శవయాత్రలో భగవద్గీత వద్దు

ABN , First Publish Date - 2022-08-19T07:57:42+05:30 IST

మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక చింతనకు భగవద్గీత ఆలవాలమని.. అలాంటి గ్రంథాన్ని అవమానిస్తే దాడులు తప్పవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హెచ్చరించారు.

శవయాత్రలో భగవద్గీత వద్దు

అలా వినిపిస్తే దాడులు.. వైకుంఠ రథం టైర్లను కోసేస్తాం

పథకం ప్రకారం హిందూ ధర్మంపై దాడి

కేసీఆర్‌, దమ్ముంటే బలప్రదర్శనకు రా

ఉప ఎన్నికల కోసం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కాంక్ష

గూగుల్‌లో బెస్ట్‌ పర్సన్‌ ఆఫ్‌ ఇండియా మోదీ అని..

వేస్ట్‌ ఫెలో ఆఫ్‌ ఇండియా కేసీఆర్‌ అని చూపిస్తోంది

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యలు


లింగాలఘణపురం/జనగామ/జనగామ టౌన్‌/కోరుట్ల, ఆగస్టు 18 : మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక చింతనకు భగవద్గీత ఆలవాలమని.. అలాంటి గ్రంథాన్ని అవమానిస్తే దాడులు తప్పవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హెచ్చరించారు. హిందువులు, ఆలయాలు, అర్చకులపై దాడి జరుగుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవడం లేదన్నారు. పవిత్రమైన భగవద్గీతను ఈ మధ్య పథకం ప్రకారం శవయాత్రల్లో వినిపిస్తున్నారని.. అలా చేస్తే దాడులు చేసి, వైకుంఠ రథం టైర్లను కోసేస్తామని హెచ్చరించారు.


కొన్ని శక్తులు హిందూ ధర్మాన్ని కించపర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని అన్నారు. బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర గురువారం జనగామ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఉదయం లింగాలఘణపురం మండలం పటేల్‌గూడెం వద్ద సంజయ్‌ని కలిసిన బ్రాహ్మణ ప్రతినిధులు తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడారు. ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకునే కేసీఆర్‌.. అర్చకులకు వేతనాలివ్వడం లేదని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఇప్పుడున్న బ్రాహ్మణ పరిషత్‌ను రద్దుచేసి బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రామయాణ, మహా భారతాలను వ్యంగ్యంగా చిత్రీకరిస్తే దాడులు చేస్తామని హెచ్చరించారు.


కేసీఆర్‌ తాటాకు చప్పుళ్లకు భయపడం..

పరేడ్‌ గ్రౌండ్‌లో మోదీ సభ చూశాక సీఎం కేసీఆర్‌ గడీ కదిలిందని సంజయ్‌ అన్నారు. అందుకే ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు దమ్ముంటే బలప్రదర్శనకు రావాలని సవాల్‌ విసిరారు. బీజేపీ ముందు గూండాగిరీ, దాదాగిరీ పనిచేయవని అన్నారు. అవసరమైతే పేదల కోసం టీఆర్‌ఎస్‌ కంటే ఎక్కువ గూండాగిరీ, దాదాగిరీ చేస్తామని హెచ్చరించారు. గురువారం రాత్రి జనగామ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్‌ షోలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ నేతల తాటాకు చప్పుళ్లకు తాను భయపడే మనిషిని కాదన్నారు. ఇటీవల జరిగిన సామూహిక గీతాలాపనలో స్వతంత్ర భారత్‌కీ జై అని ఒవైసీ అనలేదని గుర్తు చేశారు. కేసీఆర్‌కు దమ్ముంటే ఒవైసీతో భారత్‌ మాతాకీ జై అని అనిపించాలని సవాల్‌ విసిరారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమ నియోజవర్గంలో కూడా ఉప ఎన్నికలు రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. భవిష్యత్తులో అధికారం కోల్పోతే లండన్‌, మస్కట్‌ పారిపోయేందుకే కేసీఆర్‌, కేటీఆర్‌ రూ.వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. గూగుల్‌లో బెస్ట్‌ పర్సన్‌ ఆఫ్‌ ఇండియా అని కొడితే మోదీ పేరు, వేస్ట్‌ ఫెలో ఆఫ్‌ ఇండియా అని కొడితే కేసీఆర్‌ పేరు వస్తుందని ఎద్దేవా చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా పోలీసులు దుకాణాలను బలవంతంగా మూయుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే పాతబస్తీ గల్లీల్లో పాదయాత్ర చేస్తానన్నారు. 

జనగామ చౌరస్తా.. జనసంద్రం

ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా జనగామ చౌరస్తా ప్రాంతం జనసంద్రమైంది. చౌరస్తా నలుదిక్కులూ కార్యకర్తలు, జనంతో నిండిపోయింది. మహిళల బోనాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. జనగామ ఆర్టీసీ చౌరస్తాలో గల పలు షాపులతో పాటు పట్టణంలోని వైన్‌ షాపులు, బార్లను మధ్యాహ్నం నుంచే బంద్‌ చేయించారు.


బీజేపీతోనే బంగారు తెలంగాణ: చుగ్‌

డబుల్‌ ఇంజన్‌ సర్కారుతో బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరణ్‌ చుగ్‌ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో తరుణ్‌ చుగ్‌ ముఖ్య అథితిగా పాల్గొన్నారు. కోరుట్ల వ్యాపారవేత్త సురభి నవీన్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తరుణ్‌ చుగ్‌ మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనలో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు.

Updated Date - 2022-08-19T07:57:42+05:30 IST