అడ్మిషన్‌ లేదు.. అమ్మాయి లేదు!

ABN , First Publish Date - 2022-08-18T04:34:47+05:30 IST

సాయంత్రం ఏడు గంటల వరకూ గురుకులంలో ఉండి , భోజనం అనంతరం ఓ విద్యార్థిని అదృశ్యమైంది.

అడ్మిషన్‌ లేదు.. అమ్మాయి లేదు!
మైనార్టీ గురుకుల పాఠశాలలో విచారిస్తున్న ఎస్‌ఐ బిందుమాధవి

మిస్టరీగా విద్యార్థిని అదృశ్యం..


వాల్మీకిపురం, ఆగస్టు 17: సాయంత్రం ఏడు గంటల వరకూ గురుకులంలో ఉండి , భోజనం అనంతరం ఓ విద్యార్థిని అదృశ్యమైంది. అయితే, ఆమె అడ్మిషన్‌తోపాటు,  కనీసం  పేరు, ఇతర వివరాలు కూడా ఎవరికీ తెలియకపోవడంతో ఈ విషయం మిస్టరీగా మారింది.  వివరాలిలా ఉన్నాయి.  వాల్మీకిపురం పట్టణ సమీపంలోని ఏపీ మైనార్టీ  బాలికల గురుకుల పాఠశాలలో మంగళవారం ఆరవ తరగతి  అడ్మిషన్లు నిర్వహించారు. పలువురు బాలికలు తమ తల్లిదండ్రులతో వచ్చి పాఠశాలలో చేరారు. అయితే, అక్కడికి వచ్చిన ఓ విద్యార్థిని గురుకులంలోని పరిస్థితులు వాకబు చేసినట్లు సమాచారం. అడ్మిషన్లు ముగిశాక ఆ గుర్తు తెలియని ఆ బాలిక కూడా ఇతర విద్యార్థినులతో కలసి పాఠశాలలోకి వెళ్లి, వారితో కలివిడిగా ఉన్నట్లు తెలిసింది. సాయంత్రం 7 గంటలకు అందరితో కలిసి భోజనం చేసింది. ఆ తరువాత డార్మెటరీకి వెళ్లే సమయంలో అదృశ్యం అయింది.  సహచర విద్యార్థినులతో కలిసి ఉన్నపుడు  తన పేరు సబిహా అని, మదనపల్లె సమీపంలోని ఓ పల్లె తన ఊరు అని చెప్పినట్లు విద్యార్థినులు చెబుతున్నారు. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. ఈ విషయమై బుధవారం ఉదయం స్థానిక ఎస్‌ఐ బిందుమాధవి పాఠశాలలో విచారణ చేశారు. ఈ సందర్భంగా గురుకులం ప్రిన్సిపాల్‌ మంజుల మాట్లాడుతూ గుర్తు తెలియని బాలిక విషయం, వివరాలు తెలియవన్నారు.  దీంతో పాఠశాల ఆవరణలోకి ఎవరు వస్తున్నారు.. ఎవరు వెళుతున్నారన్న విషయం గ్రహించలేకపోవడం అక్కడి అధికారుల నిర్లక్ష్యమేనని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-08-18T04:34:47+05:30 IST