నడిచే పుస్తకం నిజాం వెంకటేశం

ABN , First Publish Date - 2022-09-20T06:30:18+05:30 IST

సుమారు అర్ధ శతాబ్దం పాటు మూడు తరాల రచయితలకు వారధిగా నిలిచిన నిజాం వెంకటేశం సెప్టెంబరు 18, 2022 సాయంత్రాన కన్నుమూశారు. ఈ కాలంలో ఆయనంతటి పుస్తక ప్రేమికుడు...

నడిచే పుస్తకం నిజాం వెంకటేశం

సుమారు అర్ధ శతాబ్దం పాటు మూడు తరాల రచయితలకు వారధిగా నిలిచిన నిజాం వెంకటేశం సెప్టెంబరు 18, 2022 సాయంత్రాన కన్నుమూశారు. ఈ కాలంలో ఆయనంతటి పుస్తక ప్రేమికుడు కానరారు. తాను చదివిన పుస్తకాన్ని ఫలానా వారు చదవాలని అనిపిస్తే దానిని వారికి అందించే దాకా విశ్రమించరు. అవసరమైతే హైదరాబాదులో ఏ మూలకైనా వెళ్తారు. ఆయన రాకతో ఎవరింటికైనా సాహితీ కళ వస్తుంది. ఎవరెవరివో పుస్తకాలను ప్రస్తావిస్తూ గలగలా సెలయేరులా సాగే ఆయన సాహితీ కబుర్లను ఆసక్తిగా వినేవారంతా నేడు ఒక మార్గదర్శిని కోల్పోయారు. 76ఏళ్ల వయసులో కూడా వెంకటేశం అలుపెరుగకుండా, ఎంతో ఉత్సాహంగా సాహిత్య సభలకు సమావేశాలకు హాజరై కొత్త కవులు, రచయితలకు ప్రోత్సాహాన్ని అందిస్తూ తృప్తినొందేవారు. సాహిత్యాన్ని, పుస్తకాన్ని, రచయితని, మంచితనాన్ని సమానంగా ఏకకాలంలో ప్రేమించిన అరుదైన వ్యక్తి. 


కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు చెందిన అన్ని తరాల రచయితలు ఆయనను సాహితీ గురువుగా భావిస్తారు. తమకు ఎన్నో గొప్ప పుస్తకాలను పరిచయం చేసి తమ రచనలకు మార్గదర్శకుడిగా ఉన్నారని చెప్పుకుంటారు. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ కోసం కథా రచయిత పెద్దింటి అశోక్ కుమార్ తనకు తోడుగా తన పరిచయకర్తగా కోరి మరీ వెంకటేశంను స్టూడియోకి తీసుకెళ్లాడు. పెద్దింటి కథలు, నవలలపై వెంకటేశం విశ్లేషణ ఆ కార్యక్రమానికి వన్నె తెచ్చింది. తనను ఆహ్వానించిన సభల్లో వక్తగా వెంకటేశం ఎన్నో కొత్త విషయాలను సభికులకు వివరించేవారు. ఆయన మాటలను, ప్రసంగాలను రికార్డు చేసి ప్రచురిస్తే అవి ఎంతో విలువైన సాహిత్య వ్యాసాలయ్యేవి. గంటల తరబడి చదవడం పట్ల ఉన్న ఆసక్తి ఆయన రాయడంపై చూపలేదు.


