ఎన్‌ఎండీసీ లిథియం అన్వేషణ

ABN , First Publish Date - 2022-08-13T05:37:58+05:30 IST

ఎలక్ట్రిక్‌ వాహనాల్లో వినియోగించే లిథియం, కోబాల్ట్‌ వంటి ఖనిజాల అన్వేషణను చేపట్టాలని ఎన్‌ఎండీసీ నిర్ణయించింది. విదేశాల్లో కాపర్‌, నికిల్‌, బంగారం వంటి లోహాల అన్వేషణను కూడా చేపట్టనున్నట్లు ఎన్‌ఎండీసీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుమిత్‌

ఎన్‌ఎండీసీ లిథియం అన్వేషణ

హైదరాబాద్‌ (ఆంధ్ర జ్యోతి బిజినె స్‌): ఎలక్ట్రిక్‌ వాహనాల్లో వినియోగించే లిథియం, కోబాల్ట్‌ వంటి ఖనిజాల అన్వేషణను చేపట్టాలని ఎన్‌ఎండీసీ నిర్ణయించింది.  విదేశాల్లో  కాపర్‌, నికిల్‌, బంగారం వంటి లోహాల అన్వేషణను కూడా చేపట్టనున్నట్లు ఎన్‌ఎండీసీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుమిత్‌ దేవ్‌ తెలిపారు. ఎన్‌ఎండీసీకి 90 శాతం వాటా ఉన్న ఆస్ట్రేలియాలోని లెగసీ ఐరన్‌ ఓర్‌ లిమిటెడ్‌  వీటి అన్వేషణను చేపడుతుందని ఫిక్కీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో సుమిత్‌ పేర్కొన్నారు. ఆఫ్రికా, టాంజానియా, జింబాబ్వే వంటి దేశాల్లో బంగారం, రాగి వంటి లోహాలను ఎన్‌ఎండీసీ అన్వేషిస్తుంది. కర్ణాటకలో లిథియం అన్వేషణకు హక్కులు పొందామని, ఇక్కడ కూడా లిథియం అన్వేషణ, తవ్వకాలు చేపడతామని వివరించారు. ఇనుప ఖనిజం గిరాకీ స్వల్పంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇనుప ఖనిజం ధరలను స్వల్పంగా పెంచినట్లు చెప్పారు. 


4.6 కోట్ల టన్నుల ఉత్పత్తి లక్ష్యం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 4.6 కోట్ల టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేయాలని ఎన్‌ఎండీసీ లక్ష్యంగా పెట్టుకుంది. 2021-22 ఏడాది ఉత్పత్తి కంటే ఇది దాదా పు 10 శాతం అధికమని సుమిత్‌ దేవ్‌ తెలిపారు. బచేలి, కుమారస్వామి, ఇతర గనుల్లో ఉత్పత్తి..  మొత్తం ఉత్పత్తి పెరుగుదలకు దోహదం చేయనుంది. అంతర్జాతీయంగా ఉక్కు ధరలు తగ్గుతుండడంతో ఆ ప్రభావం ఇనుప ఖనిజం ధరలపై పడుతోంది. అధిక ఉత్పత్తి, విక్రయాల ద్వారా ధరల ఒత్తిడిని అధిగమించాలని ఎన్‌ఎండీసీ భావిస్తోంది. 


స్వల్పంగా ధరల పెంపు..: వెంటనే అమలులోకి వచ్చే విధంగా ఇనుప ఖనిజం ధరలను ఎన్‌ఎండీసీ పెంచింది. లంప్స్‌ టన్ను ధరను రూ.200 మేరకు పెంచి రూ.4,100కి సవరించింది. ఫైన్స్‌ ధరను రూ.100 పెంచి రూ.2,910గా నిర్ణయించింది. గత నెలలో చేసిన ధరల సవరణలో లంప్స్‌, ఫైన్స్‌ ధరలను టన్నుకు రూ.500 మేరకు తగ్గించింది. స్టీల్‌ ఉత్పత్తిలో ఇనుప ఖనిజం ప్రధాన ముడి పదార్థం. దేశంలో ఉక్కు కంపెనీలకు ఇనుప ఖనిజాన్ని ప్రధానంగా ఎన్‌ఎండీసీ సరఫరా చేస్తోంది. 

Updated Date - 2022-08-13T05:37:58+05:30 IST