నిజాం ప్రిన్సెస్‌ కొవిడ్‌ సేవ

ABN , First Publish Date - 2021-06-16T05:30:42+05:30 IST

జెహ్రా మీర్జా... వయసు 20 సంవత్సరాలు.. హైదరాబాద్‌లోని కొవిడ్‌ బాధితులను ఆదుకుంటోంది. అయితే ఏంటి అంటారా? ఆమె ఎవరో కాదు నిజాం వంశస్థురాలు. చివరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌

నిజాం ప్రిన్సెస్‌ కొవిడ్‌ సేవ

జెహ్రా మీర్జా...  వయసు 20 సంవత్సరాలు..

హైదరాబాద్‌లోని కొవిడ్‌ బాధితులను ఆదుకుంటోంది.

అయితే ఏంటి అంటారా? ఆమె ఎవరో కాదు నిజాం 

వంశస్థురాలు. చివరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 

మునిమనవరాలు. ఆమె స్వతహాగా మంచి చిత్రకారిణి. 

తను వేసిన పెయింటింగ్స్‌ను విక్రయించి ఆ డబ్బుతో కొవిడ్‌ బాధితులను

ఆదుకుంటున్న ఈ యువరాణి మనోగతం.. ప్రత్యేకంగా ‘నవ్య’కోసం.


‘‘కొవిడ్‌ బారిన పడి దేశంలో ఎన్నో లక్షల కుటుంబాలు చితికిపోయాయి. హైదరాబాద్‌ కరోనాతో విలవిలలాడింది.  ప్రత్యక్షంగా, టీవీల్లో కరోనా బాధితులను చూశాక.. వీరికోసం ఏదో ఒకటి చేయాలనుకున్నా. అమ్మానాన్న డబ్బులు తీసుకుని ఇవ్వడం కంటే నా సొంత డబ్బుతో సాయం చేద్దామనుకున్నా. ఆ క్షణంగా నేను చిన్నప్పటి నుంచి గీసుకున్న పెయింటింగ్స్‌ గుర్తొచ్చాయి. మనదేశంతో పాటు అమెరికా, కెనడా దేశాల్లో ఉండే మిత్రులకు ఫోన్‌ చేశాను. వారిద్వారా ఆయా దేశాల్లో పెయింటింగ్స్‌ను వేలం వేయించా. 15లక్షల రూపాయలొచ్చాయి. ఆ డబ్బులు కొంత స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చా. ఆసుపత్రులకు అందచేశా. మా కారు డ్రైవర్లతో కొవిడ్‌ రోగులకు డబ్బులు పంపించా. ఇంకా ఏదో చేయాలనిపించింది. మా నిజాం వంశస్థులు పూర్వం నుంచే దానధర్మాలు చేశారు. అందుకే ప్రిన్స్‌ మోజం జాహ్‌ పేరుతో ఓ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేశా. దీనికి ఫౌండర్‌, చైర్‌పర్సన్‌ను నేనే. కొవిడ్‌ తర్వాత కూడా మా చారిటబుల్‌ ట్రస్ట్‌ సేవాకార్యక్రమాలు కొనసాగుతాయి. వాస్తవానికి మా నిజాం వంశస్థులు సాయాన్ని ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ప్రేరణగా ఉంటుందని ముందుకొచ్చా.


అలా పెయింటింగ్స్‌ మీద ప్రేమ..

ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీకి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడి చిన్న కొడుకు పేరు మోజం జాహ్‌ (ప్రస్తుతం హైదరాబాద్‌లోని మోజంజాహి మార్కెట్‌కు ఈయన పేరే ఉంది). ఆయన పెద్ద కూతురి పేరు ప్రిన్సెస్‌ ఫౌజియా ఫాతిమా. ఆమె కుమారుడి పేరు హిమాయత్‌ మిర్జా. హిమాయత్‌ కూతురే జెహ్రా మిర్జా. అంటే నేను.  ప్రస్తుతం మా కుటుంబం బంజారాహిల్స్‌లో ఉంటోంది. నాకు ఎనిమిదేళ్లున్నప్పుడు మా పూర్వీకుల కట్టడాలైన.. చౌమొహల్లా ప్యాలెస్‌, ఫలక్‌నుమా ప్యాలెస్‌, కింగ్‌కోఠిలోని నజీర్‌బాగ్‌లను చూశా. అవి ఎంతో ఆకర్షించాయి. అక్కడి చిత్రాలు నన్నెంతో ఆకట్టుకున్నాయి. మా ముత్తాత మోజం జాహ్‌ పర్షియన్‌ భాషలో 40 వేలకు పైగా కవితలు రాశారని.. ఆయనకు పెయింటింగ్స్‌ అంటే ఇష్టమని తెలుసుకున్నా. మా నిజాం నవాబుల ప్యాలె్‌సలలో చూసిన పెయింటింగ్సే నన్ను కుంచె పట్టేట్లు చేశాయి. అప్పటినుంచి పెయింటింగ్స్‌ వేయడం ఆపలేదు. మహిళల సమస్యలపై ఎక్కువ బొమ్మలు గీశా. 


