టీడీపీలోకి వంటేరు!?

ABN , First Publish Date - 2020-10-27T07:31:27+05:30 IST

టీడీపీలోకి వంటేరు!?

టీడీపీలోకి వంటేరు!?

 సంప్రదింపులు జరుపుతున్న అధిష్ఠానం

 ఈ నెలాఖరులో స్పష్టత

 మారుతున్న కావలి రాజకీయం


నెల్లూరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : కావలి తెలుగుదేశం పార్టీలో కొత్త చేర్పులకు ఆస్కారం కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి వైపు టీడీపీ నాయకత్వం చూస్తోంది. వంటేరును తిరిగి ఆ పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందుకు ఆయన కూడా సమ్మతించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే జరిగితే కావలి టీడీపీ రాజకీయాలు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. రాజకీయంగా అధికార పార్టీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నియోజకవర్గాల్లో కావలి ప్రథమ స్థానంలో ఉంది. అదే సమయంలో ఇక్కడ టీడీపీ గతంలో కంటే బలహీనంగా మారుతోంది. కావలి టీడీపీకి ఏక నాయకుడిగా ఉన్న బీద మస్తాన్‌రావు వైసీపీలో చేరడంతో నాయకత్వ సమస్య మొదలైంది. దీనికితోడు బీద రవిచంద్ర టీడీపీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడంతో నియోజకవర్గ రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేని పరిస్థితి ఏర్పడింది.


ఈ లోటు పూడ్చి కావలి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసే క్రమంలో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని అధిష్ఠానం సూచించినట్లు సమాచారం.కాగా, వంటేరు కావలి నుంచి రెండు సార్లు, నెల్లూరు పార్లమెంటుకు రెండుసార్లు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆ తరువాత టీడీపీని వీడి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి గెలుపునకు కృషి చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్టు కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఎన్నికల ఫలితాల తరువాత ఎమ్మెల్యే రామిరెడ్డికి ఈయన మధ్య విభేదాలు తలెత్తాయి. కావలిలో వంటేరు రాజకీయ కార్యకలాపాలకు ఎమ్మెల్యే అనుచరులు చెక్‌ పెట్టారు. కావలిలో ప్రెస్‌ మీట్‌ పెట్టడానికి కూడా వీల్లేదని ఆంక్షలు విధించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వంటేరు వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో వంటేరు వేణుగోపాల్‌రెడ్డిని తిరిగి పార్టీలోకి తెచ్చుకోవడం ద్వారా కావలి టీడీపీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని అధిష్ఠానం భావిస్తోంది. ఆ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం టీడీపీ నేతలతో వంటేరు భేటీ అయినట్లు తెలిసింది. టీడీపీలోకి పునఃప్రవేశం పట్ల వంటేరు కూడా సుముఖంగానే ఉన్నట్లు ప్రచారం. ఈ నెలాఖరులో వంటేరు రాజకీయ గమ్యంపై స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. 

Updated Date - 2020-10-27T07:31:27+05:30 IST