ముంచేసిన నివర్‌!

ABN , First Publish Date - 2020-11-28T04:19:47+05:30 IST

అన్నదాతలను నివర్‌ తుఫాన నిండా ముంచేసింది. తుఫాన ప్రభావంతో బుధవారం అర్ధరాత్రి నుంచి జిల్లాలో చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి.

ముంచేసిన నివర్‌!
కెల్లివానిపేట వద్ద కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని తార్పాన్లు కప్పి సంరక్షించిన రైతులు





తుఫాన ప్రభావంతో 1400 ఎకరాల్లో పంట నష్టం

అధికారుల ప్రాథమిక అంచనా 

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, నవంబరు 27: అన్నదాతలను నివర్‌ తుఫాన నిండా ముంచేసింది. తుఫాన ప్రభావంతో బుధవారం అర్ధరాత్రి నుంచి జిల్లాలో చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. గురువారం ఉదయం కూడా వివిధ ప్రాంతాల్లో మోస్తరుగా వర్షం కురిసింది. మధ్యాహ్నం కాస్త తెరిపిచ్చి.. సాయంత్రం నుంచి మళ్లీ చిరుజల్లులు పడ్డాయి. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాల్లో వరి పంట నీట మునిగింది. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం, గార, నరసన్నపేట, కంచిలి, కవిటి ప్రాంతాల్లో కోతలు కొంతమేర పూర్తయ్యాయి. వరికుప్పలు పొలాల్లోనే ఉండిపోయాయి.  ఈ కుప్పలన్నీ తడిసిపోయి.. ధాన్యం రంగుమారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరికుప్పలను భద్రపరిచేందుకు నానా పాట్లు పడుతున్నారు. పంట కోత దశకు వచ్చిన సమయంలో కురుస్తున్న వర్షాలతో తమకు నష్టం తప్పదని వాపోతున్నారు. జిల్లాలో ఇప్పటివరకూ శ్రీకాకుళం, గార, కంచిలి, కవిటి మండలాల్లో 1,400 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు ఇలాగే కురిస్తే.. నష్టం పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. వర్షాల కారణంగా పంట నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.    



Updated Date - 2020-11-28T04:19:47+05:30 IST