అలుపెరుగని వాన

ABN , First Publish Date - 2021-07-23T06:22:28+05:30 IST

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా తడిసి ముద్దయిపోయింది. అనేక చెరువులు, కుంటలు నిండుకుండలా మారి మత్తళ్లు దూకుతున్నాయి. వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి.

అలుపెరుగని వాన
మత్తడి పోస్తున్న గంగారం మండలం కోమటగూడెం పెద్ద చెరువు

నిండుకుండలా ఉమ్మడి వరంగల్‌ జిల్లా
పొంగుతున్న వాగులు, వంకలు
మత్తళ్లు దూకుతున్న చెరువులు, కుంటలు
మారుమూల ప్రాంతాలకు రాకపోకలు బంద్‌
నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
పలుచోట్ల వరి, పత్తి, కంది పంటలకు నష్టం
అప్రమత్తమైన అధికార యంత్రాంగాలు
కంట్రోల్‌ రూంల ఏర్పాటు


ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లా

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా తడిసి ముద్దయిపోయింది. అనేక చెరువులు, కుంటలు నిండుకుండలా మారి మత్తళ్లు దూకుతున్నాయి. వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ఏజెన్సీ ప్రాంతంలో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. రోడ్లు ధ్వంసం కాగా, ఇండ్లు కూలిపోయాయి. రెండు రోజులుగా వర్షం ఎడతెగకుండా కొనసాగుతుండటంతో జనజీవనం కూడా స్తంభించి పోయింది. ప్రజల దైనందిన కార్యాకలాపాలకు ఆటంకాలు ఏర్పడ్డాయి.  గత 24 గంటల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సరాసరి 54.87 మిమీ వర్షపాతం నమోదైంది. ఈ ఆరు జిల్లాలో మొత్తంగా 329.25 మి.మీ. వ ర్షం కురిసింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 44.7 మి.మీ. వర్షపాతం, మహబూబాబాద్‌ జిల్లాలో 71.7మి.మీ, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 53మి.మీ, జనగామ జిల్లాలో 47.6మి.మీ, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 59.8 మి.మీ, ములుగు జిల్లాలో 52.45 మి.మీ వర్షపాతం నమోదైంది. వరుస వర్షాలతో ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. సహాయక చర్య లు చేపట్టేందుకు కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటుచేశారు.  హైదరాబాద్‌ నుంచి మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్‌ కలెక్టర్లతో మాట్లాడి అప్రమత్తం చేశారు. ప్రజలకు నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరో రెం డు రోజులు వర్షాలున్నందున తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

రాకపోకలు బంద్‌

ఎడతెగని వర్షాలతో భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో మోరంచవాగు అప్పయ్యపల్లి, సీతారాంపూర్‌, కొండాపూర్‌, గుర్రంపేట, బంగ్లాపల్లి, వీర్లపల్లి తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాటారం మండలంలో పోతులవాయి దగ్గర బొర్రవాగు, బొప్పారం వాగుల ఉప్పొంగుతున్నాయి. దీంతో ప్రతాపగిరి, మర్రిపల్లి, బొప్పారం, దంతాలపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే ములుగు జిల్లా మంగపేట మండలంలో గౌరారం వాగు, మల్లూరు వాగు, ఎర్రవాగు, చుంచుపల్లివాగు, ముసలమ్మవాగులు వర్షపు నీటితో పొంగి పోర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. కన్నాయిగూడెం మండలంలోని సర్వాయి, ఐలాపూర్‌ మధ్య ఉన్న సుద్దవాగు, మేడి వాగులు ఉధృతంగా ప్రవహించటంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. ఏటూరునాగారం మండలం జోరుగా కురుస్తున్న వర్షానికి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని బానాజీ బంధం, ఎలిశెట్టిపల్లి గ్రామాల మధ్యగల జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఎలిశెట్టిపల్లి వాసులకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని పెద్దవెంకటాపూర్‌, రాయబంధం గ్రామాల మధ్య జీడీవాగు ఉప్పొంగడంతో రాయబంఽధానికి రాకపోకలు నిలిచిపోయాయి. వీటితో పాటు ములుగు, భూపాలపల్లి జిల్లాలో వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

