Advertisement

గురూపదేశమహిమ

Jun 30 2020 @ 02:04AM

విశ్వనందనుడు అనే మహర్షికి అయిదుగురు శిష్యులు. పంచభూతాలపై ఆధిపత్యం సంపాదించాలన్నది వారి కోరిక. గురువు వారి మనసు తెలుసుకుని.. ఆయా భూతశక్తులను వశం చేసుకోవడానికి కావలసిన యోగవిధానాలను వారికి ఉపదేశించాడు. అయితే, అంతకు ముందు.. ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, బ్రహ్మచర్యం, భూతదయ, అహింస, సత్యవ్రతం, ఋజుమార్గ ప్రవర్తనం, స్వాధ్యాయం, ఎవరినుంచి ఏమీ ఆశించకపోవడం, కలిగినంతలో దానం చేయడం అనే పదిగుణాలను అలవరచుకోవాలని సూచించాడు. వారు గురువు చెప్పినవిధంగా అభ్యాసం చేశారు. వారికి త్వరలోనే ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి వంతున పంచభూత శక్తులు వశమయ్యాయి. ఒకనికి భూశక్తి వశమయ్యింది. అతను ప్రార్థిస్తే చాలు భూమి ప్రసన్నమై అక్కడ నాటిన ప్రతి విత్తనం మంచి మొక్కై, మానై సత్పలితాలను ఇస్తుంది. మరొక శిష్యుడు ఉన్న చోటసులువుగా జలాలు ప్రవహించి నీటికి కరువు అనేది లేకుండా అనుగ్రహించేవి. ఇంకొకనికి అగ్ని వశమయ్యింది. వర్షాకాలంలో బాగా తడిసిన కట్టెలతో కూడా నిప్పు రాజేసి లోకానికి వెచ్చదనాన్ని ఇవ్వగలిగిన సామర్థ్యం అతనిది. వనాన్ని దహించే కార్చిచ్చును కూడా చూపుతోనే నియంత్రించగల అధికారం అతనిది. అలాగే ప్రళయఝంఝను సృష్టి చేయాలన్నా మహావాయు ప్రభంజనాన్ని నియంత్రించాలన్నా తగిన నేర్పరి ఒకడు. చివరివానికి సర్వవ్యాపకత్వ గుణం వచ్చింది. ఎన్ని యోజనాల దూరంలో ఉన్నవారికైనా తాను ఎంత నెమ్మదిగా చెప్పినా వినబడేలా చేసే శక్తి అలవడింది. ఆ ఐదుగురూ గురువుగారి అనుమతితో లోకోపకారం చేయడానికి తమ శక్తులను ఉపయోగిస్తూ తమ తమ నగరాలకు వెళ్లి తమ జీవితాలను ప్రారంభించారు. విశ్వనందుని ఆశ్రమంలో దురంతచేష్టుడు అనే ఒక విద్యార్థి ఉన్నాడు. ఐదుగురు శిష్యులకూ గురువు పంచ భూత సాధన మంత్రాలను ఉపదేశించేటప్పటికి వాడు చిన్నవాడు. కానీ, గురువుకు సహాయకుడిగా ఉంటూ ఆ మంత్రాలను విని, గుర్తుపెట్టుకున్నాడు. పెద్దయ్యే కొద్దీ దురంతచేష్టునికి అహంకారం, దురాశ పెరిగాయి. అతీంద్రియశక్తులపై పట్టు సాధించాలనుకున్నాడు. చిన్నతనంలో తాను విన్న మంత్రాలను గుర్తుచేసుకున్నాడు. గురూపదేశం లేకుండానే స్వయంగా మంత్రసాధన చేసాడు. అనంతరం, గురువుకు చెప్పకుండానే ఆశ్రమాన్ని విడిచి, రాజాశ్రయం కోసం సమీపంలో ఉన్న కుండిననగరానికి వెళ్లాడు. రాజుకి అతని ప్రవర్తన అంతగా నచ్చలేదు. అతనికి కొలువు ఇవ్వటానికి నిరాకరించాడు. దురంతునికి కోపం వచ్చింది. సభలో ప్రభంజనాన్ని సృష్టించాడు. రాజధాని వీధులలో వరదలను పొంగించాడు. ఉద్యానవనాల్ని దహించే అగ్నిని పుట్టించాడు. భూకంపాలను సృష్టించాడు. విశ్వనందనుని పూర్వశిష్యులైన అయిదుగురికీ ఈ విషయం తెలిసింది. గురువును కలిసి, జరిగింది తెలుసుకుని పరుగుపరుగున కుండిన నగరానికి చేరుకుని.. దురంతుని ప్రయోగాలన్నింటినీ ఉపసంహరించారు. అయితే దురంతుడు సృష్టించిన భూకంపంప్రభావానికి పగుళ్ళుతీసిన భూమి అంతటా కలిసిందిగానీ.. అతడు నిలుచున్న ప్రదేశంలో మాత్రం తిరిగి కలవలేదు. అందరూ చూస్తుండగానే అతను ఆ పగుళ్ల ద్వారా భూగర్భంలో కలిసిపోతున్నాడు. వెంటనే అయిదుగురూ తమ శక్తులతో అతణ్ని రక్షించారు. ఇంతలో విశ్వనందనుడూ అక్కడికి వచ్చాడు. దురంతునికి అహంకారం తొలగిపోయింది. గురూపదేశం ద్వారా లభించిన విద్య విలువ ఎంత గొప్పదో అతడికి తెలిసింది. గురువు ఉపదేశమే గొప్ప అనుగ్రహమని.. అది లేని విద్య కొరగానిదని అర్థమైంది. నాటి నుంచి తన గురువునే కాక తన పూర్వ విద్యార్థులను, ఇతర పండితులను గౌరవించడం ప్రారంభించాడు.

- ఆచార్య రాణి సదాశివ మూర్తి

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.