , First Publish Date - 2020-11-27T06:07:52+05:30 IST

దాదాపు 450 కి.మీ. దూరంలో ఉన్న పుదిచ్చేరి సమీపంలో తుఫాన్‌ తీరం దాటినప్పటికీ జిలాల్లో మాత్రం ఆ ప్రభావం తీవ్రంగానే కనిపించింది

నివర్‌ పంజా

అంతా అతలాకుతలం..!

నివర్‌ ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షాలు

తోడైన ఈదురుగాలులు, నేలకొరిగిన చెట్లు

పలుచోట్ల రవాణా, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

నీటిలోనే వేలాది ఎకరాల పంటలు

ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయిన జనం

జిల్లాపై నివర్‌ తుఫాన్‌ తీవ్ర ప్రభావం చూపింది.ఎడతెరిపి లేకుండా భారీవర్షాలతో పాటు ఈదురుగాలులు వీయడంతో అన్నివర్గాల ప్రజలు వణికిపోయారు. పంటలు భారీగా దెబ్బతిన్నాయి. రోజంతా ప్రజలు  ఇళ్లకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. బుధవారం నుంచి గురువారం87.4మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. ఇరవై మండలాల్లో 100మి.మీపైగా కురవడంతోపాటు తెరపి లేకుండా వర్షం పడింది. అదే సమయంలో వేలాది ఎకరాల్లోని పంటలు మునిగాయి. కాగా అనేకచోట్ల గాలుల తీవ్రతతో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో చాలా ప్రాంతాల్లో రవాణాకు, విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లావ్యాప్తంగా ఈ పరిస్థితి ఉన్నప్పటికీ దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో మరింత అధికంగా ఉంది. నివర్‌ తుఫాన్‌ జిల్లాపై ఉంటున్న సమాచారం ఉన్నప్పటికీ ఊహించిన దాని కన్నా అధికంగానే కనిపించింది. నాగులుప్పలపాడు మండలం కొత్తకోట వద్ద వాగులో కారు కొట్టుకుపోవడంతో ఒకరు గల్లంతయ్యారు.

ఒంగోలు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): దాదాపు 450 కి.మీ. దూరంలో ఉన్న పుదిచ్చేరి సమీపంలో తుఫాన్‌ తీరం దాటినప్పటికీ జిలాల్లో మాత్రం ఆ ప్రభావం తీవ్రంగానే కనిపించింది. జిల్లావ్యాప్తంగా బుధవారం సాయంత్రానికి ప్రారంభమైన వర్షం గురువారం రాత్రి వరకు ఎడతెరపి లేకుండా పడుతూనే ఉంది. కందుకూరు, కొండపి, కనిగిరి, ఒంగోలు, ఎస్‌ఎన్‌పాడు, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో భారీవర్షాలు కురవగా, ఇతరచోట్ల ఒక మోస్తరు వర్షం కురిసింది. కందుకూరు, గుడ్లూరు, ఉలవపాడు, తిమ్మసముద్రం, ఎస్‌. కొండ, జరుగుమల్లి, టంగుటూరు, ఒంగోలు, కొత్తపట్నం, ఎన్జీపాడు, పామూరు, సీఎస్‌పురం తదితర మండలాల్లో వర్షం ముంచెత్తింది. జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీవర్షాలకు తోడు పశ్చిమ, దక్షిణ ప్రాంతంలోని నెల్లూరు, కర్నూలు జిల్లాలో వర్షాలతో ఏలేరు, మన్నేరు, ముసి, గుండ్లకమ్మతోపాటు పలు ఇతరవాగులు, వంకలు, భారీగా నీటి ప్రవాహం పెరిగింది. 