మహబూబాబాద్‌ జిల్లాలో బుధవారం రాత్రి నుంచి ప్రారంభమైన ముసురు విరామంగా లేకుండా  కొనసాగుతోంది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండగా కొన్ని చెరువులు అలుగు పోస్తున్నాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా, జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగుల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆధ్వర్యంలో జాగ్రత్తలు చేపట్టారు. జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. దంతాలపల్లిలో పాలేరువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బయ్యారం మండలంలో పెద్దచెరువు నిండి అలుగుపోస్తోంది. తులారాం ప్రాజెక్టు అలుగుపోసి నీరు ప్రవహిస్తుండడంతో మహబూబాబాద్‌లోని మున్నేరువాగు ఉధృతంగా మారింది. ఈదులపూసపల్లి రోడ్‌డ్యాంపై నీరు ప్రవహి స్తుండడంతో చెరువుల్లోకి నీరు చేరుకుంటున్నాయి. కేసముద్రం మండలంలో అర్పనపల్లి బ్రిడ్జి కింద నుంచి వట్టివాగు ప్రవహిస్తోంది. రాత్రి వరకు బ్రిడ్జిపై నుంచి వరదనీరు పోయే అవకాశం కన్పిస్తోంది. కేసముద్రం మినీ ఆర్‌యూబీ నుంచి  వరద నీరు ఉధృతంగా ప్రవహి స్తుండడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భీమునిపాదం జలపాతం జోరుగా మారింది.

నీటమునిగిన వరి, పత్తి పంటలు

ఏకధాటిగా పడుతున్న వర్షాలతో జనగామ జిల్లా తడిసి ముద్దవుతోంది. ముసురుతో పాటు మధ్య మధ్యలో భారీ వర్షాలు కురుస్తుండటంతో చెరువులు, కుంట లు, వాగులు జలకళను సంతరించుకుంటున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలుస్తోంది. ఫలితంగా వరి, పత్తి, కంది పంటలు నీట మునిగాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అత్యధిక వర్షపాతం గురువారం నమోదైంది. పాలకుర్తి మండలంలో బమ్మెర ఊరచెరువు మత్తడి పడింది. నర్మెట్ట మండలంలోని నర్మెట్ట, వెల్దండ, గండిరామవరం, మచ్చుపహాడ్‌, హన్మంతాపూర్‌, అమ్మాపురం చెరువులు మత్తళ్లు దంకుతున్నాయి. బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేట వాగు పారుతోంది. దేవరుప్పుల మండలంలోని కోలుకొండ వాగు పొంగి పొర్లుతోంది. అదే మండలంలోని చౌడూరు వాగుపై ఉన్న మత్తడి నిండి కిందికి దూకుతోంది. జఫర్‌గడ్‌ మండలంలోని పలు చెరువులు, కుంటల్లో నీరు పుష్కలంగా వచ్చి చేరుతోంది. ఇదే మండలంలోని ఉప్పుగల్లులో వర్షపు నీటితో చెక్‌డ్యామ్‌ పొంగి పొర్లుతోంది. సూరారం రోడ్డు వర్షాలకు కోతకు గురైంది. లింగాలఘణపురం మండలంలోని పటేల్‌గూడెంలో వర్షపునీరుతో వరి, పత్తి పంటలు నీట మునగగా, చీటూరు వాగు పొంగిపొర్లుతోంది. జనగామ మండలంలోని ఎర్రగొల్లపహాడ్‌, వడ్లకొండ చెరువుల మత్తళ్లు దుంకుతున్నాయి. గానుగుపహాడ్‌ వాగు పొంగిపొర్లుతోంది.  

రికార్డు వర్షపాతం
రూరల్‌ జిల్లా వ్యాప్తంగా 16 మండలాల్లో మూ డు రోజులుగా వర్షం కురుస్తోంది. 1500 మి.మీ. వర్షం పడడంతో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. పాకాల సరస్సులో 30 అడుగులకు గాను నీటిమట్టం 20 అడుగులకు  చేరింది. జిల్లాలో బుధవారం రాత్రి ఒక్క రోజే 742 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, గురువారం 850 మి.మీ. వర్షపాతం నమోదు అయింది. ఇక వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోనూ రెండు రోజులుగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి.  నగరంలోని తోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు కాలనీలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించిపోయింది. జిల్లాలో గత 24 గంటల్లో సరాసరి 44.7 మి.మీ వర్షపాతం నమోదైంది. వరంగల్‌ నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీలు నీటమునిగాయి. ముంపు ప్రాంతాల ప్రజలకు సత్వర సాయం అందించడానికి కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూంను ఏర్పా టు చేసినట్లు కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు.