క్వీన్‌ ఎలిజబెత్‌కూ బహూకరించా!

హైదరాబాద్‌, పుణే, అమెరికా, కెనడా దేశాల్లో చదువుకున్నా. ప్రస్తుతం న్యాయశాస్త్రం చదువుతున్నా. దీంతో పాటు ప్యాషన్‌ డిజైనింగ్‌, బిజినెస్‌ డెవల్‌పమెంట్‌, పెయింటింగ్‌ కోర్సులు కూడా చేస్తున్నా. మహిళలు స్ఫూర్తి పొందే పెయింటింగ్స్‌ వేస్తుంటా. మహిళా ప్రముఖులకు ప్రత్యేకంగా నా పెయింటింగ్స్‌ బహుమతిగా ఇస్తుంటా. ఇలా ఇవ్వటం నాకిష్టం. క్వీన్‌ ఎలిజబెత్‌ భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ మరణించారు. సంతాపం ప్రకటిస్తూ ఆమె భర్తతో కలిసి ఉన్న పెయింటింగ్‌ను క్వీన్‌ ఎలిజబెత్‌కి ఇచ్చా. హిల్లరీ క్లింటన్‌, ప్రియాంక గాంధీ, మనదేశం మూలాలుండే అమెరికన్‌ పొలిటీషియన్‌ కమలా హారి్‌సకు నా పెయింటింగ్స్‌ బహూకరించాను. అంతెందుకు ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన దీదీ మమతా బెనర్జీకి ఓ పెయింటింగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాను. పెయింటింగ్స్‌ అందుకున్న వాళ్లంతా ఎంతో సంతోషించారు. నీలోఫర్‌ ఆసుపత్రిలో చిన్నారులకోసం నా పెయింటింగ్స్‌ పెట్టించాను. పిల్లల్లో నూతనోత్సాహం నిండేందుకే అలా చేశా. నా వెనకాల, నన్ను నడిపించేది.. మా నాన్న హిమాయత్‌ మిర్జా ప్రోత్సాహమే’ అంటోంది జెహ్రా మీర్జా.


నేను తరగతి గదిలో పాఠాలు వింటున్నా. భారతదేశచరిత్ర క్లాసులో నిజాం గురించి ప్రస్తావన ఉంది. ఏడో నిజాం పాలించిన తీరుతో పాటు చైనా యుద్ధసమయంలో సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌కి మా తాత 5 టన్నుల బంగారం ఇచ్చాడని క్లాసు టీచరు చెబుతోంటే... ఎంతో గొప్పగా ఫీలయ్యాను. అమెరికాలో చదువుకుంటున్నప్పుడే.. ఒక రోజు ఓ అమెరికన్‌ అమ్మాయి నా దగ్గరికొచ్చింది. ‘నిజాం సిటీ హైదరాబాద్‌ కదా మీది. అక్కడి ఫలక్‌నుమా ప్యాలెస్‌ చూశావా?’ అనడిగింది. ఎందుకూ.. అనడిగితే.. ‘ఆ ప్యాలెస్‌ చాలా అందంగా ఉంటుందంట’ కదా! అని ఆమె చెప్పినపుడు.. ఆనందభాష్పాలు నా కళ్లనుంచి రాలాయి. హైదరాబాద్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన మా ముత్తాత నిజాం వంశంలో పుట్టినందుకు గర్వపడ్డాను. 


ప్రిన్స్‌ ఫిలిప్‌ క్వీన్‌ ఎలిజబెత్‌ 



అబ్దుల్‌ ఖదీర్‌, హైదరాబాద్‌


Updated Date - 2021-06-16T05:30:42+05:30 IST