నివర్రీ!

ABN , First Publish Date - 2020-11-24T05:17:37+05:30 IST

ఎన్నో కష్టనష్టాల మధ్య ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ సాగింది. తొలిరోజుల్లో వర్షాభావ పరిస్థితులు ఎదురుకాగా.. వరినాట్లు వేసేందుకు అన్నదాతలు నానా పాట్లు పడ్డారు. వెన్నుదశలో అకాల వర్షాలు కురిసి పంటకు తెగులు పట్టగా.. దిగులుతో తల్లడిల్లిపోయారు. తాజాగా పంట కోతల సమయంలో నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో వర్షసూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో భయాందోళన చెందుతున్నారు. కోత కోసిన పంటను భద్రపరిచే పనిలో నిమగ్నమయ్యారు.

నివర్రీ!
పాలకొండ : పొలాల్లో వరికుప్పలు వేసిన దృశ్యం

 అన్నదాతను వణికిస్తున్న నివర్‌ తుపాన్‌ భయం

 రానున్న రెండు రోజుల్లో వర్ష సూచన

 ఇప్పటికే వరి కోతలు ప్రారంభం

 పొలాల్లో కుప్పలుగా పోస్తున్న వైనం

 (శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి/పాలకొండ)

ఎన్నో కష్టనష్టాల మధ్య ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ సాగింది.  తొలిరోజుల్లో వర్షాభావ పరిస్థితులు ఎదురుకాగా.. వరినాట్లు వేసేందుకు అన్నదాతలు నానా పాట్లు పడ్డారు. వెన్నుదశలో అకాల వర్షాలు కురిసి పంటకు తెగులు పట్టగా.. దిగులుతో తల్లడిల్లిపోయారు. తాజాగా పంట కోతల సమయంలో నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో వర్షసూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో భయాందోళన చెందుతున్నారు. కోత కోసిన పంటను భద్రపరిచే  పనిలో నిమగ్నమయ్యారు. 

----------------

జిల్లాకు నివర్‌ తుఫాన్‌ ముప్పు పొంచి ఉంది. రానున్న రెండు రోజుల్లో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. సోమవారం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో రైతుల్లో అలజడి రేగుతోంది. అసలే కరోనా కష్టాలతో సతమతమవుతున్న తమకు పంట చేతికందే దశలో తుఫాన్‌ ప్రభావం చూపితే నష్టపోక తప్పదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో రైతులు ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 2.08 లక్షల హెక్టార్లలో వరి సాగు చేశారు. సీజన్‌ ఆరంభంలో వర్షాలు లేక మోటార్లతో నీటి తడులు అందించారు. నారుమడులు కాపాడుకున్నారు. ప్రస్తుతం పంట చేతికి అంది.. వరి కోతలు జరుగుతున్నాయి. పాలకొండ, వంగర, జి.సిగడం, రాజాం, సంతకవిటి, రేగిడి, వీరఘట్టం, బూర్జ, కొత్తూరు మండలాల్లో దాదాపు వరి కోతలు పూర్తయ్యాయి. టెక్కలి డివిజన్‌ పరిధిలో మూడు రోజుల కిందట వరికోతలు ప్రారంభమయ్యాయి. ఈ డివిజన్‌లో 80 వేల హెక్టార్లలో సాగు చేయగా.. సుమారు పది వేల హెక్టార్లలో కోతలు పూర్తయ్యాయి. మందస, సోంపేట మండలాల్లో పంట వెన్ను దశలోనే ఉంది. చాలాచోట్ల రైతులు కోతలు కోసి వరి కంకులను మడుల్లో ఆరబోశారు. రెండు రోజుల్లో వాటిని కట్టలుగా కట్టి కుప్పలు వేయనున్నారు. ఈ సమయంలో తుఫాన్‌ ప్రభావంతో వర్షాలు కురిస్తే.. చేను నేలవాలే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.  ధాన్యం తడిసిపోయి రంగుమారి నష్టం వాటిల్లనుందని ఆవేదన చెందుతున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకు వరి పంటను భద్రపరిచే పనిలో నిమగ్నమయ్యారు. ఎకరా పొలంలో పంట కోతకు గతంలో రెండు వేల వరకూ ఖర్చవగా.. ప్రస్తుతం రూ.4వేల వరకూ డిమాండ్‌ చేస్తున్నారు.  ఓదె చుట్టడం, పొలం నుంచి కల్లానికి ధాన్యం తరలిచేందుకు రైతుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ తుఫాన్‌ నేపథ్యంలో కూలీలకు అధిక మొత్తాలను చెల్లించేందుకు రైతులు సిద్ధమవు తున్నారు. ఎలాగైనా పంటను రక్షించుకునేందుకు పాట్లు పడుతున్నారు. 


Updated Date - 2020-11-24T05:17:37+05:30 IST