ఏడాదిన్నరగా ఎదురుచూపులే !!

ABN , First Publish Date - 2020-10-30T10:57:17+05:30 IST

పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన కృష్ణపట్నం పోర్టు.. క్రూయిజ్‌ నౌకల రాక కోసం ఏడాదిన్నరగా ఎదురు చూస్తున్నది.

ఏడాదిన్నరగా ఎదురుచూపులే !!

కేపీ పోర్టుకు క్రూయిజ్‌ నౌకలు వచ్చేదెప్పుడో ?

 ప్రయాణికులు రాకపోకలు సాగిస్తే,

   హోటల్‌,పర్యాటక రంగాల అభివృద్ధి

 యాజమాన్యం మార్పుతో జాప్యం


ముత్తుకూరు, అక్టోబరు29 :  పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన కృష్ణపట్నం పోర్టు.. క్రూయిజ్‌ నౌకల రాక కోసం ఏడాదిన్నరగా ఎదురు చూస్తున్నది. కృష్ణపట్నం పోర్టును అధికారికంగా ఇమ్మిగ్రేషన్‌ చెక్‌ పాయింట్‌గా గుర్తిస్తూ కేంద్ర హోంశాఖ గత ఏడాది ఫిబ్రవరిలో నోటిఫై చేసింది. దీంతో ఇకపై కృష్ణపట్నం పోర్టులో ప్రయాణికుల నౌకలు(క్రూయిజ్‌) సందడి చేస్తాయని సంబరపడ్డారు.  


 క్రూయిజ్‌ రాకపోకలకు మార్గం సుగమం


సముద్ర మార్గం ద్వారా వస్తు రవాణాలో దక్షిణాసియా లోనే ప్రసిద్ధి చెందిన కృష్ణపట్నం పోర్టుకు క్రూయిజ్‌ రాకపోకలకు మార్గం సుగమం అయ్యింది. ఇప్పటివరకు కార్గో ఎగుమతులు, దిగుమతులతో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కృష్ణపట్నం పోర్టు ఇకపై క్రూయజ్‌ రాకపోకల అభివృద్ధిపై దృష్టిపెట్టే అవకాశం కలిగింది. కార్గో రవాణాలో విదేశీ నౌకాశ్రయాలతో నేరుగా అనుసంధానం చేసుకున్న పోర్టు యాజమాన్యం వ్యాపారులకు తక్కువ ఖర్చుతో ఎగుమతి, దిగుమతులను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో ఇప్పటివరకు విశాఖపట్నం పోర్టులో మాత్రమే క్రూయిజ్‌లకు అనుమతి వుండగా, ప్రస్తుతం ఆ జాబితాలో కృష్ణపట్నం పోర్టు చేరింది. నౌకల ద్వారా ప్రయాణికుల రాకపోకలకు అనుమతులు లభించడం ద్వారా జిల్లా పర్యాటక రంగ అభివృద్ధికి కృష్ణపట్నం పోర్టు కేంద్రంగా మారుతుంది. ఈ పోర్టు నుంచి దేశ, విదేశాలకు రాకపోకలు ప్రారంభమయితే నెల్లూరు ప్రాముఖ్యత పెరిగే అవకాశం వుంది. పర్యాటకంతో పాటు హోటల్‌ రంగంలోనూ ఊహించని అభివృద్ధి సాధ్యమవుతుంది. పోర్టుకు ఇమ్మిగ్రేషన్‌ గుర్తింపు ఇవ్వడంతో నెల్లూరు పారిశ్రామిక రంగంతో పాటు పర్యాటక రంగంలో ప్రాధాన్యతను సంతరించుకుంటుందని భావించారు. అయితే పోర్టు యాజమాన్యంలో మార్పుతో క్రూయిజ్‌ నౌకల నిర్ణయం మరుగున పడిపోయింది. 


 అనుమతి లభించినా.. పురోగతి శూన్యం


ఇమ్మిగ్రేషన్‌ అనుమతులు లభించినా, ఈ దిశగా ఎలాంటి పురోగతి లేదు.. కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్‌ యాజమాన్యం ఆధ్వర్యంలో దక్షిణాసియాలో ఇప్పటికే అతి పెద్ద కంటైనర్‌ హబ్‌గా అవతరించిన పోర్టు ప్రస్తుతం అదానీ కంపెనీ చేతికి వచ్చింది. పోర్టుల నిర్వహణలో ఎంతో అనుభవం ఉన్న అదానీ కంపెనీ యాజమాన్య బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో భవిష్యత్‌లో క్రూయిజ్‌ల రాకపోకలతో జిల్లా పర్యాటక అభివృద్ధిలోనూ కృష్ణపట్నం పోర్టు కీలక పాత్ర పోషిస్తుందని స్థానికులు భావిస్తున్నారు.

Updated Date - 2020-10-30T10:57:17+05:30 IST