బాహుబలి వెర్సస్ బజ్‌రంగ బలి: అమిత్‌షా

ABN , First Publish Date - 2021-12-31T19:21:32+05:30 IST

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా యూపీ ఎన్నికల ప్రచారంలో భజరంగ్ బలి (హనుమాన్) పేరును పదేపదే..

బాహుబలి వెర్సస్ బజ్‌రంగ బలి: అమిత్‌షా

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా యూపీ ఎన్నికల ప్రచారంలో భజరంగ్ బలి (హనుమాన్) పేరును పదేపదే ప్రస్తావించారు. గత పాలకులను బాహుబలులు (కండబలం కలవారు)గా పోల్చారు. యోగి ఆదిత్యనాథ్ హయాంలో భజరంగ్ బలి తప్ప బాహుబలులు అంతా కనుమరుగయ్యారని పరోక్షంగా సమాజ్‌వాదీ పార్టీపై విమర్శలు గుప్పించారు.


అలీగఢ్‌లో శుక్రవారంనాడు జరిగిన జన్ విశ్వాస్ యాత్రలో అమిత్‌షా మాట్లాడుతూ, సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆడకూతుళ్లు, సోదరీమణులను బాహుబలులు వేధించేవారని, భూములు లాక్కునేవారని విమర్శించారు. యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఇవన్నీ కనుమరుగయ్యాయని, ఒక్క హనుమంతుడు మాత్రమే కనిపిస్తున్నారని అన్నారు. 1992లో బాబ్లీ మసీదు కూల్చివేత సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న బీజేపీ నేత కల్యాణ్ సింగ్‌పై అమిత్‌షా ప్రశంసలు కురిపించారు. నిజమైన పాలన అంటే ఏమిటో ఆయన చూపించారని చెప్పారు. రామజన్మభూమి కోసం బాబూజీ (కల్యాణ్ సింగ్) తన పదవిని సైతం త్యాగం చేశారని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు జిన్నా తప్ప కల్యాణ్ సింగ్ గుర్తుకురారనీ, జిన్నాను శ్లాఘించిన వారికి ఓట్లు వేస్తారా? అని అమిత్‌షా ప్రశ్నించారు.


రామజన్మభూమి ఉద్యమ సమయంలో ఎల్.కె.అడ్వానీ రథయాత్ర తీశారని, కరసేవకులపై సమాజ్‌వాదీ పార్టీ బుల్లెట్లు కురిపించదని, రామాలయం కోసం మన ప్రధాని నరేంద్ర మోదీ భూమిపూజ జరిపారని అన్నారు. ఎవరెంతగా ప్రయత్నించినా అయోధ్యలో భవ్య రామాలయ నిర్మాణం కొద్ది నెలల్లో పూర్తవుతుందని అన్నారు. మాయావతి, అఖిలేష్, కాంగ్రెస్ నేతలు ఎవ్వరూ కూడా బీజేపీని తిరిగి యూపీలో అధికారంలోకి రాకుండా ఆపలేరని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 300కు పైగా సీట్లు గెలుస్తామని చెప్పారు. భారతదేశంతో కశ్మర్ పూర్తి విలీనానికి 370 అధికరణ రద్దు ఉపకరించిందని కూడా ఆయన అన్నారు.

Updated Date - 2021-12-31T19:21:32+05:30 IST