పంటలకు భారీ నష్టం

కందుకూరు, కనిగిరి, కొండపి నియోజకవర్గాల్లోని పలు చెరువులకు భారీనీరు చేరింది. గుండ్లకమ్మ ప్రాజెక్టులోకి 10,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, మూడు గేట్లు ఎత్తి 10,300దిగువకు వదులుతున్నారు.  కందుకూరు, శింగరాయకొండ, గుడ్లూరు, తెట్టు, పర్చూరు మండలాల్లో గాలులకు చెట్లు విరిగి పడి రవాణాకు అంతరాయం ఏర్పడింది. అలాగే అనేక గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  తుఫాన్‌ కారణంగా కురిసిన భారీవర్షాలు పంటలను దారుణంగా దెబ్బతీశాయి. లక్షఎకరాల్లోని పత్తి, మిర్చి, పొగాకు, మినుములు, వరి పంటలు నీటి పాలయ్యాయి. కొన్నిచోట్ల గాలులు తీవ్రతతో ఏపుగా ఉన్న వరి పంట నేలకొరగ్గా, మరి కొన్నిచోట్ల పంట పొలాల్లో భారీగా నీరు చేరింది. ఇప్పటికే ఎకరాకు రూ.25వేల నుంచి రూ.50వేల వరకు వెచ్చించినరైతులు జరగనున్న నష్టం తలుచుకొని ఆందోళన చెందుతున్నారు. కందుకూరు సబ్‌డివిజన్‌లోనే 25వేల ఎకరాల్లో ఈ పరిస్థితి ఉండగా, శింగరాయకొండ, కనిగిరి, దర్శి, చీరాల, ఒంగోలు సబ్‌ డివిజన్‌లోని అదే పరిస్థితి కనిపిస్తోంది. 

జనజీవనం అస్తవ్యస్తం

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఉద్యోగులు, వ్యాపారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. యంత్రాంగం గురువారం మరింత అప్రమత్తంగా వ్యవహరించారు. కలెక్టర్‌ పోలా భాస్కర్‌, ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ మొత్తం పర్యవేక్షిస్తుండగా, ఇతర కీలక అధికారులు క్షేత్రస్థాయిలో మకాం వేసి చర్యలు చేపట్టారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గురువారం ఉదయానికే 98 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 1,104 కుటుంబాలకు చెందిన 4,043 మంది ప్రజలను వాటిలోకి చేర్చారు. ఒంగోలులోని నెహ్రూనగర్‌ కాలనీవాసుల కోసం పద్మావతి ఫంక్షన్‌ హాలులో ఏర్పాటుచేసినపునరావాస కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం సాయంత్రం సందర్శించారు. అక్కడి ప్రజలతో మాట్లాడారు. జిల్లాలోని తుఫాన్‌ తీవ్రత, తక్షణ సహాయక చర్యల గురించి అధికారులతో మాట్లాడారు. కాగా శుక్రవారం కూడా జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సమచారాన్ని బట్టి తెలుస్తోంది.జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు 24 గంటల్లో 87.4 మి.మీ సగటున వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఉలవపాడులో 197మి.మీ వర్షపాతం నమోదు కాగా కందుకూరులో 160.6, కొత్తపట్నంలో 159.4, శింగరాయకొండలో 154.6, టంగుటూరులో 141.2, జరుగుమల్లిలో 137.0, లింగసముద్రంలో 129.8, ఎస్‌ఎన్‌పాడులో 129.6, ఒంగోలులో 128మి.మీ నమోదు కాగా ఎన్జీపాడు, మద్దిపాడు, పొన్నలూరు, కొండేపి, పామూరు, సీఎస్‌పురం. పొదిలి తదితర మండలాల్లో 100మి.మీ.కు పైగా వర్షం కురిసింది. 

