మునక

ABN , First Publish Date - 2020-11-29T06:50:41+05:30 IST

నివర్‌ తుఫాను నిండా ముంచింది. దీని ప్రభావంతో కురిసిన ఎడతెరిపిలేని వర్షానికి చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయి.

మునక

నివర్‌ తుఫాను దెబ్బకు 

1733 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు

రూ.7 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని అధికారుల అంచనా

వాస్తవానికి చాలా ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయం

కోత దశలోని వరి నేలమట్టం

నిండా మునిగిన అన్నదాత

అనంతపురం వ్యవసాయం/కణేకల్లు/బొమ్మనహాళ్‌, నవంబరు 28: నివర్‌ తుఫాను నిండా ముంచింది. దీని ప్రభావంతో కురిసిన ఎడతెరిపిలేని వర్షానికి చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయి, నిండా మునిగారు. జిల్లావ్యాప్తంగా కోత దశలోని వివిధ రకాల పంటలపై నివర్‌ తుఫాను దెబ్బ తీవ్రంగా పడింది. భారీగా పంటనష్టం వాటిల్లింది. మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో జడివాన కురిసింది. పలు మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. మిగిలిన మండలాల్లో చిరుజల్లులు కురిశాయి. జిల్లాలో పలు ప్రాంతాల్లో  కోత దశలోని వరి పంట నేలమట్టం అయింది. మొక్కజొన్న, కంది, కొర్ర, వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చే సమయంలో పంటంతా వర్షార్పణం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం తెల్లవారుజామున జిల్లాలోని పలు ప్రాంతాల్లో తుఫాను ప్రభావం కొనసాగింది. శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా జిల్లా అంతటా జడి వాన పడింది. 41 మండలాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. మిగిలిన మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి.


భారీగా పంట నష్టం 

జిల్లావ్యాప్తంగా తుఫాను ప్రభావానికి 1733 హెక్టార్లలో రూ.7 కోట్లకుపైగా పంటనష్టం వాటిల్లిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 1607 హెక్టార్లల్లో వరి పంట దెబ్బతింది. వేరుశనగ 15.2, మొక్కజొన్న 85.41, మినుములు 11, కొర్ర 4, కంది 10 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. క్షేత్రస్థాయిలో పంటనష్టంపై వ్యవసాయ అధికారులు సర్వే కొనసాగిస్తున్నారు. పంటనష్టం మరింత పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


నేలకొరిగిన వరి

తుఫాను దెబ్బకు కణేకల్లు మండలంలో హెచ్చెల్సీ ఆయకట్టు కింద వరిపం ట నేలకొరిగింది. కణేకల్లుతో పాటు మారెంపల్లి, ఉడేగోళం, బ్రహ్మసము ద్రం, బెణకల్లు, గంగలాపురం, మాల్యం తదితర ప్రాంతాల్లో దాదాపు 500 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. రెండు, మూడు రోజుల్లో పంట చేతికొ స్తుందన్న దశలో పూర్తిగా నేలపాలైంది. వర్షం కారణంగా పంటంతా నేల కొరగడంతో గింజలన్నీ కిందపడి, పూర్తిగా నష్టపోయామని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.


56 గొర్రెల మృతి

వర్షానికి బొమ్మనహాళ్‌ మండలంలో 56 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి మండలంలోని ఉద్దేహాళ్‌, కొళగా నహళ్లి, లింగదహాళ్‌, ఉప్పరహాళ్‌, తదితర గ్రామాల పరిధిలో 664 ఎకరా ల్లో వరి పంట నేలమట్టమైంది. దాదాపు 538 మంది రైతులు నష్టపో యారు. నేమకల్లు గ్రామంలో నాగరాజు, తిప్పేస్వామి, గోనేహాళ్‌ శివప్ప, బెళ్లి బోణెప్ప, ఉమేష్‌, మరికొంతమందికి చెందిన 56 గొర్రెలు మృతి చెంది, రూ.6 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.


కొనేవారు కూడా ఉండరేమో?: శ్రీకాంత్‌, రైతు, కణేకల్లు

వరి పంటను కోత కోసేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో నివర్‌ తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలుచోట్ల ధాన్యమంతా తడిసిపోయి, మొలకలెత్తే స్థితికి చేరు కుంది. మార్కెట్‌లో వరిధాన్యం క్వింటా రూ.1600 మాత్రమే పలుకుతున్న తరుణంలో తడిసిన దానిని కొనేవారు కూడా ఉండరేమోనని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.


మొత్తం.. నష్టం..

కదిరి: నివర్‌ తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు చేతికొచ్చిన పంట నోటికందకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈఏడాది వర్షాలు బాగా కురవటంతో బావులు, చెరువులు, బోరు బావుల కింద వేలాది ఎకరాల్లో ఖరీ్‌ఫలో వరి సాగు చేశారు. 15 రోజుల్లో పంట చేతికి వస్తుందనగా తుఫాను ప్రభావంతో కురిసిన వర్షం రైతుల ఆశలను అడియాసలు చేసింది. రెండు రోజుల్లోనే రైతులకు కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. కదిరి డివిజన్‌లోని నంబులపూలకుంట, గాండ్లపెంట, తనకల్లు, తలుపుల మండలాల్లో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. మూడు రోజులుగా పంట నీటిలోనే ఉంది. రైతులు పంటలు దక్కించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కదిరి డివిజన్‌లో వరి 1166.6 హెక్టార్లు, వేరుశనగ 14 హెక్టార్లు, కంది 10 హెక్టార్లు, మొక్కజొన్న 85 హెక్టార్లు, కొర్ర 4 హెక్టార్లు మొత్తంగా 1280 హెక్టార్లు నష్టపోయినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. 


