విశ్వానికి మార్గదర్శి

Published: Fri, 10 Dec 2021 00:00:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
విశ్వానికి మార్గదర్శి

భారతానికి పంచమవేదంగా ప్రసిద్ధి. పద్ధెనిమిది అధ్యాయాలు ఉన్న భగవద్గీతలో... ప్రతి అధ్యాయం ముగిసిన సందర్భంలో ‘ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే’ అని ఉంటుంది. అంటే ‘ఉపనిషత్తులు ప్రతిపాదించినది, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం’ అని భావం. ఆ విధంగా భగవద్గీతను ఉపనిషత్తుల సారం అని చెప్పవచ్చు. భగవద్గీతా తత్త్వం సర్వ జన శ్రేయోదాయకమని పెద్దలు చెబుతారు. మహాభారతంలోని భీష్మపర్వంలో... 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకూ... 701 శ్లోకాల్లో ‘భగవద్గీత’ను వేదవ్యాసుడు నిబద్ధించాడు.


జననమరణ చక్రంలో బంధితుడైన మానవుడికి... దాని నుంచి తప్పించుకొనే ఏకైకమార్గమైన ‘బ్రహ్మవిద్య’ అనే అమృతాన్ని అందించాలని శ్రీకృష్ణ పరమాత్మ సంకల్పించాడు. ఆ అమృత భాండాన్ని మానవాళికి ప్రతినిధి అయిన అర్జునుడి ద్వారా ‘భగవద్గీత’ రూపంలో అందించాడు. కురుక్షేత్ర మహా సంగ్రామంలో ఆ గీతామృతాన్ని అర్జునుడికి ఆయన అందజేసిన రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. కాబట్టి, ఈ రోజును మంగళదాయకమైన పర్వదినంగా పరిగణిస్తారు. అంతేకాదు, శ్రీరామ జయంతి, శ్రీకృష్ణ జయంతి, శ్రీశంకర జయంతి, శ్రీదత్తాత్రేయ జయంతి ఆదిగా... ఎందరో మహనీయుల జయంతులు జరుపుకొంటున్నట్టు... ‘గీతా జయంతి’ని పర్వదినంగా జరుపుకోవడం అనూచానంగా వస్తోంది. భగవద్గీత గొప్పతనం ఏమిటంటే... ఇందులో కర్మ, భక్తి, జ్ఞానం, ఉపాసన, జిజ్ఞాస లాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ సార్వజనీనాలే, శ్రేయోదాయకాలే. దేశ, ప్రాంతాలతో, మత విశ్వాసాలతో, కాలంతో సంబంధం లేకుండా... మానవులందరికీ వర్తించే ఏకైక గ్రంథం భగవద్గీత.


కర్మయోగ శాస్త్రం...

భగవద్గీతలో పద్ధెనిమిది అధ్యాయాలు ఉన్నాయి. అవి ‘కర్మ, భక్తి, జ్ఞాన యోగాలు’ అనే ‘మూడు షట్కాలు’గా (ఆరేసి చొప్పున) విభజితమయ్యాయి. అయితే, ‘కర్మ షట్కం’లో భక్తి, జ్ఞానాలు, ‘భక్తి షట్కం’లో కర్మ, జ్ఞానాలు, ‘జ్ఞాన షట్కం’లో భక్తి, కర్మలు లేకపోలేదు. పరిశీలిస్తే అంతటా కర్మయోగమే ప్రముఖంగా ప్రస్తావితమయింది. కర్మ యోగానికి శ్రీకృష్ణ పరమాత్మ అత్యున్నత స్థానం కల్పించినట్టు ‘శ్రీశంకర భాష్యం’ కూడా చెబుతోంది. అందుకే లోకమాన్య బాలగంగాధర తిలక్‌ ‘శ్రీమద్భగవద్గీత కర్మయోగ శాస్త్రం’ అని పేర్కొన్నారు.


అర్జునుడు ‘‘కృష్ణా! నీవు ఒకసారి కర్మ సన్యాసం, మరోసారి కర్మ ఉత్తమమైనవని చెబుతున్నావు. వాటిలో ఏది ఉత్తమమైనదో చెప్పు’’ అని అడిగినప్పుడు... దానికి శ్రీకృష్ణుడు జవాబిస్తూ-


‘‘సన్న్యాసః కర్మయోగశ్చ నిశ్ర్శేయసకరా వుభౌ

తయోస్తు కర్మ సన్న్యాసాత్‌ కర్మయోగో విశిష్యతే’’

 అన్నాడు. ‘‘కర్మ సన్న్యాసం, కర్మయోగం... రెండూ మోక్షాన్ని ఇచ్చేవే. కానీ ఈ రెండిటిలో కర్మయోగమే విశిష్టమైనది’’ అని స్పష్టం చేశాడు.