గోదారి పరవళ్లు
భారీ వర్షాలతో పోటెత్తుతున్న వరద
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల గేట్లు ఓపెన్‌


భూపాలపల్లి, జూలై 22(ఆంధ్రజ్యోతి):
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది పరవళ్లు పెడుతుంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతుండటంతో మహారాష్ట్రలో కూడా కురుస్తున్న వర్షాలకు గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం బ్యారేజీ నుంచి 50 గేట్లు ఎత్తి 4.60లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం బ్యారేజీలో 10.87 టీఎంసీలకు గానూ 4.97 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మానేరు వాగు నుంచి 15వేల క్యూసెక్కుల వరద అన్నారం వద్ద గోదావరిలో కలుస్తోంది. ప్రాణహిత నుంచి 60వేల క్యూసెక్కుల వరద నీరు కాళేశ్వరం వద్ద గోదావరిలోకి వస్తోంది. దీంతో గోదావరి ప్రవా హం 7.75మీటర్లకు చేరుకుంది. దిగువన ఉన్న మేడిగడ్డ బ్యారేజీ వద్ద 16.17 టీఎంసీలకు గాను 10.37 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 2,50,250 క్యూ సెక్కుల వరద బ్యారేజీకి వస్తుండగా 2,68,130 క్యూసెక్కుల నీటిని 41గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.
మేడిగడ్డ వద్ద 10మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవాహం ఉంది. ఎగువన ఉన్న ఎల్లంపల్లి, అన్నారం బ్యారేజీల నుంచి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో భారీగా వరద నీరు బ్యారేజీకి చేరుకునే అవకాశం ఉంది. అలాగే ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం బ్యారేజీ నుంచి మొత్తం 59గేట్లు ఎత్తి 2లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు కాకతీయుల కాలం నాటి రామప్ప చెరువులోకి 35 అడుగులకు గానూ 31 అడుగుల వరద చేరింది. లక్నవరం సరస్సులోకి 36 అడుగులకు గానూ 29 అడుగుల వరకు వరద నీరు చేరింది.

బొగత మహోగ్ర రూపం
వాజేడు, జూలై 22: ములుగు జిల్లా వాజేడు మండలంలోని  బొగత జలపాతం మహోగ్ర రూపం దాల్చింది.  మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువన ఉన్న వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో బొగతకు భారీగా వరద నీరు చేరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. చుట్టూ పచ్చని కొండల మధ్యలోంచి 50 అడుగుల ఎత్తు నుంచి జలప్రవాహం తుంపర్లు ఎగిసిపడుతున్నాయి. కనులవిందుగా ఉన్న బొగత అందాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి.

నష్ట నివారణ చర్యలు చేపట్టండి
సమీక్షలో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి
హన్మకొండ టౌన్‌, జూలై 22: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. గురువారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించి వర్షాలతో ఎలాంటి నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఉమ్మడి  వరంగల్‌ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గోదావరి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ఏ విధమైన నష్టం జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ములుగు కలెక్టర్‌కు సూచించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో చెరువులు, రోడ్లు తెగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్త పడాలన్నారు.  టెలీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ వరద పరిస్థితిని పరిశీలించేందుకు శుక్రవారం  , ములుగు జిల్లాల్లో తాను పర్యటించనున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి చర్యలు చేపట్టాలన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో వర్షాలతో నష్టం జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టేందుకు గురువారం అధికారులతో సమీక్షించి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో మేయర్‌ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు ఆరు జిల్లాల కలెక్టర్లు, పంచాయతీరాజ్‌, రోడ్లు భవనాల శాఖ, నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

















Updated Date - 2021-07-23T06:22:28+05:30 IST