అధిక వర్షంతోనే ముప్పు

కదిరి డివిజన్‌లోని అన్ని మండలాల్లోనూ దాదాపు 10 సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసింది. రెండు రోజులు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి పంటలు నేల పాలయ్యాయి. ఎన్పీకుంటలో వరుసగా రెండురోజులు 26.76, 24.48 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. దీంతో వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లాయి. ఎక్కడ పంటలు అక్కడ నీట మునిగిపోయాయి. తనకల్లులో టమోటా, మొక్కజొన్న తీవ్రంగా దెబ్బతిన్నాయి. మదనపల్లికి సమీపంలో ఉండటంతో తనకల్లు, ఎన్పీకుంట మండలాల్లో టమోటా ఎక్కువగా సాగు చేస్తున్నారు. టమోటా చెట్లు కూడా నేలకొరిగిపోయాయి. అధిక వర్షపాతంతోనే ముప్పు ఏర్పడినట్లు రైతులు చెబుతున్నారు.


వరి, వేరుశనగలకు పెద్ద నష్టం 

నివర్‌ తుఫాను ప్రభావంతో వరిపంటకు భారీ నష్టం జరిగింది. నివర్‌ తుఫాన్‌ వల్ల నంబులపూలకుంటలో 379 హెక్టార్లు, నల్లచెరువులో 172 హెక్టార్లు, కదిరిలో 105 హెక్టార్లు, గాండ్లపెంటలో 98 హెక్టార్లు, తనకల్లులో 112 హెక్టార్లు, తలుపులలో 85 హెక్టార్ల్లు వరి పంట దెబ్బతింది. ఈ పంట అంతా కోతదశలో ఉంది. మరో 15 రోజులు గడిస్తే రైతన్న కష్టం ఇంటికి చేరేది. ఈ దశలో తుఫాను రావటంతో పంట నీట మునిగిపోయింది. రైతన్నకు రూ.16 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అంచనా. తనకల్లులో మొక్కజొన్న, తలుపులలో కంది, వేరుశనగ పంటలు పెద్దఎత్తున వర్షానికి దెబ్బతిన్నాయి. అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నా.. పరిహారం వస్తుందో.. రాదోనన్న ఆందోళనలో రైతులున్నారు.


చేతికి వచ్చిన పంట నోటికి అందకుండా పోయింది

అప్పులను పెట్టుబడిగా పెట్టి, కుటుంబమంతా శ్రమించి రెం డు ఎకరాల్లో రూ.1.5 లక్షలు ఖర్చు చేసి వరి సాగు చేశాం. వారం రోజుల్లో ధాన్యపు గింజ లు ఇంటికి వస్తాయన్న ఆశతో ఉండగా తుఫాను దెబ్బకు మొత్తం పంట మునిగిపోయిం ది. కుటుంబానికి ఈ ఏడాది సరిపడే తిండిగింజలతోపాటు ఆదాయాన్నిచ్చే పంటను కోల్పోవటంతో అప్పులపై అప్పులు పెరిగాయి.

- సురేంద్ర, రైతు, బండమీదపల్లి, గాండ్లపెంట మండలం



తాడిమర్రి/ముదిగుబ్బ, నవంబరు 28: నివర్‌ తుఫాను ప్రభావంతో కురిసిన ఎడతెరిపిలేని వర్షానికి జిల్లాలోని పలు రిజర్వాయర్లకు వరద పోటెత్తింది. తాడిపత్రి మండల సరిహద్దులోని చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (సీబీఆర్‌)కు యోగివేమన ప్రాజెక్టు నుంచి 700 క్యూసెక్కులతో కలిపి మొత్తంగా 5,500 క్యూసెక్కుల వరద వస్తోంది. డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం దానికి మించి 10.18 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం గేట్ల నుంచి నీరు ప్రవహించే అవకాశముండటంతో వచ్చిన వరదను వచ్చినట్లే కిందికి వదులుతున్నారు. పులివెందుల డివిజన్‌కు చెందిన ఈఈ రాజశేఖర్‌ శనివారం మధ్యాహ్నం మూడు గేట్లను ఎత్తి, 5,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. వరద నీరు అధికశాతం నిల్వ ఉంచితే తాడిమర్రి మండలంలోని గుడ్డంపల్లి, పెద్దకోట్ల గ్రామాలు ముంపు బారిన పడతాయనే ఉద్దేశంతో అధికారులు దిగువకు వదిలారు.


వైవీఆర్‌ గేట్ల ఎత్తివేత

నివర్‌ తుఫాన్‌ కారణంగా ముదిగుబ్బ మండలంలోని యోగివేమన రిజర్వాయర్‌ (వైవీఆర్‌)కి భారీగా వరదనీరు వస్తుండటంతో గేట్లు ఎత్తి, దిగువకు విడుదల చేశారు. డ్యాం సామర్థ్యం ఒక టీఎంసీకి మించి, నీరు డ్యాంలో చేరటంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి శనివారం రెండు గేట్లు ఎత్తి, 600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అనంతరం తుఫాను కారణంగా వరి పంట దెబ్బతిన్న కొడవండ్లపల్లి, గంగిరెడ్డిపల్లి ప్రాంతాలను  పరిశీలించి, నష్టాన్ని అంచనావేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.



Updated Date - 2020-11-29T06:50:41+05:30 IST