‘కర్మ’ అంటే పని. ఉపయోగం లేనిదే మూర్ఖుడు కూడా ఏ పనీ చెయ్యడు కదా! ఎవరైనా ఏ పనీ లేకుండా కూర్చున్నా మనసు పని చేస్తూనే ఉంటుంది. మనం ప్రత్యేకంగా పరిశీలించకపోయినా... శరీరంలో కొన్ని పనులు జరుగుతూనే ఉంటాయి ఉచ్చ్వాస నిశ్వాసాలు, గుండె కొట్టుకోవడం, రెప్పలు తెరుస్తూ, మూస్తూ ఉండడం, రక్తప్రసరణ జీర్ణ ప్రక్రియ వంటివి. వీటన్నిటికీ ఏదో ఒక ప్రతిఫలం ఉంటుంది. అంటే కర్మకు ఫలం తథ్యం. అయితే ఈ కర్మఫలం అనుభవించేది ఎవరు? కర్తే అనుభవిస్తాడని సాధారణంగా అనుకుంటారు. కానీ ఒకరు చేసిన పనికి వేరొకరు మేలు పొందడమో, కీడు పొందడమో జరుగుతూనే ఉంటుంది. ఇదొక ధర్మ సూత్రం. కర్మ వల్ల తనకు మేలు జరగాలి కానీ కీడు కలగకూడదని కర్త కోరుకుంటాడు. ఇది ప్రతి ఒక్కరిలో ఉండే సహజగుణం. కాబట్టి మనం ఇతరులకు మేలు కలిగేలా ప్రవర్తించాలి కానీ, కీడు కలిగేలా కాదు కదా! ఈ ధర్మ సూత్రం దేశ, కాలాలకు అతీతమైనది. అందరికీ సంబంధించింది. ఇతరులకు మేలు చేయడం ధర్మం అనీ, కీడు తలపెట్టడం అధర్మం అనీ ఒకరు చెప్పవలసిన పని లేదు. 


‘నేను ధర్మకార్యాలనే చేస్తూ పోతే నాకు మేలు ఎలా కలుగుతుంది?’ అనే సందేహం కలగడం సహజం. మన జీవితంలో చేసే కర్మలకు అనుకున్న ప్రతిఫలం వస్తుందన్న నమ్మకం లేదు. కొన్ని సందర్భాల్లో వ్యతిరేకంగా ఉండవచ్చు. కర్మ తాలూకు ప్రతిఫలాన్ని నిర్దేశించే శక్తి వేరొకటి ఉందని దీని అర్థం. ఆ శక్తిని ఏ పేరుతోనైనా పిలవవచ్చు. అది స్వయం నియామకమైన శక్తి. దాన్ని దర్శించలేం. మన స్వాధీనంలో లేని ఆ శక్తిని గురించి తలపోయడం కన్నా... ప్రతిఫలాన్ని ఆ శక్తికే వదిలేయడం ఉత్తమం. ఫలవాంఛ వీడడం వల్ల ఫలితం ఎలా ఉన్నా మనకు దుఃఖం కలగదు. ఫలితం మీద ఆశ ఉంటే... అది అందకపోయినప్పుడు నిస్పృహ, నిరాశ తలెత్తుతాయి. మనకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ప్రతిఫలాపేక్ష లేకపోవడం అనేది మనం మనసుకు నేర్పాల్సిన విద్య. అది ఎవరైనా, ఏ దేశంలోనైనా, ఏ కాలంలోనైనా అభ్యసించి, ఆచరణలో పెట్టగలిగే విషయం. కాబట్టి దాన్ని ‘కర్మయోగం’ అని పెద్దలు విశ్లేషించారు. నిష్కామకర్మ చేయాలనేది భగవద్గీత చెప్పే ప్రాథమిక తత్త్వం. ఈ తత్త్వం ఈ దేశంలో పుట్టింది కాబట్టి ఇది హిందువుల తత్త్వమనీ, భారతీయ భావన అనీ ఒక అపప్రధ ఉంది. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రవచించిన కర్మయోగం ప్రపంచ ప్రజలందరూ ఆచరించాల్సిన తత్త్వం. అందుకే అది పరమపవిత్రమైనది. భగవద్గీత విశ్వానికి మార్గదర్శి.

                                                                                               ఎ. సీతారామారావు

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.