అలిశెట్టి ప్రభాకర్‌తో వెంకటేశం అనుబంధం విశేషమైనది. పెద్దన్నలా ప్రభాకర్‌ను సరిదిద్దేందుకు ఎంతో ప్రయత్నించారు. 1988లో ప్రభాకర్‌ను జగిత్యాలకు రప్పించి ఆయన ఆరోగ్య, కుటుంబ బాధ్యతలను తనపై వేసుకున్నారు. అయితే ‘సిటీలైఫ్’ ఆగిపోతుందని ఓ కాగితం ముక్క రాసిపెట్టి అలిశెట్టి తిరిగి హైదరాబాదుకు వచ్చేశాడు. జేబు ఖాళీగా ఉన్నా అలిశెట్టి ఒకరి సొమ్మును ఆశించేవాడు కాదు. తన భావజాలానికి విరుద్ధంగా ఉన్నవారిని పూర్తిగా దూరం పెట్టేవాడు. అయితే వెంకటేశం చేసే ఆర్థిక సాయానికి మాత్రం ప్రభాకర్ అడ్డు చెప్పేవాడు కాదు. దానిని ప్రస్తావిస్తూ అలిశెట్టి ఓ కవితలో: ‘ఘల్లున గచ్చుమీద రూపాయి/ బిళ్ళ మోగినట్లు/ నిజాం వెంకటేశం వస్తాడు/ నన్నూ నా రోగాన్ని మందుల్నీ కవిత్వాన్నీ/ కవుల్నీ తిట్టినా తిట్టు తిట్టకుండా/ కసితీరా తిట్టి/ మధ్యలో రూటు మార్చి/ మహాశ్వేతాదేవిని మెచ్చుకొని/ తరచుగా సాహిత్య సభల్లో పాల్గొన/ లేనందుకు నొచ్చుకొని/ నాకో వందిచ్చుకొని మరి నిష్క్రమిస్తాడు’ అని రాసుకున్నాడు. 2013లో అలిశెట్టి ప్రభాకర్ కవితా సంపుటి రావడంలోను వెంకటేశం ప్రధానపాత్ర పోషించాడు.


కవిత్వం పట్ల అత్యంత ప్రేమతో 1980 దశకంలో దిక్సూచి అనే కవితా సంచికలు వెలువరించారు. అలిశెట్టి దీర్ఘకవిత ‘నిజరూపం’ అందులోనే వచ్చింది. కరీంనగర్ బుక్ ట్రస్ట్ ఆరంభించి అల్లం రాజయ్య ‘భూమి’ కథలు, బి.ఎస్. రాములు ‘బతుకు పోరు’ నవలను ప్రచురించారు. ఆదిలాబాదుకు చెందిన న్యాయవాది విద్యాసాగర్ రెడ్డి దేశంలో ఆర్థిక రంగ మార్పులను సూచిస్తూ రాసిన మూడు ఇంగ్లీషు పుస్తకాలను వెంకటేశం తెలుగులోకి అనువదించారు. సేంద్రియ వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్ వ్యవసాయ విధానాలపై రాసిన ఇంగ్లీషు పుస్తకాన్ని కూడా తెనిగించారు. వితరణశీలత వెంకటేశం మరో సుగుణం. ఎందరో కవులు, రచయితలకు పుస్తక ప్రచురణ కోసం ఆర్థిక సహాయాన్ని అందించారు.


1948లో సిరిసిల్లలో జన్మించిన వెంకటేశం నిజామాబాదులో పాలిటెక్నిక్ చేసి విద్యుత్ శాఖలో చేరారు. చెన్నైలో ఏ.ఎం.ఐ.ఈ చేసి ఇంజనీరుగా పదోన్నతి పొంది విధులను నిర్వహించారు. 1970 దశకంలో అప్పటి కరీంనగర్ జిల్లాలో విద్యుత్తు సదుపాయాల విస్తరణ పెద్ద ఎత్తున జరిగింది. ఆ సమయంలో ఇంజనీరుగా ఆయన పల్లె పల్లె తిరుగుతూ ఊర్లలో వీధి దీపాలు, బావులకు మోటార్ల కోసం కరెంటును అందించారు. ఇప్పటికి అక్కడి గ్రామాల ప్రజలు ఆయన సేవల్ని కొనియాడుతుంటారు. ఆయన నిష్క్రమణతో తెలుగు పుస్తకం ఒక చేయూతను కోల్పోయింది. అలవోకగా అందరి కవితలు చదివే స్వరపేటిక మూగపోయింది. నడిచే గ్రంథాలయం కూలిపోయింది. 

బి. నర్సన్

Updated Date - 2022-09-20T06:30:18+05:30 IST