తీరప్రాంత గ్రామాల్లో ఎస్పీ పర్యటన

ఒంగోలు(క్రైం): నివర్‌ తుఫాన్‌ ప్రభావ పరిస్థితులను అంచనా వేయడానికి ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ గురువారం తీరప్రాంత గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. కొత్తపట్నం తీరప్రాంత గ్రామాల్లో పర్యటించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. రామాయపట్నం ట్యాంక్‌ పరివాహక ప్రాంతాలపై నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఒంగోలు డీఎస్పీకి సూచించారు. నివర్‌ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిబ్బంది అంతా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఏమరుపాటు తగదని ఆయన హెచ్చరించారు.  రెవెన్యూ, ఇరిగేషన్‌, ఫిషరీస్‌, పంచాయతీరాజ్‌, ఫైర్‌, ఆర్‌అండ్‌బీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, మెరైన్‌ పోలీసులు తదితర శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఎస్పీ సూచించారు. మొత్తం 1500మంది పోలీసు సిబ్బంది నివర్‌ తుఫాన్‌ విధులు నిర్వహిస్తున్నారని, వీటిలో నాలుగు ప్రత్యేక మొబైల్‌ టీమ్‌లు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రజలకు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నా టోల్‌ఫ్రీ నెంబర్‌ 100కు డయల్‌ చేయాలని ఆయన కోరారు

వణుకుతున్న మత్స్యకార గ్రామాలు

ఒంగోలు నగరం: నివర్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌తో తీరం అల్లకల్లోలంగా మారింది. తీరప్రాంత గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఎగిసిపడుతున్న అలలు, బలంగా వీస్తున్న గాలులు జోరువానతో జనం వణికిపోయారు. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. పలుప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. తుఫాన్‌ ప్రభావం ఎప్పుడు ఏవిధంగా ఉంటుందోనంటూ మత్స్యకారులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. బుధవారం రాత్రి నుంచే తీరం వెంట గాలులతో కూడిన భారీవర్షం కురుస్తోంది. దీంతో తీర ప్రాంత గ్రామాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. తీరంలో 60 నుంచి 70కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. స్తంభాలు కూలిపోయి గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కొన్నిచోట్ల వైర్లు తెగిపోవడంతో అధికారులు సరఫరాను నిలిపివేశారు. ఉప్పుకొటార్లు మునిగిపోయి తీవ్రనష్టం వాటిల్లింది. ఆక్వా చెరువులు నిండిపోయి ప్రమాదకర స్థితికి చేరాయి. కొన్నిచోట్ల కట్టలు తెగి రైతులకు తీవ్రనష్టం ఏర్పడింది. భారీవర్షాల కారణంగా పలుమండలాల్లో తీర ప్రాంత గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. అధికారులు అన్నిగ్రామాల్లో అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

రాళ్లపాడుకు భారీగా వరద

లింగసముద్రం: బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు రాళ్లపాడు ప్రాజెక్టులోకి వరదనీరు చేరుతోంది. గురువారం సాయంత్రం ప్రాజెక్టులోకి 18వేల క్యూసెక్కులకుపైగా నీరు చేరుతుండటం,  నీటిమట్టం 18.7అడుగులకు నీరింది. ఈఈ శరత్‌కుమార్‌రెడ్డి ఆదేశాలతో డీఈ లక్ష్మీనారాయణ, ఏఈలు, సిబ్బంది ప్రాజెక్టులోని కొత్త స్పిల్‌వేలోని నాలుగు గేట్లను ఎత్తి 18వేల క్యూసెక్కుల వరదనీటిని మన్నేరుకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈఈ శరత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టులోకి వరదనీటి ప్రవాహం ఇంకా పెరిగితే మరికొన్ని గేట్లు ఎత్తి వరదనీటిని మన్నేరుకు విడుదల చేస్తామన్నారు. ప్రాజెక్టు వద్ద ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. రాత్రికి నీటిమట్టం 19అడుగులు దాటడంతో మరికొన్ని గేట్లు కూడా ఎత్తాల్సి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

పునవాస కేంద్రాల్లో 4,600మంది 

ఒంగొలు కలెక్టరేట్‌: జిల్లాలో నివర్‌ తుఫాన్‌తో భారీవర్షాలు పడుతుండటంతో జిల్లా అధికారయంత్రాంగం లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. సముద్ర తీరప్రాంతంలోని మండలాల్లో 98 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేయగా గురువారం సాయంత్రానికి 4,600మందిని ఆ కేంద్రాలకు చేర్చారు. కాగా పునరావాస కేంద్రాలకు వేళ్ళేందుకు లోతట్టు ప్రజానీకం నిరాకరిస్తున్నట్లు తెలిసింది. \









Updated Date - 2020-11-27T06:07:52+05:30 IST