మహారాష్ట్ర Crisis లో మా పాత్ర లేదు: Bjp

ABN , First Publish Date - 2022-06-24T21:32:59+05:30 IST

మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని సంక్షోభంలో పడేస్తూ శివసేన పార్టీపై ఆ పార్టీ మంత్రి ఏక్‌నాథ్ షిండే చేసిన తిరుగుబాటులో..

మహారాష్ట్ర Crisis లో మా పాత్ర లేదు: Bjp

ముంబై: మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని (MVA) సంక్షోభంలో పడేస్తూ శివసేన పార్టీపై ఆ పార్టీ మంత్రి ఏక్‌నాథ్ షిండే (Ekanth Shinde) చేసిన తిరుగుబాటులో తమ పార్టీ ప్రమేయం ఏమీ లేదని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ (Chandrakant Patil) శుక్రవారంనాడు అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ 'ఏదో పని మీద' మాత్రమే ఢిల్లీ వెళ్లారని చెప్పారు. అయితే, మరిన్ని వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.


ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకే రాజకీయ సంక్షోభం సృష్టించారని, దీని వెనుక బీజేపీ పాత్ర ఉందని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చంద్రకాంత్ పాటిల్ తాజా వివరణ ఇచ్చారు. ఆసక్తికరంగా రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే గౌహతిలోని తన క్యాంప్ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ బీజేపీని పరోక్షంగా ప్రస్తావించారు. రెబల్ నేతలకు ఒక జాతీయ పార్టీ మద్దతుగా ఉందని, అవసరమైన సాయాన్ని చేయగలమని హామీ ఇచ్చిందని నేరుగా బీజేపీ పేరును ప్రస్తావించకుండా ఆయన వ్యాఖ్యానించారు.


ఈ క్రమంలోనే చంద్రకాంత్ పాటిల్ తన హోమ్‌టౌన్ కొల్హాపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ , శివసేన, మహా వికాస్ అఘాడిలో తలెత్తిన సంక్షోభంలో బీజేపీ పాత్ర ఏముంటుందని ప్రశ్నించారు. ముంబైలో గురువారం మధ్నాహం తాను దేవేంద్ర ఫడ్నవిస్‌తో లంచ్ చేశానని, ఆ తర్వాత ఆయన ఏదో పనిమీద ఢిల్లీ వెళ్లారని తెలిపారు. ఒకవేళ ఏదైనా పరిణామాలు అంటే ఉండే తప్పనిసరిగా చెబుతానని ఆయన తనతో అన్నారని చంద్రకాంత్ పాటిల్ వివరించారు. బీజేపీ ప్రస్తుతం 2024 ఎన్నికల సన్నాహాల్లో బీజేపీగా ఉందని చెప్పారు. షిండే తిరుగుబాటులో బీజేపీ పాత్ర ఉందని పవార్ వ్యాఖ్యానించడంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఎవరికైనా మాట్లాడే హక్కు ఉందని అన్నారు. రోజువారీ వార్తలు కూడా తాను అంతగా చూడనని, శివసేనలో ఏమి జరిగిందనేది తనకు సరిగా తెలియదని చెప్పారు. ముంబైకి చెందిన బీజేపీ ఫంక్షనరీ మోహిత్ కాంబోజ్ రెబల్ నేతలతో గౌహతిలో ఉన్నారనే వార్తలపై స్పందిస్తూ, ఆయనకు ప్రతి పార్టీలోనూ మిత్రులున్నారని, ఎవరికైనా సాయం కోసం ఆయన వెళ్లి ఉండొచ్చని, ఆయన వివరాలేమీ తనకు తెలియదని పాటిల్ చెప్పారు.

Updated Date - 2022-06-24T21:32:59+05:30 IST